మండలంలో ముమ్మరంగా పోలీస్ కూంబింగ్
వాహనాల తనిఖీలు, గొత్తి కోయగూడాల్లో సోదాలు
నవతెలంగాణ – తాడ్వాయి
మావోయిస్టు అమరుల వారోత్సవాలు జూలై 28 సోమవారం నుండి ఆగష్టు 3 వరకు జరగనున్నాయి. మండలంలోని ఏజెన్సీ అటవీ గ్రామాలు, గొత్తికోయ గూడాల్లో పోలీస్ కూంబింగ్ ముమ్మరంగా చేపట్టారు. వారం రోజుల పాటు మావోయిస్టు అమరులను స్మరిస్తూ వాడ వాడలలో వారోత్సవాలు జరిపి విజయవంతం చేయాలంటూ మావోయిస్టులు ఇచ్చిన పిలుపుతో, జిల్లా ఎస్పీ శబరిస్ ఆదేశాల మేరకు తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు.
రంగంలోకి గ్రేహౌండ్స్ దళాలు :
మరో వైపు వారోత్సవాలను విఫలం చేసేందుకు పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. తాడ్వాయి మండలంతో పాటు మండల సరిహద్దు మండలాలైన ఏటూరునాగారం, మంగపేట, గోవిందరావు పేట, కరకగూడెం,గుండాల, పినపాక మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే ఇప్పటికే గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, కేంద్ర బలగాలు గ్రీన్ హంట్ పేరుతో కూంబింగ్ నిర్వహిస్తూ మావోయిస్టుల జాడలు తెలుసుకునేందుకు గొత్తికోయ గూడాల్లో మావోయిస్టులలోని టార్గెట్ వాల్ పోస్టర్లు అంటించి గూడాలలో సోదాలు, కార్డన్ సర్చ్ లు చేస్తూ ఆరాతీస్తున్నారు. మావోయిస్టుల్లో ఎక్కువగా గొత్తికోయలున్న నేపద్యంలో వారి గూడాల్లోని గొత్తికోయ పురుషులు, స్త్రీలతో సమావేశమై పరిచయంలేని వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వవద్దని అనుమానితుల సమాచారం ఇవ్వాలంటూ అవగాహన కల్పిస్తున్నారు.
ఆందోళనలతో అట్టుడుకుతున్న మండలం
వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు విఫలం చేయాలనే పనిలో పోలీసులు చేస్తున్న తనిఖీలు, కూంబింగ్ లతో మండలంలోని గిరిజన గ్రామాలు, గొత్తికోయ గూడాల్లో ఎప్పుడేం జరుగుతుందోనని యువకులు, మహిళలు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారక ముందే పోలీసులు తెల్లవార్లు మావోయిస్టుల భయం వెంటాడుతుండడంతో యువకులు గ్రామాలను విడిచి సురక్షిత పోతున్నారు. మండలంలో గతంలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఏజెన్సీ గ్రామాల పై పోలీసుల నిఘా పెంచడంతో మావోయిస్టు వారోత్సవాలు ముగిసే వరకు గ్రామాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆందోళన చెందుతున్నారు.