– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు
– స్కాలర్‌షిప్‌లపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందూదొందే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసేంత వరకూ రాష్ట్ర ప్రభుత్వంపై సమరశీల పోరాటాలను నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు పిలుపునిచ్చారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందూ దొందేనని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గత ఆరేండ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ అనేది ఆర్థికంగా వెనుకబడిన పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యావకాశాలను అందించ డానికి రాజ్యాంగం కల్పించిన హక్కనీ, అది ప్రభుత్వాల భిక్ష కాదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అందుకుని ఈ సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉండటం ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గత ఆరేండ్ల నుంచి రూ.8,158 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. దీంతో విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దేశంలోనే విద్యాశాఖకు మంత్రి లేని రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని అన్నారు. ప్రజాపాలన పేరుతో మాయమాటలు చెప్తూ కాలం గడుపుతోందన్నారు.ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగారపు రజినీకాంత్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో చెల్లించకపోతే కళాశాలలు, విశ్వ విద్యాలయాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విద్యా నాణ్యతను దెబ్బతీస్తుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం ప్రమాదంలో పడుతుందని చెప్పారు. విద్యారంగంలో సామాజిక అసమానతలు మరింత పెరుగుతాయని వివరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రంలో వేలాదిమంది విద్యార్థులను కూడగట్టి స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్ మెంట్ విడుదల చేయడమో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను పారదోలడమో ఎస్‌ఎఫ్‌ఐ కంకణం కట్టుకుందని హెచ్చరిం చారు. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకుంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు. ఈ కార్య క్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు ఎండి అతిక్, పూజ, ఖమ్మంపాటి శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, అశోక్ రెడ్డి, బావికాడి శంకర్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు శ్రీకాంత్, యార ప్రశాంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్, రమేష్, రమ్య, ప్రణరు, అవినాష్, సహన పాల్గొన్నారు.
ఫీజు బకాయిలు విడుదల చేయాలి అప్పటి వరకు పోరాటాలే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES