Tuesday, July 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅర్హులందరికీ ఇండ్లు ఇవ్వడమే లక్ష్యం

అర్హులందరికీ ఇండ్లు ఇవ్వడమే లక్ష్యం

- Advertisement -

– మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు
– 536 చెంచు కుటుంబాలకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేత
నవ తెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

”అర్హులందరికీ ఇండ్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం.. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఆదివాసీ గిరిజనుల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం. చెంచు కుటుంబాలకు ఇండ్లు ఇస్తున్నాం..” అని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఎక్సైజ్‌ పర్యాటక, సంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే డా.రాజేష్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌తో కలిసి మంత్రులు 536మంది చెంచులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన చెంచులు దశాబ్దాలపాటు సొంత ఇండ్లకు నోచుకోలేదని, వారి కలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం చేస్తోందని తెలిపారు. రాష్ట్ర సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లో పరిధిలోని 21 నియోజకవర్గాల్లో విడతల వారీగా 13,266 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.
ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులు జరుగుతాయని, నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ అవుతాయని తెలిపారు.
తమ ప్రభుత్వం హామీ ఇవ్వని పనులను కూడా పూర్తి చేసిందని, గత ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలనూ కొనసాగిస్తోందని అన్నారు. కృష్ణా నీటిలో తెలంగాణ రాష్ట్ర వాటా కింద వచ్చే జలాల్లో చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు.


వీరికే ఇందిరమ్మ ఇండ్లు
అచ్చంపేట, కొల్లాపూర్‌, నియోజకవర్గాల పరిధిలోని అమ్రాబాద్‌ మండలం మననూరు, మాచారం, అచ్చంపేట మండలం అక్కారం, చందాపూర్‌, పులితీగలబండ, అయినోలు, చౌటపల్లి, గుంపన్పల్లి, లింగాల మండలం లింగాల, అప్పయ్యపల్లి, ఎర్రపెంట, పద్మన్‌పల్లి, వడ్డీ రాయవరం, దారారం, సురాపూర్‌, బల్మూరు మండలం, బిల్లాకాల్‌, ఆంబగిరి, చెంచుగూడెం, బల్మూర్‌, పదర మండలంలోని పెట్రాల్‌ చేను, చిట్లంకుంట, వంకేశ్వరం, మద్దిమడుగు, పల్లెర్రీట్‌ పెంట, కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని నార్లాపూరు, అమరగిరి, మొలచింతలపల్లి, పెద్దకొత్తపల్లి యాపట్ల దేది నోనిపల్లి, మారేడుమాన్‌ దీన్నే, మరికల్‌ గ్రామాల్లో నివసించే 536 మంది చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి.


మాది చేతల ప్రభుత్వం: మంత్రి జూపల్లి
మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి.. మాయమాటలతో పదేండ్లు కాలం వెళ్లదీసిందన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి.. చెంచులకు ఒక్క ఇల్లైనా కట్టించి ఇచ్చారా? అని ప్రశ్నించారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని చెంచు పెంటల్లో జీవిస్తున్న చెంచుల కలలను తమ ప్రభుత్వం సాకారం చేస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలు సొంత గూడు కట్టుకునేలా కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
పేద ప్రజల కోసం వివిధ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, ఐటీడీఏ పీవో రోహిత్‌ గోపిడి, అదనపు కలెక్టర్లు అమరేందర్‌ దేవ సహాయం, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -