-మేం ఎవరికీ వ్యతిరేకం కాదు
గత కొన్ని రోజులుగా ఫిల్మ్ ఛాంబర్, కో ఆర్డినేషన్ కమిటీ అధ్వర్యంలో ఫెడరేషన్, నిర్మాతలకు మధ్య జరుగుతున్న చర్చలు ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. దీంతో సినిమాల షూటింగ్‌లు ఆగిపోవడంతో నిర్మాతలు, షూటింగ్‌లు లేకపోవడంతో సినీ కార్మికులూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్మాతలు చెర్రీ (మైత్రి మూవీ మేకర్స్’, వివేక్ కూచిభొట్ల (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ), రాధా మోహన్ (శ్రీ సత్యసాయి ఆర్ట్స్) మీడియాతో మాట్లాడారు.
మేం కార్మికులకు వ్యతిరేకం కాదు అని చెప్పడమే మా ఉద్దేశ్యం. అలాగే మేం పెట్టిన 4 ప్రతిపాదనలను ఫెడరేషన్ అంగీకరిస్తే వేతనాల పెంపు పై మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే వీటిల్లో 1వ షరతు.. టాలెంట్ ఉన్న వారిని ఎవరినైనా నిర్మాతలు పెట్టుకొనే అవకాశం, 2వ షరతు.. ఫైటర్లు, డాన్సర్ల రేషియో లేకుండా చూడటం వంటి షరతులను ఫెడరేషన్ 2022లోనే అంగీకరించింది. వీటితోపాటు 3వ షరతుగా.. పని విధానానికి సంబంధించి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక కాల్షీట్, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఒక కాల్షీట్, 4వ షరతుగా.. ఆదివారం డబుల్ కాల్షీట్ లేకుండా చూడటం (రెండో ఆదివారం మరియు ప్రభుత్వం ప్రకటించిన సెలవులకు డబుల్ కాల్షీట్ ఓకే) వీటిని అడుగుతున్నాం. ఈ 3,4 ప్రతిపాదనల దగ్గర చర్చలు ఆగాయి అని నిర్మాతలు తెలిపారు.
‘వేతనాలు పెంచాలని గత కొద్ది రోజులుగా ఫెడరేషన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్మాతల నుంచి కొన్ని షరతులు ఉన్నాయి. ముఖ్యంగా 2018, 2022లలో జరిగిన అగ్రిమెంట్స్‌లో ఉన్న రెండు షరతులను వాళ్ళు అమలు చేయటం లేదు. ముందు వాటిని అంగీకరించాలి. వీటితోపాటు మరో రెండు షరతులను పెట్టాం. ఇదే విషయాన్ని ఛాంబర్ ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. రూ.2 వేలు కన్నా తక్కువ వేతనం తీసుకునే వారికి ఒక పర్సంటేజీ, దాని కన్నా ఎక్కువ వేతనం తీసుకునే వాళ్ళకు మరొక పర్సంటేజీని ప్రతిపాదించాం. వీటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటే, వేతనాలు పెంచటానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నాం’ అని నిర్మాత దిల్‌రాజు చెప్పారు.