పార్లమెంట్‌లో భగ్గుమన్న ప్రతిపక్షాల నిరసనలు..
ప్రతిపక్ష నేతగా మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు : రాహుల్
జస్టిస్ యశ్వంత్ వర్మపై అభింశసనకు 200 మంది సంతకాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలి రోజే వాడీ వేడీగా జరిగాయి. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షాలు ప్రతి నిధులు పరస్పరం నినాదానాలతో హెరెత్తించారు. ‘ఆపరేషన్ సిందూర్’, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధాని మోడీ స్పందించాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. స్పీకర్ ఓం బిర్లా ఎంత వారించినా వాళ్లు నిరసనకు దిగడంతో లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం లోక్‌సభ మొదలైన కాసేపటికే ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. భారత్, పాక్‌ల మధ్య యుద్ధాన్ని నేను ఆపాను అంటూ ట్రంప్ ప్రగల్భాలు పలకడంపై మోడీ సభా వేదికగా వివరించాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. అయితే.. స్పీకర్ ఓం బిర్లా తరు వాత చర్చల్లో అందుకు అను మతి స్తానంటూ చెప్పారు. అయినా సరే కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్‌పీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్‌సీపీ తదితర ఇండియా బ్లాక్ పార్టీల ఎంపీలు ప్రధాని మాట్లాడాల్సిందే నని పట్టుబట్టారు. సభ మొదలైన కాసేపటికే మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో కూడా ప్రతి పక్షాలు పట్టువీడకపోవడంతో సభ సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. తరువాత ప్రారంభమైన సభలో అదే పరిస్థితి కొనసాగడం తో చివరకు నేటికి సభను వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఏ అంశంపై అయినా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కిరణ్ రిజిజు మరింత వివరణ ఇస్తూ, మధ్యాహ్నం 2.30 గంటలకు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ఉందని, ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంటే వాళ్లు (ప్రతిపక్ష ఎంపీలు) సభలో నిరసన తెలుపుతున్నారని, సమావేశాల తొలిరోజే ఇలా చేయడం సరికాదని అన్నారు.
ప్రతిపక్ష నేతగా పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు : రాహుల్ గాంధీ
లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ తనను మాట్లాడనివ్వట్లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ సమావేశాల్లో అధికార పక్షం పక్షపాతంతో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రక్షణ మంత్రి, ప్రభుత్వంలోని ఇతర మంత్రులకు మాట్లాడటానికి అనుమతి ఇచ్చారని, తనకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ‘పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. రక్షణ మంత్రి, ప్రభుత్వంలోని ఇతర మంత్రులకు మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నాతో సహా ప్రతిపక్ష సభ్యులను అనుమతించలేదు. ఇదో కొత్త తరహా విధానం. ప్రభుత్వం వైపు ఉన్న వాళ్లను మాట్లాడేందుకు అనుమతించినప్పుడు మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడమే సంప్రదాయం. నేను లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని. ప్రతిపక్ష నేతగా మాట్లాడే హక్కు నాకు ఉంది. కానీ వారు నన్ను మాట్లాడనివ్వట్లేదు. అభిప్రాయాలను తెలియజేసే అవకాశం నాకు ఇవ్వట్లేదు’ అని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తావిస్తూ.. వాళ్లు చర్చించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతను కూడా మాట్లాడనీయాలని, ఆయన మాట్లాడేందుకు లేచినప్పుడు అనుతించాల్సి ఉంటుందని అన్నారు.
జస్టిస్ యశ్వంత్ వర్మపై అభింశసనకు 200 మంది సంతకాలు
అవినీతికి పాల్పడిన అలహాబాద్ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మపై వేటుకు రంగం సిద్ధమైంది. భారీగా నోట్ల కట్టలు పట్టుబడిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయనపై అభింశసన తీర్మానాన్ని ఎంపీలు పెట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజునే పార్టీలకతీతంగా ఇరు సభల్లోని 200ల మంది తీర్మానంపై సంతకాలు చేశారు. అనంతరం ఆ పత్రాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217, 218 కింద జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానానికి బీజేడీ, కాంగ్రెస్, జేడీయూ, సీపీఐ(ఎం), ఎన్‌సీపీ తదితర పార్టీల ఎంపీలతో పాటు వివిధ పార్టీల సభ్యులు కూడా మద్దతు తెలిపారు. అభిశంసన తీర్మానంపై సంతకాలు చేసిన వాళ్లలో రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీ, సుప్రియా సూలే, కెసి వేణుగోపాల్, .కె.రాధాకృష్ణన్ తదితరులు ఉన్నారు. రాజ్యసభలోనూ జస్టిస్ వర్మను తొలగించాలని తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. 50 మంది ఆయనను తొలగించాలని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్‌ను కోరారు.
రాజ్యసభలో తీవ్ర గందరగోళం
ఇటు రాజ్యసభలో కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. ఆపరేషన్ సిందూర్‌పై చర్చించాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని లేవనెత్తారు. అయితే, సభా నాయకుడు జేపీ నడ్డా స్పందించారు. మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో మాట్లాడుతూ పహల్గాం ఉగ్రవాద దాడి నిందితులను ఇంకా పట్టించుకోలేదన్నారు. అంశంపై అన్ని పార్టీలు ఐక్యంగా ప్రభుత్వానికి మద్దతు తెలిపాయని, దాడితో పాటు ఆ తరువాత జరిగిన ఘటనలపై సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్ స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు. అదే సమయంలో చాలామంది సీనియర్ సైనిక అధికారులు సైతం అనేక విషయాలను వెల్లడించారన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో సమాచారం ఇవ్వాలన్నారు. తన మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ ఒప్పందం కురిదిందని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 24 సార్లు చెప్పారని, వేరే దేశానికి చెందిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశానికే అవమానకరమన్నారు. జేపీ నడ్డా మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ గురించి సహా ప్రతి అంశంపై చర్చించిస్తామని, ప్రతి అంశాన్ని సభ టేబుల్‌పై ఉంచుతామని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పటివరకు ప్రధానమంత్రి నాయకత్వంలో ఆపరేషన్ సిందూర్‌లో జరిగినట్లుగా ఇలాంటి ఆపరేషన్ జరగలేదన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చ కోసం సభలో నోటీసు ఇచ్చారని, ప్రభుత్వం చర్చిస్తుందని, ప్రతి ప్రశ్నలకు సమాధానం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.