సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
చర్లపల్లి బీపీసీఎల్ యూనిట్‌లో ట్యాంకర్ల డ్రైవర్లు, హెల్పర్ల వర్కర్స్ యూనియన్ ఏర్పాటు
నవతెలంగాణ – చర్లపల్లి
తెలంగాణ పెట్రోలియం ట్యాంకర్ల డ్రైవర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించి, వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక రవాణా కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి బీపీసీఎల్ యూనిట్‌లోని తెలంగాణ పెట్రోలియం ట్యాంకర్ల డ్రైవర్లు, హెల్పర్ల వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్న సందర్భంగా గురువారం యూనిట్ ముందు సీఐటీయూ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు, చర్లపల్లి బీపీసీఎల్ యూనిట్ అధ్యక్షులు పి.గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాలడుగు భాస్కర్ మాట్లాడారు. చర్లపల్లి యూనిట్‌లో పనిచేస్తున్న సుమారు 200 మంది డ్రైవర్లు, హెల్పర్లు ఐక్యంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. కార్మికుల హక్కుల సాధనలో యూనియన్ ఏర్పాటు ప్రధాన కీలకమని తెలిపారు.
ప్రమాదాల్లో డ్రైవర్లపై భారీ జరిమానాలు, శిక్షలు విధించడం అన్యాయమన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో డ్రైవర్లకు న్యాయం జరగాలన్నారు. రవాణా రంగ కార్మికులకు గుర్తింపు కార్డులు, ప్రభుత్వ పథకాల పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. డ్రైవర్లకు ప్రమాదం జరిగినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా వారిని ఆదుకోవడానికి ఎవరూ ఉండరని, వారి శ్రమతో డీలర్లు ట్రాన్స్‌పోర్టులు లాభపడుతున్నారని తెలిపారు. వారికి కనీస వేతనం లేదని, భవన నిర్మాణ కార్మికుల మాదిరిగా కార్మికుల కోసం కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, అవసరమైతే డీలర్ల వద్ద నుంచే సెస్ వసూలు చేయాలన్నారు. కనీస వేతనం రూ.26,000, అనుభవజ్ఞులైన నైపుణ్య కార్మికులకు రూ.36,000 చెల్లించాలని కోరారు. అలాగే ఈఎస్‌ఐ, పీఎఫ్, హెల్త్ పాలసీ, ప్రమాద బీమా, పిల్లల విద్యకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోటారు వాహనాల చట్టాన్ని న్యాయంగా అమలు చేయాలని, డ్రైవర్లపై తక్షణమే భారీ జరిమానాలు, కఠిన శిక్షలు విధించకుండా చట్టాన్ని సానుకూలంగా అమలు చేయాలని కోరారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్ మాట్లాడుతూ.. సీఐటీయూ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలుస్తుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జె.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఒక్కడొక్కడిగా పోరాడితే ఫలితం ఉండదని, ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధించుకోగలమని తెలిపారు. పెట్రోలియం ట్యాంకర్ల డ్రైవర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కారం కోసం, అవసరమైతే ఐక్య పోరాటాలు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చర్లపల్లి ఇండిస్టియల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, బీపీసీఎల్ యూనిట్ గౌరవ అధ్యక్షులు జి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. 282 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా బాధ్యులు బంగారు నర్సింగరావు, చర్లపల్లి ఇండిస్టియల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బీవీ సత్యనారాయణ, డంపింగ్ యార్డ్ హెచ్‌ఐఎంఎస్‌డబ్ల్యూ యూనియన్ ప్రధాన కార్యదర్శి రమేష్, చర్లపల్లి బీపీసీఎల్ యూనిట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు షరీఫ్, మల్లేష్, సంయుక్త కార్యదర్శులు ఆంజనేయులు నాగస్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి రాజిరెడ్డి, కోశాధికారి చెన్నకేశవులు, సభ్యులు మహేష్, రాజారెడ్డి, ఖాజ, కుమారస్వామి, నాగరాజు, గంగాధర్ పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
పెట్రోలియం ట్యాంకర్ల డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES