Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎం రేవంత్‌రెడ్డిపై కేసు కొట్టివేత

సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు కొట్టివేత

- Advertisement -

– ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నుంచి హైకోర్టులో ఊరట
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును హైకోర్టు కొట్టేసింది. ఆధారాలు లేకుండా చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులో మూడో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిపై కేవలం ఆరోపణలే ఉన్నాయి. ఘటనాస్థలంలో రేవంత్‌ ఉన్నట్టుగా ప్రాసిక్యూషన్‌ ఆధారాలు చూపలేదు. ఈ పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసును కొనసాగించడానికి వీల్లేదు.. అని జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య గురువారం తీర్పు వెలువరించారు. 2016లో భూవివాదానికి సంబంధించి గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టేయాలన్న రేవంత్‌ అభ్యర్థ నను ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. గోపన్నపల్లిలో సర్వే నెం.127లోని 31 ఎకరాలకు సంబంధించి హక్కుల వివాదంలో ఎస్సీ మ్యూచ్యువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకీ, రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి, ఎ.లక్ష్మయ్యల మధ్య వివాదం నెలకొంది. తమ స్థలంలోకి చొరబడ్డారంటూ సొసైటీకి చెందిన ఎన్‌.పెద్దిరాజు ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఈ కేసును మరో రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామనీ, అప్పటి వరకు ఈ కేసులో ఉత్తర్వులు ఇవ్వొద్దని పెద్దిరాజు లాయర్‌ చేసిన వినతిని న్యాయస్థానం తిరస్కరించింది. వాదనలు పూర్తయ్యాక ఉత్తర్వుల జారీ మా విధి అని తేల్చి చెప్పింది. ఫిర్యాదుదారుడి అభ్యర్థనను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది.

కాల్పుల కేసు నిందితుడికి ముందస్తు బెయిల్‌
స్థానిక గచ్చిబౌలిలో ప్రిజం పబ్‌లో కాల్పుల సంఘటన కేసులోని మూడో నిందితుడైన రామేంద్రకుమార్‌ రవికి గురువారం హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. కాల్పులు జరిపిన బాతుల ప్రభాకర్‌కు ఆయుధాలను సరఫరా చేశారంటూ నమోదైన కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలన్న ఆయన పిటిషన్‌ను జస్టిస్‌ శ్రీనివాస్‌రావు విచారించారు. రూ.50 వేల వ్యక్తిగత బాండ్‌తోపాటు అంతే మొత్తానికి రెండు పూచీకత్తులు సమర్పించాలనీ.. నాలుగు వారాలపాటు ప్రతి సోమవారం పోలీసు స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలనీ, సాక్షులను ప్రభావితం చేయొద్దని షరతులు విధించారు

కేటీఆర్‌ కేసులో నోటీసులు
నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పీఎస్‌లో బీఆర్‌ఎస్‌ అగ్రనేత కేటీ రామారావుపై నమోదైన కేసులో ప్రతివాదులైన పోలీసులకు ఫిర్యాదుదారులకు హైకోర్టు నోటీసులిచ్చింది. సాక్షుల వాంగ్మూలాలను అందజేయాలని ఆదేశించింది. నకిరేకల్‌లో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం పేపర్‌ లీక్‌ అయిందంటూ సోషల్‌ మీడియాలో కేటీఆర్‌ తప్పుడు ప్రచారం చేశారని నకిరేకల్‌ మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ రజిత చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసును కేటీఆర్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. మాస్‌ కాపీయింగ్‌ నిందితులతో తనకు సంబంధాలున్నాయంటూ ఆయన ఎక్స్‌’లో పోస్టు చేశారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్‌ లాయర్‌ స్పందిస్తూ, టీవీ చానల్‌లో వచ్చిన వార్తను మాత్రమే సోషల్‌ మీడియాలో పోస్టు చేశారనీ, అవి తన వ్యక్తిగత వ్యాఖ్యలు కావన్నారు. విచారణను కోర్టు ఆగస్టు 5కి వాయిదా వేసింది.
అక్రమ లేఔట్‌పై వివరాలివ్వండి
వందల కోట్ల విలువైన భూమిలో లేఔట్‌పై పిటిషన్‌
మెదక్‌ కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిప్పలతుర్తి గ్రామంలో వందల కోట్ల విలువైన 112.21 ఎకరాల్లోని లేఔట్‌, అందుకు మంజూరు చేసిన అనుమతుల వివరాలు నివేదించాలని ఆ గ్రామ పంచాయతీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చిప్పలతుర్తిలో సర్వే నెం. 58/1 నుంచి 5, 12, 59/30, 31, 32, 40లోని 112 21 ఎకరాల భూమి విషయంలో చట్ట వ్యతిరేకంగా ఎంట్రీలను నమోదు చేశారనీ, దీనిపై విచారణ జరపాలంటూ గత ఏప్రిల్‌ 15న ప్రభుత్వానికి వినతిపత్రం ఇస్తే చర్యలు లేవని పేర్కొన్నారు. జి. అశోక్‌ మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని జస్టిస్‌ కె లక్ష్మణ్‌ బుధవారం విచారణ జరిపి గ్రామ పంచాయతీ వివరణ నిమిత్తం తదుపరి విచారణ ఈ నెల 22కి వాయిదా వేశారు. ఈ భూములపై 2020లో కలెక్టర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ సాయంతో అక్రమ పద్దులు రిజిస్టర్‌ అయ్యాయని, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంతోపాటు కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా చర్యలు లేవని పిటిషనర్‌ తరుపు న్యాయవాది వాదించారు.
బిల్లు చెల్లించండి లేదా కోర్టుకు రండి
హెచ్‌సీఏ సీఈవో, సెక్రెటరీలకు హైకోర్టు ఆదేశం

