నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో గాజాలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఆహారం, ఇంధనం, ఔషధాల కొరత తీవ్రంగా ఉందని, ధరలు కూడా భారీగా పెరిగాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. యుద్ధం కారణంగా అక్కడి బ్యాంకులు, ఏటీఎంలు కూడా పని చేయడం లేదు. దీంతో నిత్యావసర వస్తువుల కోసం అక్కడి ప్రజలు అధిక కమీషన్ తీసుకునే దళారులను ఆశ్రయించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బంగారాన్ని కూడా విక్రయించి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసిన వారు కూడా ఉన్నారు.
గాజా వాసులు చాలా లావాదేవీలకు ఇజ్రాయెల్ కరెన్సీ షెకెల్‌ను వినియోగిస్తారు. కానీ టెల్ అవివ్ దీనిని నిలిపివేయడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. గాజాలోని సంపన్న వర్గాలు బ్యాంకుల నుండి తమ డబ్బును విడిపించుకొని దేశం వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుత ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో మధ్యవర్తులు షెకెల్స్‌ను డాలర్లలోకి మార్చేందుకు 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారు.
కూరగాయలు, ఆహారం, నీరు, ఔషధాలు.. ఇలా ఏం కొనుగోలు చేయాలన్నా నగదు లేక, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని షాహిద్ అజ్జూర్ అనే మెడికల్ షాపు యజమాని వాపోయారు. ఆహార పదార్థాల కొనుగోలు కోసం తన వద్ద ఉన్న బంగారాన్ని కూడా విక్రయించానని చెప్పాడు.
గతంలో రెండు రోజులకు నాలుగు డాలర్లు ఖర్చు అయ్యేదని, ఇప్పుడు అది 12 డాలర్లకు పెరిగిందని మరో స్థానికుడు వాపోయాడు. యుద్ధానికి ముందు కిలో 2 డాలర్లుగా ఉన్న చక్కెర ధర ఇప్పుడు 80 నుండి 100 డాలర్లకు పెరిగిందని చెప్పాడు. పెట్రోల్ లీటర్ ధర 25 డాలర్లుగా ఉందని వాపోయాడు