Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeమానవిచేనేత‌కు వెలుగు రేఖ‌

చేనేత‌కు వెలుగు రేఖ‌

- Advertisement -

ఆసక్తి ఉండాలే కానీ కళలకు అంతులేదని నిరూపిస్తున్నారు వెల్లి రేఖ దంపతులు. సూదిలో దూరే చీరల నుంచి, గిన్నిస్‌ రికార్డుల వరకు చేనేత కళలో అద్భుతాలు సృష్టించారు భర్త. తమ ప్రతిభతో సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. ఆయన ప్రోత్సాహంతో ఆమె కూడా మగ్గంతో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తనలోని ప్రతిభకు గుర్తుగా చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్రస్థాయి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డును అందుకోబోతున్నారు. ఈ పురస్కారానికి ఎంపికైన తొలి చేనేత మహిళగా ఘనత సాధించారు. ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఆమెలోని సృజనాత్మకత, నిరంతర శ్రమ, నమ్మకం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తదనంతో కూడిన సృజనాకృతులను తీర్చిదిద్దుతున్న ఆమెతో మానవి మాట కలిపింది.

చేనేతకు పుట్టిల్లైన సిరిసిల్లకు చెందిన వెల్లి హరిప్రసాద్‌ పేరు వినగానే ఆశ్చర్యపరిచే కళాఖండాలు గుర్తుకొస్తాయి. తనకున్న మేధాశక్తి, చేనేతపై ఉన్న మక్కువతో అనేక ప్రయోగాలు చేశారు. ‘మా నాన్న పోశెట్టి మగ్గం నేస్తే, అమ్మ రాజ్యలక్ష్మి కండెలు చుట్టేది. ఇంట్లోనే మగ్గాలు ఉండటంతో చిన్నప్పటి నుంచి ఆ చప్పుడు వింటూ పెరిగాను. నాన్న మగ్గం రిపేరు చేస్తున్నప్పుడు ఎంతో ఆసక్తిగా గమనించేవాణ్ని. ఆ పరిశీలనే నన్ను కొత్త కొత్త ఆలోచనల వైపు నడిపించింది,’ అంటూ హరిప్రసాద్‌ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. అగ్గిపెట్టెలో ఇమిడే చిన్న మరమగ్గం, చేతి చప్పట్లతో నడిచే మగ్గం వంటి బుల్లి యంత్రాలను రూపొందించారు. ఒక వైపు సాంకేతికతను జోడించి, మరో వైపు సూక్ష్మ కళకు కొత్త నిర్వచనాలిచ్చారు. సూది రంధ్రంలో దూరే చీరలు, ఉంగరంలో ఇమిడే పట్టు చీరలను నేసి దేశం దృష్టిని ఆకర్షించారు. గొప్ప ప్రతిభ కలిగిన భర్తను స్ఫూర్తిగా తీసుకొని రేఖ కూడా కొత్త ప్రయోగాలు మొదలుపెట్టారు.

లెక్కకు మించిన అద్భుతాలు
నేడు రాజకీయ ప్రముఖుల నుంచి ఆధ్యాత్మిక క్షేత్రాల వరకు వీరి కళాఖండాలు విస్తరించాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, కేసీఆర్‌ వంటి అనేక మంది ప్రముఖులు వీరి కళాఖండాలను జ్ఞాపికలుగా అందుకున్నారు. జీ20 లోగోను మగ్గంపై నేసి ప్రధాని ప్రశంసలు పొందడమే కాకుండా, ‘మన్‌ కీ బాత్‌’లో వీరి పనితనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సందర్భంగా వెండి పట్టు పోగులతో కేసీఆర్‌ ముఖచిత్రం, వరంగల్‌ కాకతీయ కళాతోరణం నేసి శాలువాను తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. భద్రాచలం సీతమ్మవారి కోసం బంగారు పట్టు చీరను రూపొందించి, అందులో ‘శ్రీరామ రామ రామేతి…’ అనే శ్లోకాన్ని 51 సార్లు నేసి తన ప్రతిభను చాటుకున్నారు. ఇలాంటి అద్భుతాలు సృష్టించిన హరిప్రసాద్‌ కృషికి గుర్తింపుగా ఏషియన్‌ ఇంటర్నేషనల్‌ కల్చర్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్‌ కూడా ప్రదానం చేసింది.

భర్త స్ఫూర్తితో…
హరిప్రసాద్‌ నిరంతరం చేసే ప్రయోగాలు, ఆయన సాధించిన విజయాలు చూసి రేఖ కూడా ఏదైనా సాధించాలని సంకల్పించారు. ఒక సాధారణ గృహిణిగా, చేనేత కార్మికురాలిగా ఉన్న ఆమెలో స్వయంశక్తి, ఆత్మవిశ్వాసం నింపింది భర్త ప్రోత్సాహమే. ‘కొత్తగా ఆలోచించడం, కష్టపడి పనిచేసే విషయంలో నా భర్తే నాకు స్ఫూర్తి. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, ఉంగరంలో దూరే చీరలను ఆయన ఆవిష్కరించినప్పుడు నాకు ఎంతో గర్వంగా అనిపించేది. ఆ స్ఫూర్తితో నేను కూడా ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను’ అంటారు ఆమె. ఆమె ఆలోచనకు తోడుగా, భర్త సహకారంతో పట్టుపీతాంబరం నేయాలని రేఖ నిర్ణయించుకున్నారు.

కంటి మీద కునుకు లేకుండా…
‘నా వల్ల అవుతుందా అని మొదట్లో సందేహించాను. కానీ ఆయన ‘నీ వల్ల ఎందుకు కాదు’ అని ధైర్యం ఇచ్చారు. చీర నేసేటప్పుడు రాత్రింబవళ్లు ఒక్కో పోగును జాగ్రత్తగా చూసుకుంటూ కంటి మీద కునుకు లేకుండా పని చేశాను. కళాతోరణం, బుటాలు డిజైన్‌ చేయడం ఎంతో కష్టమైంది. కానీ నా భర్త ప్రయోగాలను గుర్తుచేసుకుని, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నాను. ఒక్కో దారాన్ని పట్టుకుని రేయింబవళ్ళు కష్టపడ్డాను. ఆ కష్టానికి ఫలితమే ఇప్పుడు దక్కిన ఈ గౌరవం. ఈ విజయం నాకు మాత్రమే కాదు, నన్ను ప్రోత్సహించిన నా భర్తకూ దక్కుతుంది.’ అంటూ పంచుకున్న ఆమె కండ్ల నుండి ఆనందభాష్పాలు రాలాయి.

తొలి చేనేత కార్మికురాలిగా…
ఆమె నేసిన ‘రాజన్నసిరిసిల్ల పట్టుపీతాంబరం చీరె’లో కాకతీయుల శౌర్యానికి ప్రతీకగా కళాతోరణం, వేములవాడ రాజన్న కోడె మొక్కులను సూచించే జరీ బుటాలను చేర్చారు. దాదాపు 45 రోజులు శ్రమించి, 48 అంగుళాల వెడల్పు, 5 మీటర్ల పొడవుతో ఈ అద్భుతమైన చీరను రూపొందించారు. ఈ చీరలోని పనితనం, నాణ్యతను పరిశీలించిన ప్రభుత్వం ఈనెల 7న చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అందించబోయే రాష్ట్ర స్థాయి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి మహిళా చేనేత కార్మికురాలిగా రేఖ చరిత్ర సృష్టించారు. ఈ విజయం కేవలం చేనేతకే పరిమితం కాలేదు. పూజలకు అవసరమైన నూలు మాలలు మార్కెట్‌లో దొరకడం లేదని తెలుసుకున్న రేఖ, భర్త సహాయంతో ఒక ప్రత్యేకమైన మిషన్‌ను తయారు చేయించుకుని వాటిని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టి సక్సెస్‌ అయ్యారు. ‘కొత్త మిషన్‌ తయారుచేసుకుని ధర్మవరం నుంచి నూలు తెచ్చి దండలు అల్లడం మొదలుపెట్టాను. ఇప్పుడు చాలామంది మహిళలకు నేను ఉపాధి కల్పించగలుగుతున్నాను’ అని రేఖ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె నిజామాబాద్‌, హైదరాబాద్‌ వంటి అనేక ప్రాంతాలకు మాలలు ఎగుమతి చేస్తున్నారు. చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉన్న నేటి పరిస్థితుల్లో రేఖ సాధించిన విజయం, అనేక మంది చేనేత కార్మికులకు కొత్త ఆశలను, అవకాశాలకు కల్పిస్తోంది.

ప్రపంచానికి చాటి చెప్పారు
వీరి కళాఖండాలు జాతీయ సరిహద్దులను దాటి అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందాయి. ఇటీవలే హైదరాబాద్‌ కేంద్రంగా జరిగిన మిస్‌ ఇండియా పోటీల్లో వారి సృజనాత్మకత ప్రదర్శించారు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరల అద్భుతాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నేత కళాఖండాలకు ముగ్ధులై, సుమారు 30 వరకు అగ్గిపెట్టెలో ఇమిడే చీరలు, 5 పట్టు పీతాంబర చీరలకు ఆర్డర్‌ ఇచ్చారు. భారతీయ చేనేత కళకు వీరు ప్రపంచ వేదికపై గౌరవాన్ని తీసుకొచ్చారు. వీరి ప్రయాణం నేడు సిరిసిల్ల నేత కళకు కొత్త శోభను తీసుకొచ్చింది. భర్త విజయాలకు ప్రేరణ పొంది, తనదైన శైలిలో అద్భుతాలు సృష్టించిన రేఖ, చేనేత రంగంలో మహిళా సాధికారతకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారు. ఈమె అద్భుతమైన ప్రస్థానం, చేనేత కళపై ఉన్న నిబద్ధత నిజంగా ప్రశంసనీయం.

-బండోజు శ్రీకాంత్‌,
కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img