Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుస్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగానే సీపీఐ(ఎం) పోటీ

స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగానే సీపీఐ(ఎం) పోటీ

- Advertisement -

ఎన్నికలొచ్చినప్పుడు
ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి
సమస్యలపై ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తాం
బీజేపీ రూపంలో ఫెడరలిజానికి ప్రమాదం
దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తోన్న మోడీ-ట్రంప్‌ : పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-అశ్వారావుపేట

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) స్వతంత్రంగానే పోటీ చేస్తుందని, ఇప్పటికే రాష్ట్ర, జిల్లా కమిటీలు విధాన నిర్ణయం చేశాయని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, నందిపాడు మాజీ సర్పంచ్‌ ఊకే వీరాస్వామి సంస్మరణ సభ గురువారం జరిగింది. ఇందులో తమ్మినేని పాల్గొన్నారు. అనంతరం సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసినవిలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఒకటి, రెండు హామీలను అమలుచేసినా అవికూడా పూర్తిస్థాయిలో అమలుకాలేదని తెలిపారు. హామీల అమలుకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజాఉద్యమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నామని, ఒంటరిగానే పోటీ చేయాలనుకున్నామని, ఎవరైనా కలిసి వస్తే ఆలోచిస్త్తామని అన్నారు. పోరాట పంథాను విడవబోమని, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మతోన్మాదం, నయా ఉదారవాదం భారత దేశానికి పట్టిన రాహు కేతువులని, వీటిని నిలువరించకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడే ఉండదని తమ్మినేని అన్నారు. దేశంలో నేడు రెండు పార్శ్వాలు కనపడుతున్నాయని, అందులో పెట్టుబడిదారులు, కార్పొరేట్లు, ధనవంతుల భారత దేశం ఒకటయితే.. పేదలు, కష్టజీవులు, కార్మికులు, శ్రామికులు రెండో భారతదేశం అని వ్యాఖ్యానించారు. నాడు తెల్ల బ్రిటీష్‌ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకుంటే, నేడు స్వదేశీయులే వ్యాపారులై దేశ సంపదను కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ లౌకిక విధానం, ఫెడరలిజానికి.. బీజేపీ రూపంలో ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన తంతుగా మారిందని, స్వయానా కేంద్ర ఎన్నికల సంఘమే కేంద్ర ప్రభుత్వానికి నకిలీ, దొంగ ఓట్లు చేర్పింపులో సహకరిస్తున్నదని అన్నారు. బీహార్‌లో లక్షలాది ఓట్లు నకిలీ అని రాహూల్‌ గాంధీ ప్రదర్శించారని, ఇది దేశవ్యాప్త సమస్యగా మారే అవకాశం ఉందని తెలిపారు. మోడీ-ట్రంప్‌.. తాము మంచి స్నేహితులం అంటూనే భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ట్రంప్‌ అమెరికాకు మాత్రమే అధ్యక్షులని, ఆయన ఇతర దేశాలపై పెత్తనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో సహకరించే దేశాలు చాలా ఉన్నాయని, వాటితో భారతదేశం స్నేహ సంబంధాలు కొనసాగించాలని అన్నారు. నెహ్రూ కాలం నుంచి రష్యా స్నేహ దేశంగా ఉండేదని గుర్తు చేశారు. సుంకాల పేరుతో ట్రంప్‌ ప్రపంచంపై గుత్తాధిపత్యం చెలాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మతోన్మాదం, పెట్టుబడిదారీ విధానం, దోపిడీ నుంచి ప్రజలను విముక్తి చేయడానికి దేశవ్యాప్త ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా పట్ల గత ప్రభుత్వం మాదిరే కాంగ్రెస్‌ ప్రభుత్వమూ వివక్ష చూపుతుందని అన్నారు. నలుగురు ముఖ్యమంత్రులు మారినా సీతారామ ప్రాజెక్ట్‌ను మాత్రం నేటికీ పూర్తి చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్‌, కార్యదర్శి వర్గ సభ్యులు గంగరాజు, మడిపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad