ఈటల – బండి మధ్య ఆధిపత్యపోరు
‘హుజూరాబాద్’ కేంద్రంగా మాటల యుద్ధం
బండి పోరు పడలేక నియోజకవర్గ ఇన్‌చార్జి గౌతంరెడ్డి రాజీనామా
సోషల్‌మీడియా వేదికగా రెండు గ్రూపుల మధ్య లొల్లి
కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. హుజురాబాద్ నియోజకవర్గంపై పట్టు కోసం మొదలైన ఈ పోరు మాటల యుద్ధానికి తెరలేపింది. బండి గ్రూపు పోరు పడలేక నియోజకవర్గ ఇన్‌చార్జి గౌతంరెడ్డి రాజీనామా చేయడం…ఆ నియోజకవర్గంలోని ముఖ్య నేతలంతా ఈటల ఇంటికెళ్లి తమ పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. ఈసందర్భంగా అనుచరులకు నచ్చజెప్పే క్రమంలో ఈటల రాజేందర్ బండిపై ఫైర్ అయ్యారు. కమలం పార్టీ నుంచి రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి, ఈటల వర్గాల ఆధిపత్య పోరు ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి తలనొప్పిగా మారింది.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పార్టీ అధ్యక్ష పదవి రాకుండా సీనియర్లు అడ్డుకోవడం, మరోవైపు హుజురాబాద్ నియోజకవర్గంలో బండి మితిమీరిన జోక్యంతో ఇక ఆ పార్టీలో ఇమడలేననే నిర్ణయానికి ఈటల వచ్చారనే ప్రచారం జరుగుతున్నది. ”కులం, మతం, వర్గం ఎల్లకాలం పనిచేయవు. మనుషుల వ్యక్తిత్వాలు కూడా పనిచేస్తాయి” అని ఈటల మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజకీయాలు మొత్తం బీసీల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనకు వచ్చారనే ప్రచారమూ జరుగుతోంది.
ఇదీ కత…
కరీంనగర్ పార్లమెంటరీ స్థానంలో మరింత బలోపేతం అయ్యేందుకు బండి ప్లాట్‌ఫాం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే తన ఎంపీ స్థానం పరిధిలోని హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటిదాకా అక్కడ ఈటల చెప్పిందే నడిచింది. ఈటల మల్కాజిగిరి ఎంపీ అయ్యాక హుజురాబాద్‌పై కేంద్రీకరణ తగ్గింది. అదే సమయంలో ఈటల గ్రూపునకు చెక్ పెట్టి, తనను ప్రమోట్ చేసుకునే పనిలో బండి పడ్డారు. ఇటీవల మండలాధ్యక్షుల ప్రకటన సమయంలో ఈటల గ్రూపు వాళ్లకు పదవులు దక్కకుండా బండి అడ్డుకున్నారనే ఆరోపణలున్నా యి. జమ్మికుంట మండలాధ్య క్షులుగా శ్యామ్‌పేరు ఖరారైనప్పటికీ, చివరి నిమిషంలో బండి సంజయ్ అడ్డుతగిలి రాకుండా చేశారనే ప్రచారముంది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న గౌతంరెడ్డిని కూడా టార్గెట్ చేశారు. ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో బండి సంజయ్ అక్కడి పార్టీ గ్రూపుల గురించి మాట్లాడారు. బీజేపీలో మోడీ గ్రూప్ తప్ప మరో గ్రూప్ లేదనీ, ఈ నియోజకవర్గంలో ఇంకో వర్గం అని ఎందుకు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వాళ్లకు స్థానిక ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీనికి కొనసాగింపుగా సోషల్‌మీడియా వేదికగా ఈటలపై తప్పుడు ప్రచారం మొదలైంది. దీన్ని బండి అనుచరులే నడిపిస్తున్నారనే ఈటల వర్గం ఆరోపిస్తున్నది. ఈటలను నమ్ముకుంటే పదవులు రావనీ, బండి వైపు రావాల్సిందే అంటూ క్షేత్రస్థాయి నేతలకు సంకేతాలు పంపారనే చర్చా జరుగుతుంది. ఈ గోలల మధ్యే ఈటల ప్రధాన అనుచరుడు, హుజూరాబాద్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి గౌతంరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు భారీ సంఖ్యలో ఈటల ఇంటికి వెళ్లారు. నియోజకవర్గంలో బండి గ్రూపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పుకొచ్చారు. మిమ్మల్ని నమ్ముకున్నామనీ, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
బండిపై ఫైర్
ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కేంద్రమంత్రి బండి సంజయ్ పేరు ప్రస్తావించకుండా, పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కురుచమనసత్వం నాయకులు అని కామెంట్స్ చేశారు. ప్రజలు కులం, మతం, వర్గం ఎప్పుడూ చూడరనీ, మంచోళ్లా కాదా అని మాత్రమే చూస్తారని ఈటల అన్నారు. అయితే బీజేపీలో ఈ అంశాల ప్రాతిపదికనే రాజకీయాలు నడుస్తాయనే విషయం తెలియంది కాదు. చాలామంది సీఎంలతో తానుకొట్లాడాననీ, వీళ్లెంత? చెప్పుకొచ్చారు. ఈటల వ్యాఖ్యలతో ఆయన సొంతపార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఎవడెవడు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారో..ఏమేం రెచ్చగొడుతున్నారో అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాననీ చెప్పారు. ”హుజురాబాద్ గడ్డ మీద నా వార్డు మెంబరుంటాడు..సర్పంచి ఉంటాడు..ఎంపీటీసీ ఉంటాడు…ప్రజల కోసం నిలబడ్డోళ్లం మనం. ప్రజల మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. నాకున్న లోకల్ బాడీ ఎన్నికలు హుజురాబాదే” అంటూ బండితో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమనే సంకేతాలు పంపారు. దీనితో రాష్ట్ర బీజేపీలో మరోకొత్త ముసలం ప్రారంభమైంది. రాజాసింగ్ రూట్‌లోనే ఈటల వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది. సొంతపార్టీ ఏర్పాటుపైనా రాజకీయ చర్చ జరుగుతోంది.
బీజేపీలో ముసలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES