నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రోజు కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్ లో అన్ని మండలాల స్పెషల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, మున్సిపల్ కమీషనర్ లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లడుతూ అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ ఇందిరమ్మ ఇండ్లపై దృష్టి పెట్టాలన్నారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు చేపట్టిన ఇండ్లు పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కట్టుకునే వాళ్లకి మట్టి, ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణపు పనులు పూర్తి చేయడంలో యాదాద్రి భువనగిరి జిల్లాను అగ్రగామి గా ఉంచాలని కోరారు. ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు కూడా అందిస్తామని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు.లక్ష్యానికి అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని అధికారులను కోరారు. ఒక్కో మండలం వారీగా కేటాయించిన లబ్ధిదారుల ఇండ్ల మంజూరీ చేసిన వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అధికారులను ఆరా తీశారు.
లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ విషయంలో వెనుకంజలో ఉన్న మండలాలను గుర్తించి, లక్ష్య సాధన కోసం అంకిత భావంతో పని చేయాలని విప్ సూచించారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో లబ్దిదారులను నేరుగా కలిసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలని, ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తేవాలన్నారు.ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను నిశిత పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు నిధుల సమస్య ఎంతమాత్రం లేదని, నిర్మాణాలు చేపడుతున్న లబ్దిదారులకు ఆయా దశలను బట్టి వెంటవెంటనే వారి ఖాతాలలో నిధులు జమ చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు.
బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇల్లు పునాది తీసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. బేస్మెంట్ లెవెల్ పూర్తయిన వారికి ప్రతి సోమవారం లక్ష రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జడ్పీ సీఈఓ శోభారాణి, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి,హౌసింగ్ పీడీ విజయసింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.