Thursday, July 3, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివాణిజ్య సుంకాలతో ట్రంప్‌ లక్ష్యాలు నెరవేరతాయా?

వాణిజ్య సుంకాలతో ట్రంప్‌ లక్ష్యాలు నెరవేరతాయా?

- Advertisement -

ప్రపంచ దేశాలపై అమెరికా చేస్తున్న వాణిజ్య సుంకాల దాడి గురించీ, దానికి చైనా ప్రతిఘటన గురించి మనం గతవ్యాసంలో చర్చించాం. చట్టవిరుద్ధ సుంకాల విధింపుపై ప్రపంచ దేశాల స్పందనలు, చైనా చేస్తున్న పోరాటం, మరోవైపు భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న పిరికితనం గురించి ఆ వ్యాసంలో కొంత తెలుసుకున్నాం. ఇప్పుడు అసలీ సుంకాల విధింపు ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏమి సాధించదలిచినట్లు? ఆయనేం చెప్పాడు? ఆచరణలో ఆయన చెప్పిన లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంటుందా? అనే విషయాలు స్థూలంగా పరిశీలిద్దాం.
సుంకాల విధింపు ద్వారా మూడు లక్ష్యాలు సాధిస్తామని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అందులో ప్రధానంగా 1.ఇతర దేశాలకు తరలిపోయిన పరిశ్రమలను తిరిగి అమెరికాకు రప్పించటం 2. అమెరికా వాణిజ్య లోటును తద్వారా అప్పులను తగ్గించటం 3. వేగం పుంజుకుంటున్న ‘డీ డాలరైజేషన్‌’ ను వెనక్కు కొట్టటం. వాస్తవానికి ఈ మూడింటిలో ఏ ఒక్కటీ నెరవేరే అవకాశం లేదు.


మొదటిది: ఒకపుడు పారిశ్రామిక ఉత్పత్తిలో ఎంతో ముందున్న అమెరికా నుండి పరిశ్రమలు బయటి దేశాలకు తరలిపోయిన కారణాలు అర్ధం చేసుకుంటే ఆ పరిశ్రమలు తిరిగి రావటం సాధ్యమా, కాదా అనేది తెలిసిపోతుంది. ఇందుకు కారణం ఏ ఒక్క వ్యక్తే లేక ప్రభుత్వమో కాదు. దీనికి ప్రపంచీకరణ ముఖ్య కారణం. అంటే 1970ల తర్వాత ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థ తన అధిక లాభాల కోసం వ్యూహాలను మార్చి ప్రపంచీకరణను ప్రవేశపెట్టటం, ప్రపంచ దేశాలిన్నింటిపైన నయా ఉదారవాద విధానాలను (పెట్టుబడులు, సరుకుల కదలికలపై ఆంక్షలు ఎత్తివేయటం) రుద్ది అమలు చేయించటం జరిగింది. ఎపుడైతే ఈ విధానాల అమలుతో పెట్టుబడి ఎక్కడికైనా ప్రయాణించే స్వేచ్చ లభించిందో అది ఆటోమాటిక్‌గా మూడో ప్రపంచ దేశాలకు తరలి వెళ్లటం ప్రారంభించింది. ఎందుకంటే ‘నీరు పల్లమెరుగు… అన్నట్లు… పెట్టుబడి లాభం ఎక్కడ ఉంటే అక్కడికి’ తరలి వెళ్తుందిగదా?

