Wednesday, April 30, 2025
Homeజాతీయంసుప్రీంతీర్పుతో లైన్‌క్లియర్‌

సుప్రీంతీర్పుతో లైన్‌క్లియర్‌

– తమిళనాడులో చట్టాలుగా పది బిల్లులు
– రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదం లేకుండానే నోటిఫై
– రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
– రాజ్యాంగ చరిత్రలో తొలిసారి
న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్ల వద్ద ఉండే పెండింగ్‌ బిల్లులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన సంచలన తీర్పు తమిళనాడుతోపాటు బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఉపశమనాన్ని కలిగించింది. ఈ తీర్పు తర్వాత తమిళనాడులో కీలకపరిణామం చోటుచేసుకున్నది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగ చరి త్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదం లేకుండానే 10 చట్టాలను నోటి ఫై చేసింది. ఈమేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. తమిళనాడులో పలు బిల్లు ల ఆమోదం విషయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య వివాదం కొన సాగుతోన్న విషయం తెలిసిందే. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తన వద్దే అట్టిపెట్టుకుంటున్నారని తమిళనాడు సర్కారు ఆరోపణ. బిల్లుల విషయంలో ఎలాంటి స్పందనా లేకుండా తన వద్దే ఉంచుకుం టున్న గవర్నర్‌ తీరుపై స్టాలిన్‌ సర్కారు పలు సందర్భాల్లో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నది. ఈవిషయంలో తమిళనాడు సర్కారు 2023లో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బిల్లుల్ని సమ్మతించకపోవడం, పున:పరిశీలిం చాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడంలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నది. రెండో సారి ఆమోదించిన బిల్లుల విషయంలోనూ ఆయన తీరు మారలేదని వివరిం చింది. ఈ వ్యవహారంపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికుమార్‌ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలే స్పష్టం చేసిన విషయం విదితమే. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్‌ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. నిరవధికంగా తన వద్ద ఉంచుకోకూడదని స్పష్టం చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని వివరించింది. ”గవర్నర్‌ 10 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి పెట్టడం న్యాయ సమ్మతం కాని ఏకపక్ష చర్య. అందుకే ఆ చర్యను తోసిపుచ్చుతున్నాం” అని జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే మొదటిసారి. సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల వెలువర్చిన ఈ తీర్పుపై ప్రతిపక్షపార్టీలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేసిన విషయం విదితమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img