– ఏపీకి మరింత సహకారం అందించండి
– పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు అనుమతులివ్వండి
– ఏపీకి గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఉంది : కేంద్ర హౌం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రం ఆర్ధిక వనరుల తీవ్రమైన కొరతను ఎదుర్కొంటుందని, అందుకే మరింత సహకారం అందించాలని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కోరారు. మంగళవారం నాడిక్కడ కేంద్ర హౌం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై చర్చించారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్ధిక సాయం అందించే అంశాలపై హౌం మంత్రికి చంద్రబాబు వివరించారు. గత ఏడాదిగా క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రానికి అండగా నిలిచినందుకు అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర సహకారంతో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని తెలిపారు. అయితే ఇప్పటికీ రాష్ట్రం ఆర్ధిక వనరుల పరంగా తీవ్రమైన కొరతను ఎదుర్కోంటుందని, కేంద్రం నుంచి మరింతగా సహకారం అందించాలని కోరారు. విభజన వల్ల ఏపీ ఎదుర్కొన్న ఆర్ధిక నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయింపులు చేసేలా చూడాలని 16వ ఆర్ధిక సంఘానికి నివేదించామని అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అలాగే రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు నీటిని తరలించేందుకు కీలకమైన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పోలవరం నుంచి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వరకూ 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్టు తెలిపారు. అనుసంధాన ప్రాజెక్టు పూర్తి అయితే కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి దక్కే ఫలితాలను అమిత్ షాకు ఆయన వివరించారు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజుల మిగులు జలాలు ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. నదీ ప్రవాహ మార్గంలో చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్‌గా నియమించడంపై హౌం మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబుతో నిటి ఆయోగ్ సభ్యులు వి.కె. సారస్వత్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎరో స్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుపై సారస్వత్‌తో ముఖ్యమంత్రి చర్చించారు. రాయలసీమ ప్రాంతంలో డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని, ఈ పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు ఆ రంగంలో పరిశ్రమలు, పెట్టుబడులు సాధించేందుకు అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం సీఎం చంద్రబాబుని ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ వికాస్ కలిశారు. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో నిర్మాణంపై సహకారంపై చర్చించారు.
ఆర్ధిక వనరుల కొరత తీవ్రం
- Advertisement -
- Advertisement -