మనుషులే తోటి మనుషులను ఫలానావారని ముద్రలు వేయడానికి ఘనమైన, బలమైన, విశ్వసనీయమైన సూక్త రచనలు చేసారు సనాతనులు. సత్యమని ప్రచారం చేసారు. వాటిని ప్రశ్నించడానికి వీల్లేని నిరంకుశ ధర్మాలుగా ప్రచారం చేసారు. నిజమేనా? ఇంతగా నిర్దిష్టంగా ఎస్టాబ్లిష్ చేసిన ఒక అధర్మాన్ని ప్రశ్నించడానికి సామాజిక అనుభవమొక పాఠం, కాలికస్పహ అవుతుంది.
బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూ రాజన్యః కతః/ ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత ఋగ్వేదం, 10-90-13 (సామవేద సంహిత 6-4, అథర్వవేద సంహిత 19-6, తైత్తీరియ అరణ్యక3-12-13, వాజసనేయ సంహిత 31-1-6)
ఈ సూక్తానికి అనేక అన్వయాలు, వ్యాఖ్యానాలు చేసి, ఛస్ అట్లా అని కాదు ఆ సూక్తానికి అర్థం. ఇందులో అసలు వర్ణవ్యవస్థ ముచ్చటే లేదనే ఘనాపాఠీలున్నారు. ప్రస్తుతార్థం కావాలె. ఒక్క వేదసూక్తానికి 5 లక్షల అర్థాలు చెప్పవచ్చన్న వారితో పేచీలేదు. అవసరం లేదు కనుక.
పురుషసూక్తాన్ని పునర్మూల్యంకనం చేసిన వచనరూపకావ్యం ‘శ్రీశూద్రగంగ’. కవి జీవిత వాస్తవికతతో పాటు, విమర్శకుని భావజాలనిబద్ధత కూడా నేపథ్యంగా చేసిన రచన ఇది.
గతంలో జయప్రభ, కాత్యాయనీ విద్మహే, బిఎస్ రాములు, కంచె ఐలయ్య, కత్తి పద్మారావు, బి.విజయభారతి, వాళ్ల కన్నా ముందు రంగనాయకమ్మ, త్రిపురనేని మధుసూదనరావు మార్క్సీయ, దళిత, బహుజన, స్త్రీ దక్పథాల నుంచి ప్రాచీన సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేశారు.
”అబ్రాహ్మణుడు కవిత్వం రాస్తే బ్రాహ్మణ కవిత్వం కంటే భిన్నంగా ఉంటుంది. శూద్రుడైన కవి కవిత్వం సష్టిస్తున్నప్పుడు స్వయం వ్యక్తిత్వ ప్రకటనార్థం ప్రత్యేకత ఉన్న సాహిత్యం ప్రభవించి తీరవలసిందే..” -కొలకలూరి ఇనాక్, ‘శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం’ (1996)
ప్రాచీన, పురాణ సాహిత్యంలో ‘గంగావతరణం’ ఒక కథాఘట్టం. భగీరథుడు తన పూర్వీకుల సద్గతుల కొరకు దేవలోకంలో ఉన్న గంగను భూమి మీదకు దింపడానికి చేసిన తపస్సు, శివసాక్షాత్కారం, గంగావతరణం కథాంశం. ఇక్కడ గంగ నేలమీదికి దిగివచ్చిన ప్రయోజనం జనం కొరకు కాదు. ఒక్కరి పుణ్యకార్యం కొరకే. అది పురాణమే కావచ్చు. వర్తమానానికి వర్తించే సంగతులున్నపుడు కాలికం అవుతుంది.
ఇపుడీ కవి గంగను శూద్రగంగ అన్నాడెందుకని? ఎందుకంటే పురుషసూక్తం ప్రకారం ‘పద్భాగ్యం శూద్రో అజాయత’ అని కదా వేద సూక్తం. ఆ విరాట్పురుషుడనేవాని పాదాల నుంచి పుట్టినవారు శూద్రులైతే, గంగ కూడా ఆ మహావిష్ణువు పాదాల నుంచి పుట్టిందే కదా. అందుకే గంగను శూద్రగంగ అన్నాడు కవి సుద్దాల అశోక్ తేజ. అర్థాన్వయం అట్ల కుదిరింది. ‘గమయతి భగవత్పదం ఇతి గ్గ’.. భగవంతుని పాదాల నుంచి గమించినది కనుక గంగ అని పిలువబడ్డదని గంగకు వ్యుత్పత్యర్థం చెప్తారు.
మరి అందుకే గంగ తనను తాను ‘అసలు సిసలు శూద్రగంగ’నంటున్నది. ఇది గంగాఝరీస్వర ప్రకటన.
‘శ్రీశ్రీశ్రీ/ శూద్రగంగ/ శూద్రావనికొస్తున్నది/ ఏ దేశంలో లేని/భారతదేశంలోని/శూద్రుల తోబుట్టునని/ భరతావని ఒకటే/భువిలో శూద్రావని అని’
తాను ‘?….కాళ్ళు శూద్ర/ గర్భసంచులైతే/? ..చరణాలలో/ పురుడు పోసుకున్న/ శుద్ధమైన అసలు సిసలు/ శూద్రగంగనని’ డిక్లరేషన్ ఇచ్చింది గంగ.
శూద్రావనిలో శూద్రులే ఉత్పత్తిదారులు, ఉత్పత్తికారకులు. ఎవరైతే అడవుల్ని పెంచి, భూమిని దున్ని, పంటలతో సస్యశ్యామలం చేసి, జలాశయాలను నిర్మించి ఈ దేశపు ప్రజలకింత బువ్వ పెడుతున్నారో వారంతా పురుషసూక్తం చెప్పినట్టు శూద్రులే. గంగ అందుకే భరతావని శూద్రులదని, భారతదేశాన్నే ఎంచుకున్నదని కవివాక్కు. శూద్రవర్ణమని ముద్రించబడిన ప్రజలకు తానే ప్రతినిధిగా నిలిచింది. వాండ్ల హక్కులవాక్కై పలికింది.
శ్వేతపత్రం
‘నేను మీ ఆకాశం నుంచి సూర్యచంద్రుల్ని అడుగ/ నీ భూమి, జాగల్ని అడుగ/ నీ పెద్ద ఇండ్లను, భవనాలను అడుగ/ నేనడుగ దేవుండ్లు, క్రతువులు, కులాలు. తెగలు/ ………………………../ నేను నా హక్కులనే అడుగుతా’
– శరణ్ కుమార్ లింబాలే, మరాఠీ దళితకవి
గంగావతరణం గురించి అల్లబడిన పౌరాణికగాథలు గంగ అని పిలువబడే ఒక నది ప్రాకతికమైనదని కాక దైవికమైనదనే కల్పన ప్రచారంలో ఉన్నది. ఆ స్వర్గాన వుండే నది భగీరథుని కోరిక మీద బయల్దేరి, శివుని జటాఝూటం మీద దూకి, అటునుంచి నేలమీదికి అవతరించి పాతాళందాక పయనించి భగీరథుని పూర్వీకుల భస్మరాశులను తడిపి, వారికి సద్గతులనిచ్చిందన్నది కథ.
ఆ గంగ ‘చెమటచుక్కలేని, కన్నీటిచుక్క రాని చుక్కలలోకాల నుంచి’ శూద్రావనికి శూద్రగంగై చెక్కేస్తున్నది.
ఇక్కడే ఈ పౌరాణికకథను ఆసాంతం మార్చేసి కొత్త ‘గంగావతరణాన్ని’ రచించాడు అశోక్ తేజ. ఈ మార్పులో తన పునర్వాఖ్యానం ఒక శూద్రకావ్యంగా, అదే ‘శ్రీశూద్రగంగ’ కావ్యంగా అవతరించింది. ఈ సందర్భంగా పురాణాలను ఆధునికదక్పథంతో పునర్మూల్యంకనం చేసిన నార్ల, త్రిపురనేని, చలంలను గుర్తుచేసుకోవాలె. కాళిదాసు మేఘసందేశం వంటి శూద్ర ‘గబ్బిలం’ కావ్యం రాసిన జాషువాను తలచుకోవలసిందే.