చేసిన పనులకు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించాలన్న గత ఉత్తర్వులను అమలు చేసేందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఆర్‌ దేవరాజ్‌, సీఈఓ సునీల్‌ బోస్‌ కాంటేలకు హైకోర్టు మరో అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణలోగా తమ ఆదేశాలు అమలు చేయని పక్షంలో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవాలంటూ నోటీసులు జారీ చేసింది. తాము చేసిన పనులకు చెల్లించాల్సిన రూ.19 లక్షల బిల్లు వ్యవహారంపై గంజం డెకార్‌ సర్వీసెస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. 2024 అక్టోబరులో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు బిల్లులను చెల్లించలేదని తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారించిన జస్టిస్‌ నగేశ్‌ భీమపాక బుధవారం విచారణ చేపట్టారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయని వారిపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో ఈ నెల 18న జరిగే విచారణ సమయంలో స్పష్టం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు హెచ్‌సీఏ సెక్రెటరీ, సీఈఓలకు నోటీసులు ఇచ్చారు. ఒకవేళ తమ ఉత్తర్వులను అమలు చేస్తే, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.
ఐఏఎస్‌ అధికారులకు కోర్టుధిక్కార నోటీసులు
వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణివ్వాలంటూ ఆదేశం

చేప పిల్లల పంపిణీకి సంబంధించి నగదు చెల్లింపులు చేయాలని గత డిసెంబర్‌లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసే తీరిక లేదా? అని పలువురు ఐఏఎస్‌ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే ఎందుకు స్పందించటం లేదని నిలదీసింది. తమ ఉత్తర్వులను అమలు చేయకపోగా, కోర్టు ధిక్కరణ పిటిషన్‌ విచారణ సమయంలో చిట్టచివరి అవకాశం కల్పించినప్పటికీ కదలిక లేకపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్వులను అమలు చేయకపోవడం ఒకటైతే.. కనీసం వాదనలతో కౌంటర్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేయకపోవటాన్ని తప్పుపట్టింది. ఈ నెల 30న జరిగే విచారణకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోరాదో స్వయంగా హాజరై స్పష్టం చేయాలని సూచించింది. పశుసంవర్ధక, మత్స్యశాఖ ముఖ్యకార్యదర్శి సవ్యసాచి ఘోష్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్‌ ప్రియాంక అలా, డిప్యూటీ డైరెక్టర్‌ టి. శ్రీనివాస్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, ములుగు కలెక్టర్లలకు కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేసింది.2023-24లో పంపిణీ చేసిన చేప పిల్లలకు నగదు చెల్లించకపోవడంతో శ్రీ మత్స్య ఫిషరీస్‌ ఫామ్స్‌ పాటు పలు చేప పిల్లల ఉత్పత్తి సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. చేప పిల్లల సరఫరాపై విజిలెన్స్‌ కమిషన్‌ రిపోర్టును పరిశీలించాక అర్హులైన వారికి సొమ్ము చెల్లించాలని 2024 డిసెంబర్‌లో హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో గత ఏడు నెల్లుగా కోర్టు ఉత్తర్వులను అధికారులు ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదంటూ జస్టిస్‌ ఎన్‌.వి. శ్రవణ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవే పిటిషన్లు ఈనెల 2న విచారణకు వచ్చినప్పుడు చిట్ట చివరి అవకాశం ఇవ్వాలని అధికారుల తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో విచారణ బుధవారం మళ్లీ జరిగినప్పడు పిటిషనర్‌ న్యాయవాది డి ఎల్‌ పాండు స్పందిస్తూ, గత విచారణ నాటి పరిస్థితుల్లో ఏమీ మార్పులు లేవనీ, ఏమీ చెల్లింపులు చేయలేదని అన్నారు. దీనిపై హైకోర్టు తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేసింది. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని సదరు ఐఏఎస్‌ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

మంత్రి ఉత్తమ్‌కు హైకోర్టులో ఊరట
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారనే అభియోగాల కేసుల్లో రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మూడు వేర్వేరు కేసుల్లో ఒకదానిని కొట్టేయగా, మరో రెండు కేసుల విచారణ జరిపి, కింది కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తూ జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ బుధవారం ఉత్తర్వులను వెలువరించారు. హుజూర్‌నగరలో 2019 ఉప ఎన్నికలప్పుడు తన భార్య పద్మావతికి మద్దతుగా ఉత్తమ్‌ అనుమతి లేకుండా రోడ్‌ షో జరిపారని, మఠంపల్లి చౌరస్తాలో భారీ జనసభలో మాట్లాడారంటూ నేరేడుచర్లలో, మఠంపల్లిలో మూడు కేసులు నమోదయ్యాయి. వీటిని రద్దు చేయాలంటూ ఉత్తమ్‌ వేసిన పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి, నేరేడుచర్లలో నమోదైన ఓ కేసు కొట్టివేశారు. మిగిలిన కేసుల్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.
యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌గా శ్యాం కోశీ
తెలంగాణ హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌గా పి.శ్యాం కోశీ గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఈ పదవిలో ఆయనను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజరుపాల్‌ కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అయ్యారు. కాగా.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్‌ కుమార్‌ సింగ్‌ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్పటివరకు జస్టిస్‌ పి.శ్యాం కోశీ యాక్టింగ్‌ సీజేగా విధులు నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -