నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ పాలిత రాష్ట్రం బిహార్ మరో యువ జంటపై ఆకతాయిలు రెచ్చిపోయారు. జముయ్‌లో పదో తరగతి బాలికపై వేధింపుల ఘటన మరువక ముందే సమస్తిపూర్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకువడల కలకలం రేపింది. యువతిని కొందరు చుట్టుముట్టి వేధిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సమస్తిపూర్ జిల్లా కేంద్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని జగత్‌సింగ్‌పుర్ గ్రామం వద్ద బంధ్ బైపాస్ రోడ్డుపై ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఓ యువతి తనతో ఉన్న యువకుడితో కలిసి రోడ్డుపక్కన ఫొటోలు తీసుకుంటుండగా కొందరు యువకులు ఆమెను చుట్టుముట్టారు. ఆమె వివరాలు అడుగుతూ దుర్భాషలాడినట్లు, అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమెను రోడ్డుపై లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఘటనలో ఎంతమంది పాల్గొన్నారన్నది స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.