గతసంస్కతులను వర్తమానం గీటురాయిమీద నిగ్గుతేల్చాల్సిన సందర్భం ప్రస్తుతకాలం కర్తవ్యం. కవిగా సుద్దాల అశోక్ తేజ ఆ బాధ్యతను స్వీకరించి ఈ కావ్యరచన చేసాడు.
సాహిత్యంలో అస్తిత్వాలయుగం నడుస్తున్నది. సామాజికశ్రేణుల నిర్దేశికసూత్రాలను తిరుగరాస్తున్నకాలం. తిరుగబడుతున్న కాలం. ప్రశ్న అనే కొడవలినిబట్టి కోసిపారేయాల్సిన కలుపు ధర్మంపేరిట చలామణీ అవుతున్న అబద్ధపు సంస్కతి. మానవధర్మం ఒక్కటే సత్యం. మాయావరణాల ఖర్మం అసత్యం. నిగ్గదీయాల్సిందే ప్రతి పనికిమాలిన ‘చండశాసన’ పర్వాలను.
16 పర్వాల ఈ కావ్యం పురాణాలను తిరగరాసి రాశిపోసింది. ఆర్య, దస్యుల తగవులే సురాసురుల పోరాటంగా పురాణేతిహాసాలు వర్ణించాయి. ప్రతిసందర్భంలో అసురులు, రాక్షసులకు అంటగట్టిన అవవిత్రతలు, అనాగరికతలు, అనైతికతలు కథలే. వాళ్ళ పేర్లు మంచివుండవు. వేష, భూషలు మంచిగుండవు. చెడు మూర్తీభవించినట్లుంటారు వారు. ఆర్య, అనార్య(ద్రవిడ) సిద్ధాంత, రాద్ధాంతాలు అట్ల కల్పించినవే.
ఇపుడు భారతదేశ చరిత్రను విమర్శించేవారు అది ఆంగ్లేయులు, కమ్యూనిస్టులు, సెక్యులరిస్టులు, నాస్తికులు, హిందూవ్యతిరేకులు రాసిన చరిత్రని వెక్కిరిస్తుంటారు. చరిత్రపరిణామం తెలియదు. మతపరిణామం తెలియదు. చరిత్ర ఎపుడూ సరళరేఖ కాదని ఒప్పుకోరు. నిలువుగా విభజనరేఖలను గీసినవారే ఇపుడు చరిత్రను తిరిగి రాస్తున్నారు. వారికీ కావ్యం కటికచేదే.
పాతనమ్మకాలను గంగలో కలిపిన కావ్యం. భూమిపుత్రులది, శూద్రులది ఈ నేలని, ఈ నేలలో పారే గంగ శూద్రులగంగని చెప్పిన కావ్యం. ఈ సమాజంలో పాతుకునిపోయిన నిచ్చెనమెట్ల నిర్మాణాలను కూల్చాసిందేనని ఈ కవి ఉద్బోధ ఈ కావ్యం. ఖచ్చితంగా పాతసమాజాన్ని కూల్చందే కొత్త లోకం పుట్టుకరాదు. ఆధిపత్య వర్ణాల నుంచి శూద్రులకు విముక్తి కావాలంటే శూద్రులే ఏలికలు కావాలె. సాంస్కతిక పాలకులు కావాలె. మానవీయతను, సమానత్వాన్ని చాటే సాహిత్యం ఇంకా రావాలె. వర్ణవ్యవస్థ గీసిన నిలువగీతలను చెరిపేసే పాఠాలు కావాలె. ఇపుడిపుడే శూద్రులు తమ శక్తి, సామర్థ్యాలను గుర్తించి, పోరాటాలబాట పట్టారు. ఇన్నాళ్ళు మోసిన మనుధర్మస్మతి, పితస్వామ్యం, శ్రమజీవుల బతుకుల నిండా పరిచిన మాయలు, తంత్రాలు, ఆంక్షలరేఖలు, కట్టుబాట్లు అన్నింటినీ నేలమట్టం చేయాలె.
