జాతీయ రహదారి 930పి పనుల్లో జాప్యం
అది పూర్తయితే హైదరాబాద్-కొత్తగూడెం మధ్య తగ్గనున్న 40 కిలోమీటర్లు
భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లా వాసుల తండ్లాట
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతీయ రహదారుల పనులకు భూ సేకరణ అడ్డంకిగా మారింది. భూ సేకరణలో జరుగుతున్న జాప్యంతో పనులు ప్రారంభం కావడం లేదు. జాతీయ రహదారి 930పి రహదారి (హైదరాబాద్-కొత్తగూడెం మధ్య 234 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ) పనులు పూర్తయితే, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, అశ్వాపురం, మణుగూరు వాసులకు 40 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.
హైదరాబాద్ నుంచి భద్రాచలానికి ప్రస్తుతం విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట, ఖమ్మం మీదుగా వెళ్తున్నారు. జాతీయ రహదారి 930పి పూర్తయితే హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్లడానికి 40 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2,740 కోట్లు కేటాయించింది. తొలి దశలో రంగారెడ్డి జిల్లా గౌరెల్లి ఓఆర్‌ఆర్ నుంచి వలిగొండ జంక్షన్‌కు మొదటి ప్యాకేజీ కింద రూ.690 కోట్లు, రెండో ప్యాకేజీ కింద రూ.675 కోట్లతో వలిగొండ జంక్షన్ నుంచి తొర్రూరు వరకు నిర్మాణానికి టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టారు. తొర్రూరు నుంచి బయ్యారం మండలంలోని నామాలపాడు (నెహ్రూనగర్) వరకు మూడో ప్యాకేజీ పనులకు అంతరాయం ఏర్పడింది. గౌరెల్లి-వలిగొండ పనులను ఇపిసి పద్ధతిలో చేపట్టారు. 41.920 కిలోమీటర్ల మేరకు ఈ రహదారిని రెండు లైన్లుగా విస్తరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 80 కిలోమీటర్ల మేరకు ఈ జాతీయ రహదారి విస్తరించి వుంది. తొర్రూరు-నామాలపాడు(నెహ్రూనగర్) డీపీఆర్‌కు ఆమోదముద్ర పడటంతోపాటు టెండర్ పిలిచారు. 42 శాతం లెస్‌తో కొటేషన్ వేయడంతో జాతీయ రహదారుల ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లి-బయ్యారం నామాలపాడు మధ్య 80 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు మూడో ప్యాకేజీలో చేపట్టాల్సి వుండగా, నేటికీ ప్రారంభించలేదు. ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి 3 బైపాస్ మార్గాల కోసం కూడా భూ సేకరణ పూర్తి చేసినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చితే ఈ పనులు వేగం పుంజుకోనున్నాయి.
హైదరాబాద్- కొత్తగూడెం వరకు 230 కిలోమీటర్లు వేయడానికి రూ.675 కోట్లు మంజూరయ్యాయి. తొర్రూరు-నెహ్రూనగర్ మధ్య 69 కిలోమీటర్ల పనులు మూడో ప్యాకేజీ కింద చేయనున్నారు. ఈ జాతీయ రహదారిలో 26 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయాల్సి వుంది. 105 హెక్టార్ల భూమిని సేకరించాల్సి వుండగా, అటవీ ప్రాంతం నుంచి 4 కిలోమీటర్ల మేరకు ఈ రహదారి వెళ్లనుంది. దీంతో 9.1 హెక్టార్ల అటవీ భూమిని కూడా సేకరించాల్సి వుంది. అందుకు బదులుగా మరో ప్రాంతంలో అటవీ శాఖకు భూమి బదలాయించాల్సి ఉంది. తొర్రూరు రెవెన్యూ డివిజన్‌లో పెద్ద వంగర నుంచి వయా తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, నెహ్రూనగర్‌కు ఈ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు.
మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో 121 కిలోమీటర్లు
930పి జాతీయ రహదారి నిర్మాణంలో 121 కిలోమీటర్లు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధి మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో పనులు జరుగాల్సి వుంది. ఈ పరిధిలోనే అటవీ భూసేకరణ చేయాల్సి వుంది. ఈ పనులు పూర్తి కావాలంటే అటవీ భూములు ఎంత కోల్పోవాల్సి వస్తుందో ఆ మేరకు వేరే ప్రాంతంలో అదే విస్తీర్ణంలో భూములను అటవీ శాఖకు ఇవ్వాల్సి వుంది.
రైతులకు నోటీసులు
తొర్రూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో జాతీయ రహదారి కింద భూములు కోల్పోతున్న 463 మంది రైతులు బ్యాంకు అకౌంట్ల వివరాలు ఇవ్వాలని ఆర్‌డిఓ నోటీసులు జారీ చేశారు. తొర్రూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 63 హెక్టార్ల భూ సేకరణ చేయాల్సి వుంది.
జాతీయ రహదారులకు భూసేకరణ సమస్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES