నవతెలంగాణ-హైదరాబాద్ : పాశమైలారం ప్రమాద స్థలిని సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం పరిశ్రమలశాఖ అధికారులు, మంత్రులతో సమీక్షించారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో పరిశ్రమలశాఖ అధికారులు, బాయిలర్స్ డైరెక్టర్స్ తనిఖీలు చేశారా? బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా? బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి ఏమైనా సూచనలు చేశారా? అని ప్రశ్నించారు. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిశ్రమలో గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా అని ప్రశ్నించారు. ఊహాజనిత సమాధానాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ప్రమాద ఘటనపై నివేదిక కోసం నిపుణులను నియమించాలని సూచించారు. నిపుణులతో చర్చించిన తర్వాతే సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. కార్మికులకు బీమా సదుపాయం ఉందా అని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమకు అనుమతులు, భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు.
సిగాచీ పరిశ్రమకు సంబంధించిన మొత్తం సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రమాద సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. పరిహారం విషయంలో తీసుకున్న నిర్ణయం చెప్పాలని కంపెనీ ప్రతినిధిని అడిగారు. ప్రమాదంపై కంపెనీ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. పరిశ్రమలో పనిచేసే వారి నైపుణ్యాల గురించి సీఎం ఆరా తీశారు.
ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా యాజమాన్యం ఘటనా స్థలికి రాకపోవడం బాధాకరమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రమాద ఘటనను కార్మిక, వైద్యశాఖ మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సీఎం వెంట మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, వివేక్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. నిన్న ఉదయం పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించిన ఘటనలో ఇప్పటి వరకు 45 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.