శ్రీశూద్రగంగ శూద్రుల గొంతై పాడిన పాట. ప్రకతిని ఆవహించుకుని కవి తానే గంగై రాసిన కావ్యం. గంగ కవి అశోక్ తేజకు స్పోక్స్ పర్సన్. బ్రాహ్మణ్యకథనాన్ని శూద్రరచనగా చేసిందీ కావ్యం. దళితులు, శ్రామికులైన శూద్రులు పరాయీకరణాన్ని వదిలించుకోవడానికి చేసినన నినాదం శ్రీశూద్రగంగ.
శ్రీశూద్రగంగ ఒక గేయకావ్యం. వస్తువుతో ఒక ధార్మికవ్యవస్థను గంగతో కడిగేసింది. ఈ కావ్యంలో కవి ఎక్కడా వచనం రాయలేదు. రాసిందంతా గానయోగ్యమైన గేయమే. పదకవితే. వచన కవితకూడా. వర్ణనలతో ప్రబంధశైలి అబ్బింది. ఎత్తుగడతో కావ్యధోరణి కనబరించింది. ఇదొక దీర్ఘగేయ కావ్యం. దీర్ఘకవితలు రాసిన కుందుర్తి ‘తెలంగాణ’, ఆరుద్ర ‘త్వమేవాహం’, శేషేంద్ర ‘నాదేశం-నా ప్రజలు’, నగముని ‘కొయ్యగుర్రం’ రాధేయ ‘మగ్గం బతుకు’ల తొవ్వలోనే అశోక్ తేజ ‘శ్రీశూద్రగంగ’.
అశోక్ తేజ గేయరచనకొక నడకుంది. తన రచనలోని గతి, లయ, విరామాలు ఇష్టాన్ని పెంచుతాయి. రిథమిక్ గా చొచ్చుకుపోతాడు పాఠకుల గుండెల్లోకి. కొత్త వ్యాఖ్యలు. కొత్త పదబంధాలు. కొంగ్రొత్త చమత్కారాలు. ఊహల్లో విహరింపజేసే పాతకథలకు నేలతోవ చూపించి కొత్తభాష్యాలు రాస్తున్నాడు ఈ కవి.
కవి సజించిన కొత్తపదాలు: శూద్రావని, మన్నేరు, జలశరగమనం, భూప్రేరణ, ఇండియమ్మ, హింధరణి, రాటుమోటలు, చెమటస్వర్గధామం. దౌర్జన్యమునిసంగపరివారం, విషబుద్ధికీటకసంగపరివారం, జటసంగపరివారం, ప్రసిద్ధార్థబుద్ధుడు, రతిరుతువులు ఆకాశపు కుబుసం, ఇష్కెరుగని, బహస్పతుడు, తేలేచెండు, దేవతలం, కైలాసదళితుడు, నీలాంబరంబేడ్కరుడు, భూనీటిపాములు, నీటికటిభామ, నెత్తుటిచెమటజలం, సర్వేశూద్రజనా సుఖినోభవంతు, నన్నయ్య(నన్నుంఅయ్య), కాశీశవాలు
ఈ మాటలన్నీ కొత్త సందర్భాలను సష్టిస్తాయి. తెలంగాణభాష, గ్రాంథికభాష కలగలుపుగా సాగిన రచన. వాచకభాష, పలుకుబడులు జమిలిగా రాసిన రచన. వైవిధ్యమైన రచన.
మూసకథలను, మోసకథలను ఎట్లా తిప్పికొట్టవచ్చో చెప్పే ప్రతిఘటన రచన ఇది. కొత్త నిర్దేశం కొరకు కొత్త అక్షరసంపద్వైభవంతో వచ్చిన కావ్యం. ఏక సూత్రత కాదని బహుళత్వ నినాదమైన కావ్యం శ్రీశూద్రగంగ. నిర్దిష్ట అర్థాల నిరాకరణం, భాషాద్రవీకరణం, వస్తుప్రాధాన్యత, ద్వైధీయమానాల విమర్శ, అధికారపాత్ర, వినిర్మాణం ఈ కావ్య నిర్మాణ రీతులు.
– శ్రీరామోజు హరగోపాల్
పురుషసూక్తాన్ని పునర్మూల్యాంకనం చేసిన శ్రీశూద్రగంగ
- Advertisement -
- Advertisement -