Sunday, May 25, 2025
Homeఅంతరంగంక్షమాపణ

క్షమాపణ

- Advertisement -

బంధాలు నిలబడాలంటే చిన్న చిన్న తప్పులను క్షమించడం ఎంతో అవసరం. అది లేకుంటే నిరంతరం మనస్పర్థలతో జీవితంలో ప్రశాంత లేకుండా పోతుంది. అయితే ఈ మన్నించడం మరీ ఎక్కువైతే చివరికి మనకు మనమే మిగలకుండా జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంది. బంధాలు బాగుండాలంటే సర్దుకుపోవాల్సిందే. కానీ దానికీ ఓ హద్దుంది. ఎవరిమీదైనా చెప్పలేనంత ప్రేమ ఉండడం మంచిదే ఏదీ ఆశించకుండా ప్రేమించడం గొప్ప విషయం కూడా. కానీ ఆ ప్రేమను అవతలి వారు అలుసుగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. కలకాలం కలిసుండాలంటే ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి గౌరవం కూడా అవసరం. క్షమిస్తున్నామన్న భ్రమలో మిమ్మల్ని కిందచపరిచే సమయంలో కూడా మౌనంగా ఉండడం మంచిది కాదు. మీ సహనానికి హద్దులు ఉన్నాయని అవతలి వారితో నిస్సంకోచంగా చెప్పండి.
మానవత్వం తెలిసిన మనుషుల్లో ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే మన ప్రేమతో, క్షమతో వారిని మార్చవచ్చు. లోపాలు మనిషికి సహజం. కానీ మృగంలా ఆలోచించే వారిని, ప్రవర్తించే వారిని అతిగా క్షమించడం అస్సలు మంచిది కాదు. మీ పట్ల తరచూ అనుచితంగా ప్రవర్తించినా, మీపై శారీరకంగా దాడి చేసినా క్షమించే ఆలోచన చేయకండి. అటువంటి వారు మీ మంచితనం వల్ల మారకపోగా.. మీ ప్రేమను, మీ క్షమను అసమర్థతగా భావిస్తారు.
మీరు ప్రేమించే వారి ప్రాధాన్యాలు మారుతున్నపుడు గమనించండి. ఎప్పుడూ ఒకేలా ఉండడం, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అదే ప్రేమ, గౌరవం చూపడం అందరి వల్లా సాధ్యం కాదు. కానీ ముఖ్యమైన సందర్భాలలో కూడా మిమ్మల్ని తరచూ మర్చిపోతుంటే, నిర్లక్ష్యం చేస్తుంటే ఎప్పటిలా క్షమించడం మంచిది కాదు. వారి జీవితంలో మీ స్థానం గురించి ప్రశ్నించండి. మీరు అనుభవించే మానసిక సంఘర్షణను వారితో పంచుకోండి. ఇలాంటి సున్నితమైన విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ జీవితం మీకు తెలీకుండానే చేజారే అవకాశం ఉంది.
ముఖ్యంగా దంపతులు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాదనలు ఇష్టపడని వారు అవతలి వారు ఏం చేసినా చూసీ చూడనట్టు ప్రవర్తిస్తారు. కానీ లోలోపల ఆ అసంతృప్తి వారిని చాలా కుంగదీస్తుంది. దీనివల్ల భార్యాభర్తలిద్దరి మధ్య అగాథం ఏర్పడుతుంది. కొందరు పెళ్లైన కొత్తలో తమ భాగస్వామిపై ఉన్న విపరీతమైన ప్రేమతో తాము అంగీకరించలేని విషయాలను కూడా క్షమించేస్తారు. అదే అసులుగా తీసుకుని అవతలివారు తమ ప్రవర్తన కష్టం కలిగిస్తుందని తెలిసినా మారరు. సరికదా.. ఎప్పుడైనా వారి వల్ల కలిగే ఇబ్బందిని తెలియజేసినప్పుడు ‘నువ్వు నన్ను ఇంతకు ముందులా ప్రేమించట్లేదు’ అంటూ మానసిక దాడి చేస్తారు.
అప్పుడప్పుడూ తప్పులు చేసే భాగస్వామిని క్షమించిన వారి దాంపత్యం సంతోషంగా సాగే అవకాశం ఉంటుంది. ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. అదే నిరంతరం ఒకరు తప్పులు చేయడం, మరొకరు దాన్ని క్షమించడం అలవాటైన జంటలు విపరీతమైన మనోవ్యథను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలంటే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేకానీ నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారు అవుతారు. చివరగా.. బంధమేదైనా సరే అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని మర్చిపోకండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -