Thursday, July 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంటమాటాలనూ వదలని ట్రంప్‌

టమాటాలనూ వదలని ట్రంప్‌

- Advertisement -

– మెక్సికో దిగుమతులపై 17 శాతం సుంకం
– మండిపడుతున్న డెమొక్రాట్లు
వాషింగ్టన్‌ :
కాదేదీ సుంకానికి అనర్హం అన్నది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విధానం. ప్రజలు విరివిగా ఉపయోగించే టమాటాలను కూడా ఆయన వదలడం లేదు. మెక్సికో నుండి దిగుమతి అవుతున్న తాజా టమాటాలపై ఆయన ఏకంగా 17 శాతం సుంకం విధించారు. తద్వారా మూడు దశాబ్దాల క్రితం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. యాంటీ-డంపింగ్‌ సుంకాల నుండి టమాటాలను మినహాయించాలని అప్పట్లో ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ట్రంప్‌ ప్రభుత్వం సోమవారం ఆ ఒప్పందం నుండి వైదొలిగింది. ఆగస్ట్‌ 1వ తేదీ నాటికి అమెరికాతో మెక్సికో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉంది. లేకుంటే మెక్సికో ఉత్పత్తులపై 30 శాతం సుంకం విధిస్తారు.’మా గొప్ప భాగస్వాములలో మెక్సికో కూడా ఒకటి. అయితే ఇంకెంతో కాలం అది అలా ఉండలేదు. ఆ దేశం అనుసరిస్తున్న అవాంఛనీయ వాణిజ్య విధానాల కారణంగా మా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆ విధానాల ఫలితంగా టమాటాల వంటి మా ఉత్పత్తుల ధరలు తగ్గిపోతున్నాయి’ అని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లత్నిక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఈ రోజుతో అదంతా ముగిసిపోయింది. ట్రంప్‌ వాణిజ్య విధానాలు, మెక్సికో పట్ల మా వైఖరి కారణంగా నిబంధనలు మారాయి’ అని చెప్పారు. 90 రోజులలో ఒప్పందం నుండి వైదొలుగుతామని అమెరికా వాణిజ్య శాఖ ఏప్రిల్‌లోనే ప్రకటించింది. మెక్సికో దిగుమతుల ధరలు అన్యాయంగా ఉంటున్నాయని, వాటి నుండి అమెరికా టమాటా ఉత్పత్తిదారులను కాపాడడంలో ఈ ఒప్పందం విఫలమైందని తెలిపింది. అమెరికాలో ఉపయోగిస్తున్న టమాటాలలో 70 శాతం వరకూ మెక్సికో నుండే సరఫరా అవుతున్నాయి. 1994లో ఇది కేవలం 20 శాతంగా ఉండేదని ఫ్లోరిడా టమాటా ఎక్స్ఛేంజ్‌ తెలిపింది. కాగా అమెరికా చర్యను మెక్సికో ఆర్థిక, వ్యవసాయ మంత్రిత్వ శాఖలు ఖండించాయి. ఇది మెక్సికో ఉత్పత్తిదారుల ప్రయోజనాలనే కాకుండా అమెరికా పరిశ్రమ ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తుందని విమర్శించాయి. కాగా సుంకాల విధింపును డెమొక్రాట్లు కూడా తప్పుపట్టారు. దీనివల్ల ధరలు పెరుగుతాయని, ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని హెచ్చరించారు. ట్రంప్‌ నిర్ణయం యాభై వేల ఉద్యోగాలను హరిస్తుందని, ప్రజలపై ధరల భారం పెరుగుతుందని తెలిపారు. ట్రంప్‌ చర్య ఫ్లోరిడా రైతులకు మాత్రమే ఉపయోగపడుతుందని, అరిజోనా వ్యాపారవేత్తలు, ప్రజలు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుందని, ఇదంతా ట్రంప్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వాణిజ్య యుద్ధం ఫలితమేనని వారు మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -