– రెండు కార్లు, 108 కిలోలు స్వాధీనం
– గంజాయి తరలిస్తున్న ఓ మహిళ, మరో ఐదుగురి అరెస్టు : డీసీపీ శ్రీనివాస్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
గంజాయి గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.15లక్షల విలువైన 108 కిలోల గంజాయి, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఒకరు రాష్ట్రంలో గంజాయి తరలిస్తూ పట్టుబడగా, మరో ఐదు మంది దోపిడీలు, దొంగతనాలు చేసి ఒడిశా నుంచి సేకరించిన గంజాయిని ఆంధ్రప్రదేశ్- విజయవాడ మీదుగా తెలంగాణలోకి ప్రవేశించి హైదరాబాద్ శివారు ఔటర్ రింగ్ రోడ్డు గుండా పూణేకు తరలిస్తూ సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చింతమనేని శ్రీనివాస్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులకు ఔటర్ రింగ్ రోడ్డుపై గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్టు పక్కా సమాచారం అందింది. రాజేంద్రనగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌పై వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఒక షిఫ్ట్ డిజైర్ కారు, మారుతి ఇగ్నిస్ కారును ఆపి తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. దాంతో రెండు కార్లతో పాటు వాటిలో ప్రయాణిస్తున్న పూణేకు చెందిన ప్రశాంత్ గణేష్ పసల్కర్, లతా గణేష్ జాదవ్, సచిన్ దిలీప్ రణవారే, రోహన్ పాండురంగ పవార్, రాహుల్ బాబురావు దౌరే, గౌరవ్ మటకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం పోలీసులు వీరిని విచారించగా.. గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఒడిశాకు చెందిన పవన్ దీప్ అనే వ్యక్తి వద్ద కిలో రూ.2,500లకు గంజాయి కొనుగోలు చేసి, దాన్ని ఎవరికీ అనుమానం రాకుండా రెండు కిలోలకి ఒకటి చొప్పున ప్యాక్ చేసి రెండు కార్లలో తరలిస్తున్నామని నిందితులు తెలిపారు. అలా తీసుకువెళ్లిన గంజాయిని పూణేలో కిలో రూ.20వేలకు లేదా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి మరింత ఎక్కువ ధరకు విక్రతలకు సప్లరు చేస్తామని నిందితులు విచారణలో తెలిపారు. కాగా, ప్రధాన నిందితుడు ప్రశాంత్ గణేష్ పసల్కర్‌పై సూర్యాపేట జిల్లా కోదాడ పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్‌ఏ కేసు నమోదైంది. అలాగే పూణేలోని సస్వాద్ పోలీస్ స్టేషన్‌లో వివిధ నేరాలకు పాల్పడగా వివిధ సెక్షన్లలో అతనిపై కేసులు నమోదయ్యాయి. మరో నిందితుడు సచిన్ దిలీప్ రణవారే, రాహుల్ బాబురావు గౌరీ, గౌరవ్ నటేకర్‌పై పూణేలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. కాగా, ఒడిశాలో వీరికి గంజాయి సప్లరు చేసిన పవన్ దీప్ అలియాస్ జీవన్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి ఒక్కొక్కటి రెండు కిలోల చొప్పున ఉన్న 108 కిలోల గంజాయి ప్యాకెట్లు, 6 సెల్‌ఫోన్లు, రూ.9700 నగదుతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.