సిబ్బంది పనితీరుపై ఆగ్రహం
ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణ పనులు
త్వరితగతిన పూర్తి చేయాలంటూ సూచన
నవతెలంగాణ – పరకాల : హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శభరీష్ పరకాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వైద్య సేవలు, సౌకర్యాలను పరిశీలించి, రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పేషెంట్స్, అటెండెట్స్ కు ఇస్తున్న ఆహార మెనూను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలోని వివిధ రకాల వైద్య పరికరాలను పరిశీలించారు. ఎక్స్రే మిషన్ సరిగా పనిచేయడం లేదని వైద్య సిబ్బంది కలెక్టర్ కు తెలిపారు. ఈ విషయమై కలక్టర్ మాట్లాడుతూ.. ప్రయివేటు కంపెనీ వద్ద రిపేర్ చేయించాలని, అందుకు సంబంధించిన మెయింటెనెన్స్ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.
30 పడకల సివిల్ ఆస్పత్రి స్థాయి నుంచి నుంచి ఏరియా ఆస్పత్రిగా అప్డేట్ అయినందున ఓపి సహా తదితర రికార్డ్స్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కొన్ని రికార్డ్స్ నిర్వహణ సరిగా లేకపోవడం పట్ల వైద్య సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి సంబంధించిన పలు సమస్యలను సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహాన్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. పరిష్కారానికి కృషి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి…
నూతనంగా నిర్మిస్తున్న ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణాన్ని సందర్శించి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టర్ ప్రేమ్, డిఇ రాజశేఖర్ లను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలంటూ కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట పరకాల ఆర్డిఓ డాక్టర్ కే నారాయణ, తహశీల్దార్ తోట విజయలక్ష్మి, ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, ఏరియా ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ బాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.