Wednesday, July 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనాశనమైపోతావ్‌..

నాశనమైపోతావ్‌..

- Advertisement -

– కేటీఆర్‌.. నిజాలు తెలుసుకొని మాట్లాడు..
– మిడతల దండుతో ములుగుపై పడటం తగదు : మంత్రి డాక్టర్‌ ధనసరి సీతక్క
నవతెలంగాణ- ములుగు

”మేం సమ్మక్క, సారలమ్మ వారసులం.. ఆదివాసీ బిడ్డ జోలికి వస్తే నాశనమైపోతావ్‌ కేటీఆర్‌” అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ములుగు నియోజకవర్గంలో నిజాలు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పట్ల ఇష్టారాజ్యంగా మాట్లాడటం తగదని హెచ్చరించారు. ములుగులో ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన సాగుతోందన్నారు. కేటీఆర్‌ దొర అహంకారం తగ్గించుకోవాలని, కుల, ధన బలం ఉండొచ్చని, కానీ తనకి నియోజకవర్గ ప్రజల బలముందని తెలిపారు. ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ ఓర్వలేకపోతున్నదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో ఇచ్చిన హామీలు, నెరవేర్చిన హామీలు, ఇచ్చిన ఇండ్లు ఎన్నో లెక్క చూసుకొని రావాలని సవాల్‌ విసిరారు. కేటీఆర్‌ మిడుతల దండుతో ములుగుపై పడ్డాడని, ఓడిపోయిన నాయకులు ములుగు వచ్చి డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం చనిపోయిన వారి ఇంటికి వెళ్లి పరామర్శించని వారు రోడ్లపై డ్రామాలు చేయడం సిగ్గు చేటని అన్నారు. పోలీసులు శాంతియుత ధర్నాకు అనుమతిస్తే కాన్వారుని అడ్డుకోవాలని కుట్ర చేశారని అన్నారు. జులై 6 వరకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎన్ని, మీ పాలనలో కాంగ్రెస్‌ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎన్నో తెలపాలన్నారు. దుబారు వేదికగా బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న అబద్ధాలను మానుకోవాలని హితవు పలికారు. ములుగు నియోజకవర్గంలో సీడ్‌తో నష్టపోయిన 950మందికి కంపెనీల ప్రతినిధులతో రూ.4కోట్లు ఇప్పించేందుకు మంత్రి తుమ్మల, తాను వెళ్తుంటే అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. బుట్టాయిగూడెం, చల్వాయిలో చనిపోయిన వారు ఎందుకు చనిపోయారో ముందు కారణాలు తెలుసుకోవాలని అన్నారు. సిరిసిల్లలో ఇసుక లారీలతో తొక్కించి చంపింది, అడ్వకేట్లను చంపింది ఎవరో తెలియదా అని ప్రశ్నించారు. 70ఏండ్ల చరిత్రలో పంచాయతీరాజ్‌ శాఖకు ఒక కోయ ఆడబిడ్డ మంత్రిగా ఉంటే అక్కసు వెళ్లగక్కుతున్నారనీ, తనకు ఒక్క అవకాశం వస్తే ఓర్చుకోలేవా కేటీఆర్‌ అని అన్నారు. ఎన్నికల కోసం డ్రామాలడటం బీఆర్‌ఎస్‌కు తగదని తెలిపారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్‌, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్‌ బానోత్‌ రవి చందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రేగ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -