అశ్వారావుపేట నియోజక వర్గం 2009 లో ఏర్పాటు..

– ప్రధమ ఎమ్మెల్యే గా వగ్గెల మిత్ర సేన..
– నాలుగో సారి జరగనున్న ఎన్నికలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రతీ 30 ఏండ్లుకు ఒక సారి జరిగే నియోజక వర్గాల పునర్విభజనలో భాగంగా 2009 లో అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, కుక్కునూరు, వెలేరుపాడు మండలాలతో 1,55, 376 ఓటర్లతో  అశ్వారావుపేట కేంద్రంగా నూతన గిరిజన 118వ నియోజకవర్గంగా 204 పోలింగ్ కేంద్రాలతో ఏర్పాటు రూపొందింది. ఈ నియోజకవర్గానికి మొదటి సారి 2009 ఎన్నికలు జరిగాయి.
రెండవ సారి 2014 లో  164 పోలింగ్ కేంద్రాలతో 1,64,419 ఓటర్లుతో సాధారణ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రాల పునర్విభజనలో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది.ఈ నియోజకవర్గంలోని కుక్కునూరు,వెలేరుపాడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేశారు. దీంతో అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ మండలాలు అశ్వారావుపేట నియోజక వర్గంలో ఉన్నాయి. 2018 డిసెంబర్ లో రాష్ట్రాన్ని భౌగోళికంగా పునర్నిర్మాణం చేయడంతో ఈ నియోజక వర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భాగం అయి అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి కలుపుకుని 5 మండలాలతో నియోజక వర్గం ఏర్పడింది.
2018 ఎన్నికల్లో 1 లక్షా 42 వేల 571 ఓటర్ల తో ఎన్నికలు నిర్వహించారు. రాబోయే 2023 ఎన్నికలలో 184 పోలింగ్ కేంద్రాలతో  1 లక్షా 46 వేల 685 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నియోజకవర్గానికి మొదటి సారి 2009 లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ(ఎం), తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్ధి పాయం వెంకయ్య (సీపీఎం)(41,076),పై కాంగ్రెస్ అభ్యర్థిగా వగ్గెల మిత్ర సేన(46,183) ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2వ సారి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా వగ్గెల మిత్ర సేన(15,073), తెలుగుదేశం అభ్యర్ధిగా మెచ్చా నాగేశ్వరరావు(48,575), టీఆర్ఎస్ అభ్యర్థిగా జారే ఆదినారాయణ(13,080)పై వైఎస్ఆర్ సీపీ, వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తాటి వెంకటేశ్వర్లు(49,421) తల పడగా మెచ్చా నాగేశ్వరరావుపై తాటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు. అనంతరం కొద్ది కాలానికే తాటి టీఆర్ఎస్ లో విలీనం అయ్యారు. మూడో సారి 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటి వెంకటేశ్వర్లు(48,007),కాంగ్రెస్ – తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్ధిగా  మెచ్చా నాగేశ్వరరావు(తెదేపా)(61,124),తాటి వెంకటేశ్వర్లు (టీఆర్ఎస్),సీపీఐ(ఎం) అభ్యర్ధిగా తానం రవీందర్(4,955) తల పడగా తాటి వెంకటేశ్వర్లు పై మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు.అయితే తాటి వెంకటేశ్వర్లు బాటలోనే మెచ్చా నాగేశ్వరరావు సైతం ఎమ్మెల్యే అయినా రెండో ఏడాది టీఆర్ఎస్ లో విలీనం అయ్యారు. అయితే 2023 లో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు,కాంగ్రెస్ అభ్యర్ధులు తాటి వెంకటేశ్వర్లు లేక జారే ఆదినారాయణ,తెదేపా నుండి కట్రం స్వామి దొర ప్రధానంగా పోటీలో ఉండే అవకాశం ఉంది. కాగా  పై విశ్లేషణ,గణాంకాలు వివరాలు ప్రకారం గతంలో రెండు దఫాలు ఈ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు గా మిత్ర సేన, తాటి వెంకటేశ్వర్లు  పోటి పడి గెలవలేక పోయారు.
Spread the love