జిల్లా పౌరసంబంధాల అధికారులతో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతికి విస్తృత ప్రచారం కల్పించాలని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా పౌరసంబంధాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడాదిన్నర కాలంలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నప్పటికీ, ఆ మంచి పనులను ప్రజల్లోకి వివరంగా తీసుకెళ్లలేకపోతున్నామని మంత్రి అభిప్రాయపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాడు అధికారంలో ఉండి చేయని పనులను చేసినట్టుగా గొబెల్స్ ప్రచారం చేసుకుందనీ, ప్రతిపక్షంలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నదని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు ప్రజోపయోగ పనులు చేశామనీ, 60 వేల ఉద్యోగాల భర్తీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, పేదలకు సన్నబియ్యం, మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతుభరోసా పెంపు, రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, డైట్ చార్జీలు 40 శాతం పెంపు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల పంపిణీ వంటివి చేసినట్టు వివరించారు. గత ప్రభుత్వం పదేండ్లలో చేయని పనులను ఏడాదిన్నరలో చేసినట్టు తెలిపారు. గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డుల్లో పేరు నమోదు కోసం ఎదురు చూస్తున్న 15 లక్షల మంది పేదల పేర్లను రేషన్‌కార్డుల్లో నమోదు చేసినట్టు వెల్లడించారు. కొత్తగా 7 లక్షల రేషన్ కార్డులిచ్చినట్టు తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రజల సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీపడటం లేదని తెలిపారు. ఈ సమావేశంలో సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్ సీహెచ్.ప్రియాంక, ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల అధికారి జి.మల్సూర్, జాయింట్ డైరెక్టర్ జగన్, డిప్యూటీ డైరెక్టర్ మధు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రగతిపై విస్తృత ప్రచారం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES