రష్యా చమురుపై వందశాతం కొరడా
ఇప్పుడున్న పన్నులకు ఇది అదనం
ట్రంప్‌నకు మోడీ సాస్టాంగం
భయపెడుతున్న ద్రవ్యోల్బణం
భారత్‌పై అమెరికా సుంకాల ప్రభావం
రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తున్నామంటూ అంతర్జాతీయ వేదికలపై గొప్పలు చెప్పుకున్న మోడీ సర్కారుకు ఇప్పుడు అమెరికా సుంకాల ముప్పు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తే 100 శాతం వరకు అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరించిన విషయం తెలిసిందే. దానికి తలొంచితే భారత్‌లో ఇంధన వ్యయాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఈ దశలో ఏం చేయాలో పాలుపోని భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్‌నకు సాస్టాంగ నమస్కారాలు చేస్తున్నా, కనికరించని విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు దేశ ఎగుమతులు, ఇంధన భద్రత, ప్రజలపై ద్రవ్యోల్బణ భారాన్ని పెంచేస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మోడీ ప్రభుత్వం ఉండిపోయింది.
వాషింగ్టన్, న్యూఢిల్లీ : రష్యా, ఇరాన్‌లపై ఆంక్షలను కఠినతరం చేసే 2026 యాక్ట్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చట్టబద్ధత కల్పించారు. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించే దేశాలపై 100 శాతం వరకు అదనపు దిగుమతి సుంకాలు విధిస్తామని ఆ చట్టంలో ఉంది. ఈ ప్రభావం రష్యా చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై తీవ్రంగా పడనుంది. ఫలితంగా దేశ ఎగుమతులు, ఇంధన భద్రత, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రష్యాపై ఆంక్షలు ఎందుకు?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో రష్యాకు లభిస్తున్న ఆర్థిక వనరులను తగ్గించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. రష్యా నాయకత్వం, ఆ దేశ ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆంక్షలు విధించడం ద్వారా యుద్ధానికి అందుతున్న ఆర్థిక బలాన్ని అడ్డుకోవాలని అమెరికా భావిస్తోంది. తర్వాత చట్టం పేరులో ఇరాన్‌ను కూడా చేర్చారు. ఇరాన్‌పై ఆంక్షలను మరో ఐదేండ్లు.. అంటే 2031 వరకు కొనసాగించేలా నిబంధనలను సవరించారు.
రష్యా చమురు కొనుగోళ్లపై వంద శాతం సుంకం
భారత్‌కు అత్యంత కీలకమైన నిబంధన రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకునే దేశాలపై విధించే సుంకాలకు సంబంధించినది. చట్టం అమల్లోకి వచ్చిన 30 రోజుల తరువాత.. రెండు ప్రమాణాల్లో ఏదో ఒకదానికి సరిపడే దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై 100 శాతం వరకు సుంకం విధించే అవకాశం అమెరికాకు ఉంటుంది. ఇందులో మొదటి ప్రమాణం ప్రకారం.. చట్టం అమలులోకి రాకముందు 12 నెలల కాలంలో రష్యా నుంచి ముడి చమురు లేదా సహజవాయువును అత్యధికంగా దిగుమతి చేసుకున్న ఐదు దేశాల్లో ఒకటిగా ఉండటం. అలాగే, 30 రోజుల గడువు అనంతరం కూడా రష్యా నుంచి చమురు లేదా గ్యాస్ దిగుమతులను కొనసాగించడం. రష్యా ముడి చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా, భారత్ ముందువరుసలో ఉన్నాయి. కాబట్టి ఈ నిబంధన భారత్‌కు ప్రత్యేకంగా ప్రాధాన్యంగా మారింది. ఈ ఏడాది జులైలో భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురులో రష్యా వాటా 51 శాతానికి మించిపోయింది.
హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు పరిమితులు కొనసాగుతున్న సమయంలో.. కేవలం 30 రోజుల్లో రష్యా దిగుమతులను గణనీయంగా తగ్గించడం భారత్‌కు సవాలుగా మారుతుంది. ఇక రెండో ప్రమాణం ప్రకారం… రష్యా చమురుపై విధించిన ఆంక్షలను తప్పించుకునేందుకు సహకరించిన దేశాల్లో… చట్టం అమలుకు ముందు 12 నెలల కాలంలో మొదటి ఐదు దేశాల్లో ఒకటిగా ఉండటం. భారతీయ చమురు మార్కెటింగ్ సంస్థలు తాము కొనుగోలు చేసిన చమురు ఆంక్షలను ఉల్లంఘించకుండా సేకరించినట్టు కథనాలను బట్టి తెలుస్తోంది. అందువల్ల ఈ రెండో ప్రమాణం కింద భారత్‌కు వచ్చే ప్రమాదం తక్కువగా ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటికే ఉన్న సుంకాలకు అదనంగా మరో 100 శాతం
కొత్త చట్టం కింద విధించే సుంకాలు ఇతర దిగుమతి సుంకాలకు అదనంగా ఉంటాయని చట్టంలోని నిబంధన పేర్కొంటోంది. అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301, సెక్షన్ 232 కింద విధించే సుంకాలు కూడా ఇందులోకి వస్తాయి. భారత్ ఇప్పటికే కొన్ని ఉత్పత్తులపై అమెరికా సుంకాలను ఎదుర్కొంటోంది. స్టీల్, అల్యూమినియం, రాగి, వాటి సంబంధిత ఉత్పత్తులపై సెక్షన్ 232 కింద సుంకాల రేటు 50 శాతానికి పెరిగింది. ఈ సుంకాలకు అదనంగా మరో 100 శాతం సుంకం విధిస్తే.. అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల ధరలు పెరిగి, ఎగుమతిదారుల పోటీతత్వం దెబ్బతినే అవకాశం ఉంటుంది. చట్టం అమలైన వెంటనే సుంకాలు విధించాల్సిన అవసరం లేదు. రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను దేశాలు కొనసాగిస్తున్నాయా లేదా అనే విషయాన్ని నిర్ణయించేందుకు 30 రోజుల గడువు ఉంటుంది. ఆ తరువాతే చట్టం కింద సుంకాలు విధించే అవకాశం ఉంటుంది.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
కొత్త చట్టం వల్ల భారత్‌పై పడే ప్రభావాన్ని రెండు విధాలుగా చెప్పొచ్చు. మొదటిది.. రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగించి, సుంకాలను భరించడం. 2025 ఆగస్టు నుంచి 2026 ఫిబ్రవరి వరకు 50 శాతం సుంకాలు అమల్లో ఉన్న సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను ఉదాహరణగా తీసుకోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. 2025 ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో అమెరికాకు భారత వస్తువుల ఎగుమతులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 18 శాతం పెరిగాయి. భవిష్యత్ సుంకాలను దృష్టిలో ఉంచుకుని ఎగుమతిదారులు ముందుగానే సరుకులు పంపడం కూడా ఈ పెరుగుదలకు ఒక కారణమైంది. అయితే 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు మొత్తం కాలాన్ని పరిశీలిస్తే ఎగుమతుల వృద్ధి 3.8 శాతానికి పరిమితమైంది. సుంకాలు అమల్లోకి వచ్చిన తరువాత ఎగుమతుల వేగం తగ్గింది.ఇక రెండోది… రష్యా చమురు దిగుమతులను తగ్గించడం. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గిస్తే, ప్రత్యామ్నాయ సరఫరాదారుల నుంచి చమురు కొనుగోలు చేయాల్సి రావచ్చు. అంతర్జాతీయ చమురు ధరలు పెరిగిన సమయంలో ఇది దిగుమతి వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధిలో రవాణా పరిమితులు కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వనరుల నుంచి చమురు పొందడం మరింత ఖరీదైనదిగా మారుతుంది. దీని ప్రభావం దేశీయ ఇంధన ధరలు, రవాణా వ్యయాలు, ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటుపై పడే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. ఇది అంతర్జాతీయ చమురు ధరలు, దిగుమతుల ప్రత్యామ్నాయాలు, రూపాయి మారకం విలువ, ప్రభుత్వ ధరల విధానం వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది.
’జీ హుజూర్..’ అంటేనే సుంకాల నుంచి మినహాయింపు
ఈ చట్టంలో సుంకాల మినహాయింపుకు సంబంధించిన నిబంధన ఉంది. అమెరికా అధ్యక్షుడు మినహాయింపు ఇవ్వాలంటే.. అది అమెరికా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉందని ధృవీకరించే లిఖితపూర్వక ప్రకటనను కాంగ్రెస్‌కు సమర్పించాలి. అలాగే, ఆ ధృవీకరణకు ఆధారమైన కారణాలను వివరిస్తూ ఒక నివేదికను కూడా అందించాలి. దీనిని బట్టి చూస్తే సుంకాల మినహాయింపు అనేది క్లిష్టమైందే.
రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందం మరో మార్గం!
రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరితే ఆంక్షల పరిస్థితిలో మార్పు రావచ్చని విశ్లేషకులు వివరిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం, ఉక్రెయిన్‌పై సైనిక చర్యలు నిలిపివేయడం, ఆ దేశ ప్రభుత్వాన్ని కూలదోయడం లేదా బలహీనపరచే చర్యలను ఆపడం వంటి షరతులు ఇందులో ఉండే అవకాశాలుంటాయని అంటున్నారు. అయితే శాంతి ఒప్పందం ద్వారా భారత్‌పై విధించే సుంకాలు రద్దవుతాయనే నిర్దారణకు రాలేమని కూడా వారు వివరిస్తున్నారు.



