Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుప్రతి ఎకరాకు సాగునీరందేలా కృషి

ప్రతి ఎకరాకు సాగునీరందేలా కృషి

- Advertisement -

– రూ.630 కోట్లతో 33 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
– ఏడాదిలో జవహర్‌ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి
– ‘సీతారామ’ పూర్తి చేసి గోదావరి నీటిని ఖమ్మం జిల్లాకు తరలిస్తాం
– బనకచెర్ల ప్రాజెక్టును అన్ని దశల్లో అడ్డుకుంటాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– జవహర్‌ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
– పాల్గొన్న మంత్రులు వాకాటి, ఉత్తమ్‌, కోమటిరెడ్డి, పొంగులేటి
నవతెలంగాణ-మధిర

కృష్ణ, గోదావరి జలాలను వినియోగించుకుంటూ ఖమ్మం జిల్లాలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర, ఎర్రుపాలెం మండలాలకు సాగునీరు అందించేందుకు మధిర మండలం వంగవీడు గ్రామంలో రూ.630 కోట్లతో చేపట్టిన జవహర్‌ ఎత్తిపోతల పథకం పనులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకాటి శ్రీహరి, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, ఎమ్మెల్యేలు రాందాస్‌ నాయక్‌, మట్ట రాగమయితో కలిసి భట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. మధిర ప్రాంతంలో లభించే నీటిని సద్వినియోగం చేసుకుంటేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే కట్టలేరు ప్రాజెక్టు ఆధునీకరణ పూర్తి చేశామని తెలిపారు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం జవహర్‌ ఎత్తిపోతల పథకానికి మంజూరు ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సంగతే పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు తీసుకొచ్చి సర్వే నిర్వహించి, నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. పాలేరు నుంచి సత్తుపల్లి వరకు నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ద్వారానే పంటలు పండుతున్నాయని తెలిపారు. ప్రతి రోజూ 11 టీఎంసీల నీరు ఏపీ తీసుకుంటుందని, ఈ దోపిడీ ఇలాగే కొనసాగితే 20 రోజుల్లో శ్రీశైలం ఖాళీ అవుతుందని, నాగార్జునసాగర్‌ చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందేలా పోరాటాలు కొనసాగించాలన్నారు. జలవనరుల శాఖ నుంచి కోర్టు వరకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ రాయలసీమ ప్రాజెక్టులు, బనకచర్ల ప్రాజెక్టులను అడ్డుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 7 మండలాలను ఏపీకి కట్టబెట్టడం అన్యాయమన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత, వరద జలాల్లో మన వాటా తేలిన తర్వాతే కింది రాష్ట్రాలు ప్రాజెక్టుల గురించి ఆలోచించాలన్నారు.
జవహర్‌ ఎత్తిపోతల పథకం ఏడాదిలో పూర్తి : మంత్రి ఉత్తమ్‌
మధిర ప్రాంతానికి గేమ్‌ చేంజర్‌గా జవహర్‌ ఎత్తిపోతల పథకం ఉంటుందని చెప్పారు. రూ.630 కోట్లతో చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకం పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలని నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 33 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, వైరా నదిలో 120 రోజుల్లో 4 టీఎంసీలు ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశామని, దీని నిర్మాణానికి 190 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం రూ.45 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పుష్కలంగా గోదావరి జలాలు తీసుకొస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తుందని, గోదావరి నది బోర్డు నుంచి సీడబ్ల్యూసీ వరకు ప్రతి దశలో ఆ ప్రాజెక్టును అడ్డుకుంటామని స్పష్టంచేశారు. గత పాలకుల అవినీతి కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని జస్టిస్‌ కమిషన్‌ రిపోర్ట్‌ అందించిందని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దిండి, సీతారామ, పాలమూరు, దేవాదుల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. రూ.1200 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణం చేపట్టామని, వంగవీడుకు డబుల్‌ రోడ్లు వేస్తామని తెలిపారు.
గోదావరి, కృష్ణా నీటితో జిల్లా సస్యశ్యామలం : మంత్రి పొంగులేటి
గోదావరి నీటిని పాలేరుకు తీసుకొచ్చి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న 33 వేల ఎకరాల్లో రెండు పంటలు పండేలా సస్యశ్యామలం చేసేందుకు జవహార్‌ ఎత్తిపోతల పథకం ఉపయోగపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా ఆంధ్రాతో సంబంధం లేకుండా జోన్‌ 3 ఆయకట్టు జోన్‌ 2 పరిధిలోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో 33 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే దిశగా జవహార్‌ ఎత్తిపోతల పథకం ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు. ఈ సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ నాయుడు సత్యనారాయణ, డీసీసీబీ చైర్మెన్‌ దొండపాటి వెంకటేశ్వర రావు, ఇరిగేషన్‌ సీఈ రమేశ్‌, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img