– పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో చట్టాన్ని తీసుకురావాలి : ప్రధాని మోడీకి ప్రతిపక్షనేతలు రాహుల్, ఖర్గే సంయుక్త లేఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) జమ్మూకాశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని లోక్‌సభ, రాజ్యసభలలో ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రధాని మోడీకి వారిద్దరూ సంయుక్తంగా లేఖ రాశారు. ”రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యూటీ జమ్మూకాశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను మంజూరు చేస్తూ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతున్నాం. యూటీ లడఖ్ ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని లేఖలో పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని గత ఐదేండ్లుగా అక్కడి ప్రజలు కోరుతున్నారని గుర్తు చేశారు. దీనితో పాటు లడఖ్‌ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలనీ, ఈ రెండు డిమాండ్లు చట్టబద్ధమైనవనీ, అవి రాజ్యాంగపరంగా, ప్రజాస్వామ్యపరంగా ప్రజలకున్న హక్కులని వివరించారు. యూటీలకు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించిన ఉదాహరణలు గతంలో ఉన్నాయనీ, అయితే జమ్మూకాశ్మీర్ విషయంలో ఇందుకు భిన్నంగా జరిగిందనీ, పూర్తిస్థాయి రాష్ట్రాన్ని యూటీకి తగ్గించి విభజించడం మొదటిసారిగా జరిగిందని వారు లేఖలో పేర్కొన్నారు. ”రాష్ట్ర హౌదాను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యక్తిగతంగా మీరు పలుమార్లు చెప్పారు. 2024, మే 19న భువనేశ్వర్ ఇంటర్వ్యూలో జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని మీరు చెప్పారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని పార్లమెంటులో చెప్పినట్టు కూడా శ్రీనగర్‌లో 2024, సెప్టెంబర్ 19న జరిగిన ర్యాలీలో మీరు పునరుద్ఘాటించారు” అని ప్రధానికి గుర్తు చేశారు. ఆర్టికల్ 370వ రద్దు సమయంలోనూ సాధ్యమైనంత త్వరగా జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తుకు తెచ్చారు.
జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించండి
- Advertisement -
- Advertisement -