Tuesday, July 29, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసుంకాలపై దిగొచ్చిన ట్రంప్‌

సుంకాలపై దిగొచ్చిన ట్రంప్‌

- Advertisement -

– ఈయూ-అమెరికా వాణిజ్య ఒప్పందం
– తప్పిన వాణిజ్య యుద్ధం ముప్పు
టర్న్‌బెర్రీ (స్కాట్లాండ్‌) :
ఎట్టకేలకు యూరోపియన్‌ యూనియన్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. పలు ఈయూ ఉత్పత్తులపై పదిహేను శాతం దిగుమతి సుంకం విధించింది. ఈయూపై 30 శాతం సుంకాలు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గతంలో బెదిరించారు. అయితే ఇప్పుడు దిగివచ్చి టారిఫ్‌ను పదిహేను శాతానికి పరిమితం చేశారు. ఫలితంగా అమెరికా, ఈయూ మధ్య వాణిజ్య యుద్ధ ప్రమాదం తప్పింది. ప్రపంచ వాణిజ్యంలో ఈ రెండు పక్షాల వాటా దాదాపు మూడో వంతు ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ స్కాట్లాండ్‌లో ట్రంప్‌నకు చెందిన అత్యంత విలాసవంతమైన గోల్ఫ్‌ కోర్సులో ఆయనకు, యూరోపియన్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఉర్సులా వన్‌ డర్‌ లెయాన్‌కు మధ్య ఆదివారం ఒప్పందం కుదిరింది.

ఈ విషయాన్ని ఇరువురు నేతలు ప్రకటించారు. వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాల మధ్య అనేక నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. చివరికి ఎట్టకేలకు గోల్ఫ్‌ కోర్సులో గంట సేపు జరిగిన సంప్రదింపుల కారణంగా అంగీకారం కుదిరింది.
తాను కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలలో ఇదే అతి పెద్దదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అమెరికాలో 600 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాలని ఈయూ యోచించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడులతో అమెరికా ఇంధన, సైనిక పరికరాల కొనుగోళ్లు నాటకీయంగా పెరుగుతాయి. గత వారం జపాన్‌తో కుదుర్చుకున్న 550 బిలియన్‌ డాలర్ల ఒప్పందంతో పోలిస్తే ఇదే పెద్దదని ట్రంప్‌ చెప్పారు. అమెరికా ఎగుమతుల విషయంలో అన్యాయంగా వ్యవహరించారని, ఇప్పుడు ఈ ఒప్పందంతో అట్లాంటిక్‌ సముద్రం సమీపంలో లేదా సరిహద్దున ఉన్న దేశాల మధ్య సంబంధాలు విస్తృతమవుతాయని తెలిపారు.
కాగా ట్రంప్‌తో చర్చించడం చాలా కష్టంతో కూడిన వ్యవహారమని, ఇంతకంటే ఎక్కువగా ఆ దేశం నుంచి పొందలేమని లెయాన్‌ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచంలో రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది చాలా పెద్ద ఒప్పందం. భారీ ఒప్పందం. ఇది స్థిరత్వాన్ని కల్పిస్తుంది. అంచనాలకు అవకాశం ఇస్తుంది’ అని ఆమె చెప్పారు.

ఈ ఒప్పందంతో ఈయూ 750 బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన అమెరికా ఇంధనాన్ని కొనుగోలు చేస్తుందని, వందల బిలియన్‌ డాలర్ల ఆయుధాలు కొంటుందని ట్రంప్‌ తెలిపారు. ఒప్పందంపై జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడ్రిచ్‌ మర్జ్‌ హర్షం వ్యక్తం చేస్తూ వాణిజ్య యుద్ధం ముప్పు తప్పిందని చెప్పారు. అయితే యూరప్‌లో అనేక మంది జీరో-ఫర్‌-జీరో ఒప్పందం కుదురుతుందని ఆశించారు. అమెరికా విధించిన పదిహేను శాతం సుంకం చాలా ఎక్కువని వారు అభిప్రాయపడ్డారు.

స్టాకహేోమ్‌లో అమెరికా, చైనా చర్చలు
ఇదిలావుండగా అమెరికా, చైనా నాయకులు స్వీడన్‌ రాజధాని స్టాకహేోమ్‌లో సమావేశమై వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నారు. సుంకాలు ప్రస్తుత స్థాయిలోనే ఉండే విధంగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇరు దేశాల అధ్యక్షులు ఈ సంవత్సరం చివరలో సమావేశం కావాల్సి ఉంది. అప్పుడు వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌, చైనా వైస్‌ ప్రీమియర్‌ హీ లిఫెంగ్‌ సోమవారం చర్చలు మొదలు పెట్టారు. వీరిద్దరూ ఇలా సమావేశం కావడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. నాలుగు నెలల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా వస్తువులపై 145 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండు దేశాల నేతల మధ్య చర్చలు జరగలేదు. స్కాట్లాండ్‌ పర్యటనకు వెళ్లే ముందు ట్రంప్‌ విలేకరులతో ముచ్చటిస్తూ చైనాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కాగా రెండు దేశాల మధ్య ఇప్పటికే జెనీవా, లండన్‌లో రెండు విడతలుగా చర్చలు జరిగాయి.

రెండు విడతలుగా జరిగిన చర్చల ఫలితంగా సుంకాల విషయంలో ‘యధాతధ స్థితికి’ చేరుకున్నామని బెస్సెంట్‌ చెప్పారు. చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై అమెరికా 30 శాతం సుంకం విధిస్తే అమెరికా నుంచి వస్తున్న ఉత్పత్తులపై చైనా 10 శాతం టారిఫ్‌ విధించిందని ఆయన వివరించారు. ఆర్థిక సంబంధాలను సమతూకం చేసుకునే విషయంపై ఇప్పుడు దృష్టి సారిస్తామని అన్నారు. అమెరికా గత సంవత్సరం 295.5 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటును నమోదు చేసుకున్న విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. వాణిజ్య ఒప్పందం కుదిరితే చైనాకు ఎగుమతులు పెరుగుతాయని అమెరికా భావిస్తోంది. చర్చలలో మరింత ఏకాభిప్రాయం సాధ్యపడుతుందని, సహకారం పెరుగుతుందని, దురాభిప్రాయం తగ్గుతుందని ఆశిస్తున్నామని వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -