Sunday, July 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపడకేసిన కార్పొరేషన్ల పథకాలు

పడకేసిన కార్పొరేషన్ల పథకాలు

- Advertisement -

నిరుద్యోగులకు అందని స్వయం ఉపాధి పథకాలు
మూడేండ్లుగా కార్యాచరణ ప్రణాళికల్లేవ్‌..
బడుగుల్ని విస్మరిస్తున్న పాలకులు : వృత్తిదారుల సంఘం
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

రాష్ట్రంలో షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీల సంక్షేమ శాఖల్లో సంక్షేమ పథకాలు పడకేశాయి. మూడేండ్లుగా నాలుగు కార్పొరేషన్లలోనూ కార్యాచరణ ప్రణాళికలు అమలు కావడం లేదు. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చూపుతున్నా.. ఆచరణలో పైసా విదిల్చని దుస్థితి. ఎన్నికల ముందు దళిత, బీసీ, మైనార్టీ బంధు పేరిట గత ప్రభుత్వం హడావుడి చేసి చేతులు దులుపుకుంది. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని డిక్లరేషన్ల ద్వారా హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వమూ రాజీవ్‌ యువ వికాసం పేరిట కాలయాపన చేస్తోంది. ఏడాదిపాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బడుగుల సంక్షేమానికి మంగళం పాడగా రెండేండ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మొండిచెయ్యి చూపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కార్యాచరణ ప్రణాళికలు నిర్వీర్యం
ఎస్సీ, ఎస్టీ, బీసీలను అన్ని విధాలుగా ఆదుకుని జీవన ప్రమాణాలను పెంచేలా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా స్వయం ఉపాధి పథకాల్ని అమలు చేసే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, కార్పొరేషన్ల నిధుల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇతర అవసరాలకు మళ్లిస్తూ.. కార్యాచరణ ప్రణాళికల్ని పాలకులు నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాతోపాటు జిల్లాలు ఏర్పడిన తర్వాత కూడా సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో ప్రతి ఆర్థిక సంవత్సరం సబ్సిడీ రుణాలు మంజూరు చేశారు. మూడు జిల్లాల్లోనూ 2023-24 సంవత్సరంలో బీసీ, ఎంబీసీ కుల వృత్తులకు లక్ష ఆర్థిక సహాయం అందించే పథకం కింద ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 300 మంది చొప్పున విడతల వారీగా 10 నియోజకవర్గాల్లో 3 వేల మందికి స్వయం ఉపాధి కోసం రుణాలు మంజూరు చేశారు. కానీ..! ఎన్నికల కోడ్‌ వల్ల రుణాలు గ్రౌండింగ్‌ చేయలేదు. 2024-25, 2025-26లో బీసీ సంక్షేమ శాఖలో యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయలేదు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కూడా మొదటి విడతలో పైలెట్‌ ప్రాజెక్టు కింద 10 నియోజకవర్గాల్లో 800 మందికి దళిత బంధు కింద రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందింది. 2023-24లో రెండో విడతలో ప్రతి నియోజకవర్గంలో 1100 యూనిట్లను ఎంపిక చేసి మంజూరిచ్చారు. కోడ్‌ వచ్చేసరికి గ్రౌండింగ్‌ ఆగిపోయింది. 2024-25, 2025-26లో కూడా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎలాంటి యాక్షన్‌ ప్లాన్‌ అమలుకావట్లేదు. ఎస్టీ కార్పొరేషన్‌లో 2021-22లో స్వయం ఉపాధితోపాటు బోరు, బావుల తవ్వకం కోసం సబ్సిడీ రుణాలిచ్చారు. ఆ తర్వాత కార్పొరేషన్‌లో ఎలాంటి పథకాలూ లేవు. మైనార్టీ సంక్షేమ శాఖలోనూ 2022-23లో మాత్రమే బ్యాంకు లింకేజీ, నాన్‌ బ్యాంక్‌ లింకేజీ పథకాల ద్వారా మైనార్టీలకు స్వయం ఉపాధి రుణాలిచ్చారు. ఆ తర్వాత మైనార్టీ బంధు పేరిట 2023-24లో దరఖాస్తులు స్వీకరించి వదిలేశారు. రెండేండ్లుగా పైసా నిధుల్లేవ్‌.
నిర్లక్ష్యం.. రాజీవ్‌ యువ వికాసం
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఏటా అమలయ్యే సంప్రదాయ కార్యాచరణ ప్రణాళికలకు బదులుగా ‘రాజీవ్‌ యువ వికాసం’ పేరిట అమలు చేస్తామని ప్రకటించింది. 2025-26 బడ్జెట్‌లో రాజీవ్‌ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్ల నిధుల్ని కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మే నెలలో దరఖాస్తుల పరిశీలన, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలందజేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎంతో ఆశతో ఉండగా సడన్‌గా రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ఆపేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
కేటాయింపులు తప్ప ఖర్చేది..?
రాష్ట్ర జనాభాలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జనాభా సంక్షేమం, అభివృద్ది కోసం ప్రతి ఏటా బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చూపడం తప్ప ఖర్చు చేయట్లేదు. 2025-26 వార్షిక బడ్జెట్‌ కేటాయింపుల్ని పరిశీలిస్తే.. బీసీ సంక్షేమానికి రూ.11405 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.17169 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.40232 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.3591 కోట్ల నిధుల్ని కేటాయిస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మార్చి 19న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సరిగ్గా నాలుగు నెలలు పూర్తయింది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం పైసా ఖర్చు చేయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
పెండింగ్‌లో లక్షల దరఖాస్తులు
రాజీవ్‌ యువ వికాసం పథకం కోసం లక్షల్లో దరఖాస్తు చేశారు. 2025-26లో ఉమ్మడి మెదక్‌ జిల్లాకు 42511 యూనిట్లను కేటాయించారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి 139641 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో చూస్తే 493231 యూనిట్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం 1623764 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎస్సీలు 392951 మంది, ఎస్టీలు 183494 మంది, బీసీలు 801008 మంది, ఈబీసీలు 37414 మంది, మైనార్టీలు 204202 మంది, క్రిష్టియన్లు 4695 మంది దరఖాస్తు చేశారు.
సంక్షేమ శాఖల నిర్వీర్యం
బీసీ, ఎంబీసీ, మైనార్టీలతో పాటు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల్ని పాలకులు నిర్వీర్యం చేశారు. ప్రతి ఏటా బడ్జెట్‌లో కేటాయించే నిధు ల్ని దారిమళ్లిస్తూ సబ్సిడీ పథకాలకు మంగళం పాడుతున్నారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అదే పని చేస్తుంది. రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి. వెంటనే బీసీ, ఎంబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ దరఖాస్తుదారులకు రుణాలిచ్చి గ్రౌండింగ్‌ చేయాలి.
– పైళ్ల ఆశయ్య,
వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -