– శిథిలావస్థలో జుక్కల్ ప్రయాణ ప్రాంగణం..
– బురదలో కూరుకొపోయిన హైదరాబాద్ 2వ డిపో సర్వీస్ బస్..
– డోజర్ సాయంతో బురద నుండి బస్సు బయటకు
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంతో కొద్దిపాటి వర్షానికి బస్టాండ్ పరిసర ప్రాంతం అంతా బురదతో చిత్తడి చిత్తడిగా మారింది. ప్రయాణికులు బస్టాండ్లోకి రావాలంటే నానా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. బస్టాండ్ ప్రాంతంలో బురదలో మోకాలు లోతు గుంతలు ఏర్పడ్డాయి. దీంతో బురదలో బస్సు ముందరి టైర్లు ఇరుక్కునే సమస్యలు వస్తున్నాయని బస్సు డ్రైవర్లు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ కు చెందిన రెండవ డిపో ఎక్స్ ప్రెస్ బస్సు బురదలో చిక్కుకొని ప్రయాణికులకు ఇబ్బంది కలిగింది.
బురదలో బస్సు టైర్లు లోతుగా దిగిపోవడంతో ట్రాక్టర్ సాయంతో తీయడానికి ఎంత ప్రయత్నించినా బయటికి రాలేదు. చివరి ప్రయత్నంగా డోజర్ యంత్రం సహాయంతో నెట్టి బయటకు తీశారు. అప్పటికే రెండు గంటలు బస్సు ఆలస్యమైందని ప్రయాణికులు డ్రైవర్, కండక్టర్లపై మండిపడ్డారు.
ఈ బస్టాండ్ ను ఎప్పుడో ఉమ్మడి ఏపీలోని ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు నిర్మించారు. నాటినుండి నేటి వరకు ప్రయాణికులు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు బస్టాండ్ స్లాబ్ పైభాగం నుండి వర్షం పడినప్పుడల్లా పెచ్చులు ఊడి పడుతున్నాయి. దీంతో ప్రయాణ ప్రాంగణమంతా నీరు నిండి కూర్చోడానికి వీలు లేకుండా మారుతోంది.
ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే బస్టాండ్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిధులు మంజూరు చేసి బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని మండల ప్రజలు, మూడు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్ధు గ్రామాల ప్రయాణికులు కోరుతున్నారు.