Saturday, September 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలు48 కిలోల బంగారం, వజ్రాలతో గణేశ్ విగ్రహం..వీడిన మిస్టరీ

48 కిలోల బంగారం, వజ్రాలతో గణేశ్ విగ్రహం..వీడిన మిస్టరీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : బేగంబజార్ ఫీల్‌ఖానాలో కొలువుదీరిన ‘లీ చీ కా రాజా గణేశ్–2026’ విగ్రహంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని గోషామహల్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ విగ్రహాన్ని 48 కిలోల పంచలోహాలతో తయారు చేసి, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో పూత పూశారని, 3.8 లక్షల అమెరికన్ డైమండ్లతో అలంకరించారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు.

గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. కొన్ని నివేదికలు దీని విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుందని పేర్కొనడంతో ఈ వార్త మరింత వైరల్ అయింది.

ఈ ప్రచారంపై లోతుగా విచారణ చేపట్టిన గోషామహల్ పోలీసులు అసలు వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. గోషామహల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి.శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వైరల్ సందేశాల్లో చెబుతున్నట్లుగా విగ్రహాన్ని బంగారం, వజ్రాలతో తయారు చేయలేదని నిర్ధారించారు. ‘లీ చీ పెర్ల్స్ అండ్ జ్యువెల్స్’ అనే తమ వ్యాపార సంస్థకు ఉచిత ప్రచారం కల్పించుకోవడం కోసం, ఆర్థిక లబ్ధి పొందే దురుద్దేశంతోనే ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారని పోలీసులు తేల్చారు.

అయితే, ఈ ఆరోపణలపై దుకాణ యజమాని ఆదర్ అగర్వాల్ స్పందిస్తూ తాము ఎలాంటి అతిశయోక్తి ప్రకటనలు చేయలేదని తెలిపారు. ఈ వైరల్ ప్రచారం వల్ల తమ కుటుంబానికి భద్రతాపరమైన సమస్యలు తలెత్తాయని, రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను ఆశ్రయించినట్లు ఆయన వివరించారు.

ఈ నేపథ్యంలో, ప్రజలు ఎలాంటి ఆధారాలు లేని వార్తలను, ఫొటోలను గుడ్డిగా నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేసి అనవసర గందరగోళం సృష్టించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. గణేశ్ ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, అధికారికంగా ధ్రువీకరించిన సమాచారాన్నే విశ్వసించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -