– సంక్షేమ హాస్టళ్లలో కేర్ టేకర్స్ తొలగింపు
– ఉపాధి కోల్పోయిన 260 మంది
– తక్కువ వేతనంతో పనిచేస్తున్నా కనికరించని పాలకులు
– 15 ఏండ్లుగా సేవలు అందిస్తున్న కేర్ టేకర్స్
– వారు చేసిన పనులన్నీ విద్యార్థులతో చేయించే యత్నం
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కేర్ టేకర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 260 మంది ఉపాధి కోల్పోయారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే 35 మంది కేర్ టేకర్స్ ఉన్నారు. వీరంతా 15 ఏండ్లుగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్నారు. వారిని ప్రభుత్వం మే నెల నుంచి తొలగించడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఏండ్ల తరబడి విద్యార్థులకు సేవలందిస్తున్న వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. కేర్ టేకర్స్ చేసిన పనులన్నింటినీ ఇకపై విద్యార్థుల చేత చేయించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.
తెలంగాణ రాష్ట్రంలో జీఓ ఎంఎస్ నెంబరు 54 ప్రకారం.. 2014లో 260 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 260 మందిని అసిస్టెంట్ కేర్‌టేకర్స్‌ను తీసుకున్నారు. వీరు మొదట రూ.7500 వేతనంతో విధులు నిర్వహించారు. మూడేండ్ల తర్వాత రూ.10900, ఆ తర్వాత మూడేండ్లపాటు రూ.14170 వేతనం ఇచ్చారు. అయితే, 2024 డిసెంబరు నుంచి వారందరి నియామకాలను ఔట్సోర్సింగ్ కిందకు మార్చి.. రూ.13600 వేతనం ఇస్తున్నారు. కేర్ టేకర్స్‌గా పనిచేస్తున్న వీరు ప్రతి రోజూ విద్యార్థులకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడంతోపాటు పరిసరాల పరిశుభ్రత, గదులు, టాయిలెట్ల క్లీనింగ్, స్టోర్‌లో ఆహారాన్ని భద్రపరచడం వంటి పనులు చేస్తున్నారు. 15ఏండ్లుగా హాస్టళ్లలో ఆరోగ్యం, ఆహారపరంగా ఏ సమస్య రాకుండా పనిచేస్తున్న వీరిని అకారణంగా ప్రభుత్వం మే నెల నుంచి తొలగించింది. ఇకపై వారు చేసిన పనులన్నీ చేయడానికి విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించారు. వీళ్లను ఇద్దరు టీచర్లు గైడ్ చేసేలా నిర్ణయించారు. దీనిపై వివరణ కోసం ‘నవతెలంగాణ’ అధికారులను సంప్రదించే యత్నం చేయగా స్పందన కరువైంది.
విద్యార్థులే పరిశుభ్రం చేసుకోవాలా..
కేర్ టేకర్స్ లేకుండా హాస్టళ్ల నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. కేర్ టేకర్స్‌ను తొలగించి.. వారు చేసే పనులన్నీ విద్యార్థుల చేత చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. గదులు, స్టోర్ క్లినింగ్, టాయిలెట్సు పరిశుభ్రత వంటి పనులు విద్యార్థుల చేత చేయించేందుకు కుట్రలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పోటీ ప్రపంచంలో విద్యను పక్కనబెట్టి పరిశుభ్రత పనులు చేసుకుంటూ ఉంటే.. కార్పోరేటు స్థాయిలో ఎలా రాణిస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విద్యార్థుల బట్టలనే వర్కర్ల చేత ఉతికించాలని కోరుతుంటే.. ఉన్న సిబ్బందిని తొలగించడం సరైందని కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
జీవనం ఎలా కొనసాగాలి?
రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సేవలు అందిస్తున్న కేర్ టేకర్స్‌ను తొలగించడంతో వారంతా రోడ్డున పడ్డారు. హాస్టళ్లలో పని చేస్తున్నందున వారు ఎలాంటి పోటీ పరీక్షలకు కూడా ప్రిపేర్ కాలేదు. ఇప్పుడు కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది ఎస్సీ, బీసీ, ఎస్టీలే ఉన్నారు.
మా బతుకుల్లో మట్టికొట్టకండి..
మల్లయ్య, కేర్ టేకర్ కొల్లాపూర్,
నాగర్‌కర్నూల్ జిల్లా
నేను ఆరేండ్లుగా కేర్‌టేకర్‌గా పనిచేస్తున్నాను. వచ్చే జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. ఉన్నట్టుండి నన్ను కొలువు నుంచి తొలగిస్తే.. ఎలా బతకాలి? నేను ఇతర పోటీ పరీక్షలకు పోలేదు. ప్రభుత్వం దయదలచి తిరిగి ఉపాధి కల్పించాలి.
కేర్‌టేకర్స్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
భీరం హర్షవర్ధన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా
అరకొర వేతనాలతో విధులు నిర్వహిస్తున్న కేర్ టేకర్స్‌ను తొలగించి వీధుల్లోకి నెట్టారు. దీంతో 260 మంది ఉపాధి కోల్పోయారు. ఆహారం పరిశుభ్రంగా అందించాలని ఒక వైపు చెబుతూ.. మరోవైపు ఆహారం అందించే కేర్‌టేకర్స్‌ను తొలగిస్తే నాణ్యమైన అహారం ఎలా అందుతుంది? తొలగించిన కేర్ టేకర్స్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.