అదే జరిగింది. అమెరికా లేక ధనిక పెట్టుబడిదారీ దేశాలకంటే పేద దేశాల్లో భూమి, ముడిసరుకులు, మానవశ్రమా చౌకగా దొరుకుతాయి. ఆ దేశాలకు పెట్టుబడులు తరలించి ఉత్పత్తులు చేస్తే చౌకగా ఉత్పత్తులు తయారు అవుతాయి. ఆ ఉత్పత్తులను ధనికదేశాల్లో అధిక లాభాలకు అమ్ముకోవచ్చు. ఆ విధంగా అమెరికాతో సహా ధనిక పారిశ్రామిక దేశాల నుండి పెట్టుబడి తరలిపోయి ఆ దేశాలు ‘డి ఇండిస్టియలైజ్‌’ అయిపోయాయి. 1970ల నుంచీ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ పరిణామ క్రమంలో మూడో ప్రపంచదేశాలలో కొంత పారిశ్రామికీకరణ జరిగింది. అయినా కార్మికుల వేతనాలస్థాయి వాళ్ల కనీస జీవితావసరాల స్థాయికి మించి ఏమీ పెరగలేదు. ఎందుకంటే ఆ దేశాల్లో కావల్సినంత రిజర్వు నిరుద్యోగ సైన్యం పుష్కలంగా ఉంది. అందువల్ల సరుకు ఉత్పత్తి ఇంకా ఈ దేశాల్లోనే సాపేక్షంగా చౌకగా ఉత్పత్తి జరుగుతోంది. ఈ పరిస్థితి కొనసాగుతున్నపుడు అమెరికా అధ్యక్షుడు ఆర్డరు వేయగానే ఆర్థిక నియమాలన్నీ తల్లకిందులై పరిశ్రమలన్నీ అమెరికా దేశానికి పరుగులు పెడతాయా?అది జరిగే పనికాదు.


రెండవది: అమెరికా వాణిజ్యలోటును ప్రభుత్వ 36లక్షల కోట్ల డాలర్ల అప్పును ఈ సుంకాల ద్వారా తగ్గించగలనను కోవటం కూడా అధ్యక్షుడు ట్రంప్‌ భ్రమే తప్ప ఆచరణసాధ్యం కాదు. వాణిజ్య లోటును పూడ్చుకోవటానికి ట్రంప్‌ విధించిన సుంకాల విధింపు లెక్కలోనే పెద్ద తప్పు ఉంది. ఆయన అనుసరించిన పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వేత్తల హేళనకు గురైంది. ట్రంప్‌ చెప్పిన పద్ధతేంటంటే ‘ఉదాహరణకు చైనా నుండి 100 సరుకులు దిగుమతి చేసుకుంటున్నాం. మేము కొన్ని సరుకులు ఎగుమతి చేస్తున్నాం. కానీ మాకు ఇంకా 100రూపాయలు నష్టం వస్తోంది. అంటే చైనా మమ్మల్ని దోపిడీ చేస్తోంది. కాబట్టి చైనాతో వ్యాపారంలో నష్టం పూడ్చుకోవడానికి ఆ దేశం నుండి మాకు వచ్చే సరుకులు 100పైన ఒక్కో రూపాయి అదనంగా సుంకం వేస్తున్నాం.

ఆవిధంగా లోటు 100రూ||లు మాకు భర్తీ అవుతుంది’ ఇదీ ఆయన చెప్పేలెక్క. ఇదెలా ఉందంటే ఒక బిల్డింగ్‌ ఓనర్‌ తన బిల్డింగ్‌లోని ఒక గదిని ఒక కిరాణా షాపుకు అద్దెకిచ్చాడనుకోండి.దాని కిరాయి నెలకు 10వేల రూపాయలు. ఆ షాపులోనే ఆ బిల్డింగ్‌ యజమాని కిరాణా సరుకులు వాడుతున్నాడు. అందుకు నెలకు 15వేలు బిల్లు అవుతుంది. అంటే నా దగ్గర కిరాణా షాపు వాడు నెలకు 5వేలు దోపిడీ చేస్తున్నాడు అంటామా? నీవిచ్చిన గది కిరాయి మార్కెట్‌ ప్రకారం 10వేలు. నీవు వాడే సరుకులు 15వేలు. నీ లోటు పూడ్చుకోవాలంటే నీవు వాడే సరుకులు తగ్గించుకోవాలి తప్ప షాపువాడు నిన్ను దోపిడీ చేస్తున్నాడు కాబట్టి కిరాయి పెంచుతానంటే ఎలా? సరిగ్గా ఇలాగే ఉంది ట్రంప్‌ వాదన.


