అతడో యుద్ధ ఖజానా!
వోడిపోతున్న ప్రతి చోట మనిషి మరణపు పాట
అతడి గొంతులోంచే వినిస్తుంది
ఇవ్వండి నోబెల్ శాంతి బహుమతి
అతడి చేతి నిండా ఆయుధాలు కండ్లు చిట్లిస్తాయి
అతడి నోటి నుంచి మరణించిన
సీతాకోకచిలుకలు రాల్తుంటాయి
అతడు దుకాణం తెరిచిన యుద్ధమగాల వ్యాపారి
ప్రపంచ పటం ముందటేస్కోనీ
మనసు పారేసుకున్న చోటల్లా
ప్రేమోన్మాదిలా యుద్ధం ముద్రిస్తుంటాడు
అతడి నీడలో కూలిన చెట్టు దుఃఖిస్తుంటుంది
ఇవ్వండి అతడికి శాంతి బహుమతి
అతడి కళ్ళల్లో తెల్ల పావురాలు నిషేధించు కున్నాడు
అతడి హదయంలో ప్రేమగీతాలు దగ్ధం చేసుకున్నాడు
భూ భ్రమణమంతా అతడి ఆయుధం నీడ తిప్పుతూ
మనిషి ప్రవాహ నేలంతా యుద్ధకల కంటాడు
యుద్ధలోలుడతడు హదయస్పందన కోల్పోయిన
నదుల కన్నీళ్లు తాగుతుంటాడు
అతడి ఆయుధ శకలం తగిలి రాలే మనుషులే
డాలర్లవర్షం అతడికి
నూనె ఎడారుల యుద్ధం అతడికి పండుగ
ఇవ్వండి అతడికి శాంతి బహుమతి
యుద్ధ బలుల్లో సామాన్యడో సైనికుడో
సంపద్వంత భూభాగమో
తన పల్లవికి ఎగిరే
ఉక్రెయిన్ ఇజ్రాయిల్ భుజాల మీద తుపాకీతో
తుపాకి రాముడి వేషం కడుతాడు
మనిషి చావుకు అంతర్జాతీయ కన్నీళ్లేమీ కారవు
యుద్ధ వ్యాపారి కళ్లల్లో ఆనందమే
ఈ దేశ సింహాసనమూ ముచ్చట పడ్తుంది
ఎవరెవరికో పెట్టిన సుంకాల ఉచ్చు
బుమరాంగుల తన మెడనే కౌగిలించుకొనేసరికే
పిచ్చి వాడి చేతి రాయిలా యుద్ధాన్ని విసురుతున్నాడు
ఇవ్వండి అతడికి శాంతి బహుమతి
ఆర్థిక సంక్షోభపిడచ కట్టి
డాలర్క్ దాహం వేస్తున్న కొద్ది
యుద్ధమూ శాంతి అతడి చేతిలో తోలుబొమ్మలైతాయి
ఇవ్వండి అతడికి శాంతి బహుమతి
కాలం ఇంకో సద్దాంను కల కనేలా చేస్తుంటాడు
బొమ్మగానో బొర్సుగానో అతడు యుద్ధం చేస్తాడు
అతడు యుద్ధం అమ్ముతాడు
దారం తెగాక అదనపు బేరసారాలతో
అతడు యుద్ధం ఆపుతానని భ్రమల్లో పెడతాడు
ఇవ్వండి అతడికి శాంతి బహుమతి
ఇప్పుడు ఈ భూగోళాన్ని పట్టిన యుధ్ధం గాడికి
– వడ్డెబోయిన శ్రీనివాస్, 9885756071
వొక యుద్ధం గాడు
- Advertisement -
- Advertisement -