నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్‌లో తాము నిరాధారణకు గురువుతున్నామని, తమకు ప్రత్యేక దేశం కావాలని ఏండ్ల తరబడి బలూచ్ తిరుగుబాటుదార్లు పాక్‌లో తిరుగుబావుటా ఎగరేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ప్రాంతంలోని ఖనిజ వనరులను దోపిడీ చేస్తోందని, స్థానిక బలూచ్ సమాజంపై వివక్ష చూపుతోందని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తోంది. చాలాఏండ్లుగా బలూచ్ ప్రజలపై పాక్ సైన్యం ఉక్కుపాదం మోపుతూ..వారిపై విచక్షణ రహితం కాల్పులకు తెగబడుతుంది. ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉద్యమకారుల కుటుంబసభ్యులను లక్ష్యంగా పాక్ ప్రభుత్వం వికృత చర్యలకు పాల్పడుతోంది. కీలక నాయకుల కుటుంబసభ్యులు కనపడకుండా పోతున్నారని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. తమ వాళ్ల ఆచూకీ తెలుపాలని, పాక్ ఆర్మీ దమనకాండను తక్షణమే ఆపాలని బలూచ్ ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్థాన్ పై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైన్యాలు దాడి చేస్తున్న సందర్భంలో.. బలూచ్ ఆర్మీ తన తిరుగుబాట్లను ఉధృతం చేసింది. పాక్ ఆర్మీపై దాడులు చేసి చావు దెబ్బకొట్టింది.అంతేకాకుండా మార్చి 2025లో, ఈ సంస్థ క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న ‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’ రైలును హైజాక్ చేసి 31 మందిని చంపి, 300 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకుంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో గత కొన్ని దశాబ్దాలుగా BLA హింసాత్మక వేర్పాటువాద ఉద్యమాన్ని నిర్వహిస్తోంది.. యూఎస్, పాకిస్తాన్ రెండూ ఇప్పటికే BLAని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.

ఈకమంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)ని విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO)గా అమెరికా అధికారికంగా ప్రకటించింది. BLA అనుబంధ సంస్థ ‘ది మజీద్ బ్రిగేడ్’ ను కూడా ఈ జాబితాలో చేర్చారు. బలూచ్ తిరుగుబాటుదారులపై ప్రపంచ స్థాయిలో కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేసిన విజ్ఞప్తి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.