అంతేగాదు ప్రపంచదేశాలతో వ్యాపారంలో ఈ లోటు ఉంటేనే అమెరికాకు అప్పు సమకూరుతుంది. అమెరికా లోటు దాదాపు ప్రతి సంవత్సరం ఒక లక్షకోట్ల డాలర్లు ఉంటుంది. అంటే దానర్థం ఏమిటి? అమెరికాకు సరుకు పంపిన దేశాలకు ఏటా లక్షకోట్ల డాలర్లు మిగులు ఏర్పడుతోంది. ఆ మిగులు డాలర్లను ఆ దేశాలు అమెరికాకే ప్రభుత్వ బాండ్లను కొనటం ద్వారా అప్పు పెడుతున్నాయి. చైనా, జపాన్‌ తదితర దేశాలు, అనేక ప్రైవేటు కంపెనీలూ, బ్యాంకులూ ఈ విధంగా అమెరికా ప్రభుత్వ బాండ్లను కొని అమెరికా లోటును ఆదుకుంటున్నాయి. దానికి ప్రతిఫలంగా అమెరికన్‌ బాండ్లకు వడ్డీ రూపంలో అవి లాభపడుతున్నాయి. ఈ లోటే లేకపోతే అమెరికాకు అప్పే పుట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అమెరికాకు వాణిజ్యంలో లోటు ఉంటేనే మిగతా దేశాలకు డాలర్లు మిగిలి అమెరిన్‌ బాండ్లు కొనే పరిస్థితి ఉంటుంది. సుంకాల విధింపు ప్రకటన రాగానే అమెరికన్‌ బాండ్లకు డిమాండ్‌ పడిపోయింది. ఆ డిమాండ్‌ పడిపోతే దాని వడ్డీరేటు పెరుగుతుంది. అంటే అమెరికా అప్పు మరింత పెరుగుతుంది. ప్రపంచ కరెన్సీగా ఈ ఏర్పాటు అమెరికాకు మొదట తోడ్పడినా ఇప్పుడు అదే భారమై భయపెడు తోంది. ఈ సంవత్సరం కూడా మరో 2లక్షల డాలర్ల అదనపు అప్పు చేయకతప్పని దుస్థితిలో అమెరికా బడ్జెట్‌లోటు ఉంది. అందువల్ల సుంకాలతో అప్పుతీర్చటం అంటే ఎడారిలో నీళ్లు వెతకటం తప్ప మరోటికాదు.


మూడవది: డీ డాలరైజేషను ప్రమాదం నుండి బయట పడటం ఈ సుంకాల ద్వారా అసలే సాధ్యం కాదు. ఎందుకంటే డాలర్‌ ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీగా తన ఫ్రాధాన్యం కోల్పోవటానికి అర్ధిక అంశాల కంటే అమెరికా యొక్క రాజకీయ స్వయంకృతాపరాధాలే ప్రధాన కారణమనేది స్పష్టం. ఎందుకంటే ప్రపంచ కరెన్సీగా (ప్రపంచ దేశాల మద్య వ్యాపార లావాదేవీల మద్యవర్తిగా), రిజర్వ్‌ కరెన్సీగా (మిగులు ఉన్న దేశాలు, కంపెనీలు ధనాన్ని దాచుకునే రూపంగా) ఉన్న డాలర్‌ను ఆ రూపంలో కొనసాగనివ్వకుండా దానిని తనను వ్యతిరేకించే దేశాలపైన ఒత్తిడి పెంచి లొంగదీసుకునే ‘రాజకీయ ఆయుధంగా’ అమెరికా వాడుతోంది. రాజకీయంగా తనను వ్యతిరేకించే క్యూబా, కొరియా, అర్జెంటీనా, వెని జులా, ఇరాన్‌ వగైరా ఇంకా అనేక దేశాలపైన ‘ఆంక్షల’ పేర వాళ్ల ఆర్ధిక వ్యవస్థలను కట్టడి చేసి లొంగదీసుకునే ప్రయ త్నాలు అమెరికా చాలాకాలంగా అమలు చేస్తోంది.

