నవతెలంగాణ – దామరచర్ల
ముగ్గు మిల్లుల యాజమాన్యాలు కార్మికుల బాగోగులను గాలి వదిలేశాయని సీఐటీయూ మండల కార్యదర్శి బైరం దయానంద్ ఆరోపించారు. దామరచర్ల మండల కేంద్రంలోని సీఐటీయూ మండల కార్యాలయంలో సోమవారం ముగ్గు మిల్లుల కార్మికుల సమావేశం ఎస్ నీలాబాయి అధ్యక్షతన జరిగినది ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ దయానంద్ మాట్లాడుతూ ముగ్గు మిల్లుల యాజమాన్యం కార్మికులకు వేతనాలు సక్రమంగా ఇవ్వడం లేదని చెప్పారు. కనీస సౌకర్యాలు బెల్లం , చెప్పులు , మాస్కులు , డ్రస్సులు , ఇవ్వడంలేదని ఆరోపించారు. ఇప్పటివరకు 70 రూపాయలు టన్నుకు ఇస్తుండగా మిషన్ పేరుతోటి రూ.45 కుదించినందున కార్మికుల కు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని చెప్పారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువులకు ధరలకు అనుకూలంగా కనీసం 80 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముగ్గు మిల్లుల నుండి విపరీతంగా దుమ్ము దూళి వెలువడుతున్న ఏనాడైనా లేబర్ అధికారులు వాటి జోలికి పోకపోవడం దారుణం అన్నారు.తక్షణమే మైనింగ్ ,కాలుష్యం ,కార్మిక శాఖ ల అధికారులు ముగ్గు మిల్లులు తనిఖీ చేసి న్యాయం చేయాలని కోరారు.కార్మికుల కు ఈఎస్ఐ అదేవిధంగా ప్రమాద బీమా సంక్షేమ పథకాలు వెల్ఫేర్ బోర్డు కార్డులు వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వినోద్ ,ఎర్రనాయక్, ఎస్ పాపా నాయక్, కార్మికులు నాగులు, రాందాసు, రవి ,సైదా తదితరులు పాల్గొన్నారు.