Tuesday, April 29, 2025
Homeమానవిభావి తరాలకు క‌ళ‌ను పంచుతూ..

భావి తరాలకు క‌ళ‌ను పంచుతూ..

కళ అనేది ఒక జిజ్ఞాస. అయితే అందరూ కళాకారులు కాలేరు. కొందరికి మాత్రమే ఆ నైపుణ్యం అబ్బుతుంది. కళను వ్యాపారంగా, గుర్తింపు కోసం కాకుండా భావి తరాలకు మన భారతీయ కళలు తెలియచేయాలి అనే సంకల్పంతో తాను నేర్చుకున్న విద్యను పలువురికి నేర్పిస్తూ, మానసిక ఆనందాన్ని పొందుతున్నారు విశాఖ ప్రకాష్‌. ఈ రోజు నృత్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ భరత నాట్య గురువు, శ్రీ లాస్య నృత్యానికి వ్యవస్థాపకురాలైన ఆమె పరిచయం నేటి మానవిలో…
చిన్నతనములోనే తండ్రిని కోల్పోయి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఒక వైపు కుటుంబ భారాన్ని మోస్తూ తనకెంతో ఇష్టమైన భరతనాట్యం నేర్చుకున్నారు. ఈ రోజున గురువుగా ఎందరికో తనలోని కళను ధారపోస్తూ, అహర్నిశలు నాట్యమే తన శ్వాసగా చేసుకొని నాట్య కళకు విశేష సేవలు అందిస్తున్నారు. నాట్యం నేర్చుకోవాలి అనే తపన ఉండాలే కానీ, వయసుతో నిమిత్తం లేదంటారు విశాఖ ప్రకాశ్‌.మెరుగులు దిద్దుకునేందుకువిశాఖ ప్రకాష్‌.. లక్ష్మీ సుందరి, ఎమ్‌.రాధాకృష్ణ దంపతుల కుమార్తె. విశాఖ అప్పటి గుంటూరు జిల్లా(ఇప్పుడు బాపట్ల జిల్లా) అయిన రేపల్లెలో జన్మించారు. తండ్రి ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉండటం వల్ల ఈమె ప్రాధమిక విద్య నుండి కళాశాల విద్య వరకు బెంగుళూరులోనే సాగింది. కూతురిలో భరత నాట్యంపై ఉన్న అభిరుచి, నేర్చుకోవాలన్న తపనను గ్రహించిన లక్ష్మీ సుందరి రాధాసింగ్‌ అనే నాట్య గురువు వద్ద చేర్పించారు. ఏడాది పాటు భరతనాట్యం నేర్చుకున్న ఈమె తనలోని కళకు మరింతగా మెరుగులు దిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో సుందర భాస్కర్‌ అనే నాట్య గురువుచే నడుపబడుతున్న కళాశాలలో చేరి భరతనాట్యంలో శిక్షణ పొందారు. భరతనాట్యంలో ఒంటరిగా ప్రదర్శనలనిచ్చే స్థాయికి చేరుకోగలిగారు. నాట్యమే జీవితంగా…ఉద్యోగ పరంగా ఎంతటి ఒత్తిడి ఉన్నా రెండింటినీ సమతుల్యం చేసుకునేందుకు ఎంతో ప్రయత్నం చేశారు. సోలో ప్రదర్శనలిచ్చే అవకాశాలను వదులుకోలేదు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ భరతనాట్య కళాకారిణిగా తనకంటూ ఒక విశిష్టమైన గుర్తింపును పొందారు. ఇటు కుటుంబం అటు నాట్యం బాధ్యతలు చూస్తూనే బీసీఏ పట్టభద్రురాలై సాఫ్ట్‌వేర్‌గా రంగంలో కొన్నేండ్లు వృత్తిని కొనసాగించారు. అయితే వృత్తిపరంగా పెరుగుతున్న ఒత్తిళ్ళు తన కుటుంబ జీవనానికి ఒక అవరోధంగా మారాయి. దాంతో తనకెంతో ఇష్టమైన నాట్యాన్నే ముందుకు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. దీని కోసం ఉద్యోగానికి స్వస్తి పలికి భరతనాట్యానికే అంకితమయ్యారు.
అనతి కాలంలోనే…
భరతనాట్యంలో సునిశిత విశేషాలనెన్నెన్నో అభ్యసించేందుకు విశ్వ విఖ్యాత నాట్య గురువు రాజేశ్వరీ సాయినాథ్‌ దగ్గర శిష్యురాలుగా చేరారు. అనతి కాలంలోనే ఈమె నాట్య కౌశలం, ప్రతిభను గుర్తించిన రాజేశ్వరీ విశాఖను తన బృందంలో చేర్చుకున్నారు. క్రమంగా ఈమె తన గురువుతో కలిసి ముంబాయి, ఢిల్లీ, చెన్నై వంటి మహానగరాల్లో నెలకొన్న ప్రఖ్యాత ఆడిటోరియంలలో ఎన్నెన్నో గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. గురువు ప్రోత్సాహంతో 2007, నవంబర్‌లో తన ఇంట్లోనే కేవలం ముగ్గురు విద్యార్థులతో శ్రీ లాస్య నృత్యాలయ అనే పేరుతో ఒక నృత్య విద్యాలయాన్ని ప్రారంభించారు.గుర్తింపు ముఖ్యం కాదువిశాఖ ప్రారంభించిన ఆ విద్యాలయం ఏవిధమైన ప్రచారం లేకుండానే కేవలం ప్రతిభ ఆధారంగా క్రమంగా అభివృద్ధి చెందసాగింది. అలా ముగ్గురు విద్యార్థులతో ప్రారంభమైన నృత్యాలయం దశాబ్దకాలంలో నూరుగురు విద్యార్ధులతో, రోజుకు ఆరు తరగతులతో వర్ధిల్లుతూ జంటనగరాల్లో గొప్ప ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. ఆమె పొందిన పురస్కారాలలో ముఖ్య మైనవి.. తెంజర్ల నృత్యన్మణి, నృత్య మయూరి, నవరత్న, ప్రతిభా పురస్కారం, బెస్ట్‌ టీచర్‌ అవార్డు మొదలైనవి. పురస్కారాలు, గుర్తింపు కాదు భావి తరానికి తనలోని కళను అందించాలనే తపనే ఆమెను ముందుకు నడిపిస్తోంది. నాట్యకళను ప్రోత్సహించేందుకు…అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఏప్రిల్‌ 29న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆధునిక బ్యాలె సృష్టికర్తగా ప్రసిద్ధి చెందిన జీన్‌ జార్జిస్‌ నోవెర్రె జన్మదినాన్ని అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. నృత్య ప్రాముఖ్యత గురించి ప్రచారం చేసే రోజుగా దీన్ని జరుపుకుంటారు. ఈ రోజున అనేక ఈవెంట్లు, ఉత్సవాల ద్వారా కళారూపంలో పాల్గొనడం, నృత్య విద్యను ప్రోత్సహించటం జరుగుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేసం నృత్య కళారూపం ప్రపంచీకరణను ఛేదించడానికి, సాంస్కృతిక, రాజకీయ, జాతి అడ్డంకులు అధిక మించడానికి, వివిధ నృత్య రీతులు గలా ప్రజలందరినీ ఒకే చోటికి చేర్చడానికి కృషి చేస్తున్నారు.
– పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img