ఇటీవల ఉక్రెయిన్‌, ఆప్ఘనిస్తాన్‌, రష్యా దేశాలు అమెరికన్‌ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన బిలియన్ల కొద్దీ డాలర్లను చట్ట విరుద్దంగా అమెరికా స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ వ్యాపారంలో తన వ్యతిరేకులందరినీ అణచటానికి వారికి ‘స్విప్ట్‌’ సిస్టమ్‌ అందుబాటులో లేకుండా చేసింది. ఎంతోకాలం ఈ నష్టాలను సహించి, భరించిన అనేక దేశాలు ఇపుడు క్రమంగా తిరగబడటం ప్రారంభించాయి. డాలర్‌ను కాదని తమ దేశ కరెన్సీలతోనే వీలైనంతగా లావాదేవీలు నిర్వహించుకునే ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. రష్యా, ఇరాన్‌ ఆయిల్‌ గ్యాస్‌లను చైనా యువాన్‌లలో, ఇండియా రూపాయల్లో కొనుగోళ్లు జరుపుకోవటం ఇందుకు ఉదాహరణ. ఈ కార్య కలాపాలకు ‘బ్రిక్స్‌’ దేశాలు నాయకత్వం వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంకా అనేక దేశాలు ఇప్పుడీ ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేయాలనే ఆలోచనలు చేస్తున్నాయి.


ఈ ధోరణిని కట్టడి చేయటానికి ట్రంప్‌ ఎవరైనా ‘డీడాలరైజేషన్‌’కు ప్రయత్నిస్తే వారిపైన అదనంగా వంద శాతం సుంకాలు వేస్తానని బెదిరించాడు. అప్పటివరకూ ప్రత్యామ్నాయ కరెన్సీకి మద్దతిస్తూ వచ్చిన ఇండియా ఈ బెదిరింపుకు బేంబేలెత్తి ‘అబ్బే మాకేం తెలియదు. అలాంటి ప్రయత్నాల్లో మేము పాలుపంచుకోము” అని విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ప్రకటన చేయించింది. కానీ మిగతా దేశాలు అలా లేవు. సుంకాల ద్వారా డాలర్‌ను ఎలా నిలబెడతారు? ఇప్పటికే డాలర్‌ లావాదేవీలు 52శాతానికి దిగిపోయాయి. సుంకాల చర్చ తర్వాత డాలర్‌ విలువ ఇంకా పడిపోతోంది.

దాని వల్ల డాలర్‌పై విశ్వాసం ఇంకా సన్నగిల్లి డాలర్‌కు దూరం జరిగే ప్రక్రియ మరింత బలపడుతుందే తప్ప భయపడటం జరగదు. గతంలో ఆప్ఘనిస్తాన్‌, ఇపుడు పశ్చిమాసియా ఇలా క్రమంగా అమెరికా ఆధిపత్యం భంగపడుతున్న పరిస్థితుల్లో వెంటనే కాకపోయినా డాలర్‌ ఆధిపత్యం కూడా బలహీనపడుతుందేగాని ఈ సుంకాల వల్ల అది బలపడుతుందనుకోవటం పగటి కల మాత్రమే.
అందువల్ల ఏ రీతిగా చూసినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సుంకాల ద్వారా సాధించాలనుకునే లక్ష్యాలు ఎండమా వులుగానే కనపడుతున్నాయి. అందువల్ల ట్రంప్‌ పైకి ఏ లక్ష్యాలు ప్రకటించినా హిడెన్‌ ఎజెండా(అప్రకటిత లక్ష్యాలు) వేరే ఉన్నాయి. వాటి గురించి మరోసారి చర్చిద్దాం.

తమ్మినేని వీరభద్రం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -