Wednesday, July 16, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినిరంకుశత్వం

నిరంకుశత్వం

- Advertisement -

జమ్ముకాశ్మీర్‌ స్వాతంత్య్ర సమర యోధులకు నివాళులర్పించేందుకు వెళ్లిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం కేంద్ర దళాలు అడ్డుకోవడం గర్హనీయం. అమరవీరుల దినోత్సవం నాడు ముఖ్యమంత్రితో పాటు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు బయటకు రాకుండా గృహ నిర్బంధం చేయడం, అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ఉన్న నక్సబంద్‌ సాహిబ్‌ సమాధి వద్దకు వెళ్లకుండా భారీ స్థాయిలో పోలీసులను మోహరించి అడ్డుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు.
గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్ల ద్వారా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిరంకుశంగా వ్యవహరించడం కేంద్ర ప్రభుత్వానికి నిత్యకృత్యమైంది. ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాలు పని చేయకుండా అడుగడుగునా అడ్డుకుంటోంది. 1931 జులై 13న డోగ్రా మహారాజు హరిసింగ్‌ దుర్మార్గపు పాలనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన వారిపై ఆర్మీ అమానుషంగా కాల్పులు జరిపి, 22 మందిని పొట్టన పెట్టుకుంది. మరో నలభైమంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ దారుణాన్ని, నాటి అమరుల త్యాగాలను గుర్తు చేసు కుంటూ యేటా జూలై 13న శ్రీనగర్‌లోని వారి సమాధుల వద్ద నివాళులర్పించడం ఆనవాయితీ. 2019 ఆగస్టులో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించి, సమాచార, సాంకేతిక వ్యవస్థను స్తంభింపజేసి, జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర హోదాను, రాజ్యాంగంలో 370, 35 (ఎ) అధికరణలను రద్దు చేసిన కేంద్రం నిర్వాకం ప్రపంచానికి ఎరుకే! ఆ తర్వాత జూలై 13వ తేదీన అమరవీరుల దినోత్సవం సెలవును రద్దుచేసింది. ప్రాణాలు కోల్పోయిన వారంతా అమరవీరులు కారని, అల్లరి మూకలని పేర్కొంటూ అవమానపరిచింది. వారి హత్యకు బాధ్యుడు మాత్రమే గాక, భారతదేశంలో భాగం కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మహారాజా హరిసింగ్‌ జయంతిని సెలవుదినంగా ప్రకటించడం ద్వారా జమ్ము కాశ్మీర్‌ ప్రజలతోపాటు దేశ ప్రజల మనోభావాలను కేంద్రం గాయపరిచింది.
ఆరేళ్లయినా రాష్ట్ర హోదా పునరుద్ధ రించకుండా, తమ చెప్పుచేతల్లో ఉండి సంఫ్‌ు పరివార్‌ అజెండాను ముందుకు తీసుకెళ్లేలా లెఫ్టినెంట్‌ గవర్నర్ల ద్వారా సమాంతర పాలన సాగిస్తోంది. పహల్గాం లాంటి ఉగ్రదాడిని ఎదుర్కోవడంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ నేతృత్వంలో పనిచేసే పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. అదే సమయంలో కాశ్మీర్‌ ప్రజలను నిత్యం అనుమానించే, వేధించే చర్యలు ఏళ్లతరబడి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమైన ముగ్గురు యువకులు హత్యకు గురవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేసిన మహిళలను డిఎస్‌పి స్థాయి అధికారి ఒకరు కాళ్లతో తన్నుతూ, దుర్భాషలాడుతున్న వీడియో పోలీసు దుర్మార్గాలను కళ్లకు కట్టేదే. రాష్ట్ర శాసనసభకు, ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలు పరిమితం చేసేసి పాలన చేతుల్లోకి తీసుకుంటున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి.పోలీసులు, ఏసీబీ, జైళ్లు, ఐఎఎస్‌లు, ఐపీఎస్‌ అధికారులు… ఇలా అనేక అధికారాలు ఎల్‌జికి కట్టబెట్టడం అంటే కేంద్ర హోంశాఖ నిర్వహించడం నిరంకుశ చర్య.
ప్రజల చేత ఎన్నికైన ముఖ్యమంత్రికి, మంత్రి వర్గానికే అమరవీరులకు నివాళులర్పించేందుకు అనుమ తించకపోవడం, బీజేపీయేతర రాజకీయ పార్టీల నేతలందరి నివాసాలకూ తాళాలు వేయడం, రెండోరోజు కూడా సమాధుల ప్రవేశ మార్గాన్ని మూసివేయడం, గోడ దూకి అక్కడికి వెళ్లిన సీఎంపైనే పోలీసులతో దాడి చేయించడం నిరంకుశత్వానికి పరాకాష్ట. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మాని అమరవీరుల దినోత్సవం నాడు సెలవును పునరుద్ధరించాలి. జమ్ముకాశ్మీర్‌ ప్రజల, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించి, రాష్ట్ర హోదా తక్షణం పునరుద్ధరించి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని అధికారాలు అప్పగించాలి. సీఎంపై, నేతలపై, ప్రజలపై దాడి చేయించినందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ క్షమాపణ చెప్పాలి. ఆ దిశగా కేంద్రం మెడలు వంచేందుకు ప్రజా ఉద్యమాలు మరింత ప్రజ్వరిల్లాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -