Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిసామాజిక విప్లవకారుడు పాపన్నగౌడ్‌

సామాజిక విప్లవకారుడు పాపన్నగౌడ్‌

- Advertisement -

బడుగులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన గొప్ప సామాజిక విప్లవకారుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌. 350 ఏండ్ల కిందనే సమ సమాజ స్థాపన కోసం కృషిచేసిన ధీరుడు. ఆధిపత్య, అగ్రకుల పాలకులు బడుగు,బలహీన వర్గాలను అణగదొక్కుతున్న పదిహేడవ శతాబ్దంలోనే స్వీయసైన్యంతో దక్కన్‌పై బహుజన రాజ్యాన్ని స్థాపించిన వీరుడు. మహాత్మా జ్యోతిరావుపూలే కంటే ముందే సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు.రాచరికపు వ్యవస్థ నీడలో అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, జమీందార్లు, జాగీర్దా రుల అరాచకాలను సహించలేక కడుపు మండి ఉలి (గౌడ కులస్తులు గీత వృత్తిలోవాడే కత్తి) పట్టాడు పాపన్న. ఖిలాషాపూర్‌ను కేంద్రంగా చేసుకుని మొఘలుల ఆధిపత్యాన్ని ఎదిరించాడు. మొఘల్‌ ఆస్థానంలో పనిచేసిన ‘ఖాఫీ ఖాన్‌’ రచన ‘ముంతఖల్‌-అల్‌-లుబాద్‌’లో తొలిసారి పాపన్న గురించిన ప్రస్తావన ఉంది. షాజహాన్‌, ఔరంగజేబు పాలనలో భారత దేశ చరిత్రకు ప్రముఖ ఆధారంగా ఈ రచనను భావిస్తారు. సిద్దిపేట జిల్లా ‘ధూల్‌మిట్ట’లో దొరికిన వీరగల్లు రాతి విగ్రహంపై ఉన్న శాసనం ఆధారంగా అది సర్వాయి పాపన్న విగ్రహమేనని కొంతమంది చరిత్రకారుల భావన.
అమెరికాలోని ఆరిజోనా యూనివర్సిటీ, కాలేజ్‌ ఆఫ్‌ సోషల్‌ అండ్‌ బిహేవియరల్‌ సైన్సెస్‌లో చరిత్ర విభాగం ప్రొఫెసర్‌, రిచర్డ్‌ ఎం.యాటన్‌ రాసిన ‘ఏ సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ ది డెక్కన్‌, 1300-1761 ఎయిట్‌ ఇండియన్‌ లైవ్స్‌’ పుస్తకాన్ని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రచురిం చింది.

సర్వాయి పాపన్న కవర్‌పేజీ ఫొటోతో ప్రచురించిన ఈ పుస్తకంలో ఆయన జీవితానికి సంబంధించిన అనేక పరిశోధనాత్మక విషయాలు ఉన్నాయి.తెలంగాణ జానపదాల్లో బుర్రకథలు, బైండ్ల, గంగిరెద్దుల ఇతర సంచార కులాల వారి పాటల్లోనూ పాపన్న ప్రస్తావన ఇప్పటికీ ఉంది. పాపన్నది ఉమ్మడి వరంగల్‌ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్‌. ప్రజలు ప్రేమ ఆప్యాయతలతో పాపన్నను పాపన్న దొర అని పిలిచేవారు. సర్వమ్మ మాత్రం పాపడు అని పిలిచేది. తల్లికోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు. కాని అప్పటి సామాజిక పరిస్థితులు పాపన్నను పోరాటయోధునిగా మార్చాయి. బాల్యంలో పశువుల కాపరిగా నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్ధితులు స్నేహితులతో చర్చించేవాడు. చిన్నతనం నుంచే ఆధిపత్య బ్రాహ్మణ భావజాల వ్యతిరేక బీజాలు ఆయనలో ఏర్పడ్డాయి.నిత్యం పూజలు చేసే సంప్రదాయాలను యుక్తవయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించాడు.బానిసత్వం నుండి ప్రజలకు విముక్తి కల్పిస్తానని కులవృత్తి చేయనని తల్లితో ప్రతిజ్ఞ చేశాడు. చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్‌ మీరు సాహేబ్‌ పాపన్న ప్రధాన అనుచరులు.వీరందరూ బహుజనులే.

తెలంగాణాలో మెఘల్‌ రాజుల ఆధిపత్యాన్ని అంతం చేయాలని, తాబేదారులు, జమీనుదారులు, జాగీ ర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి బానిసత్వ విముక్తి కల్పించాలని గోల్కొండ కోటపై బహుజనుల జెండా ఎగురవేయాలని నిర్ణయించాడు. పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం, ధనం, అధికారం కాని లేవు.12వేల మందితో గెరిల్లా సైన్యాన్ని,వారికి తోడుగా మూడువేల మందితో పదాతి దళాలు,500 మందితో రక్షక దళాలను ఏర్పాటు చేసుకున్నాడు. దళిత,గిరిజనులను చేరదీసి వారికి యుద్ధవిద్యలను నేర్పాడు.మొఘల్‌ సైన్యంపై తన సైన్యంతో దాడిచేసి తన సొంత ఊరు ఖిలాషాపూర్‌ని రాజధానిగా చేసుకుని 1675లో సర్వాయిపేటలో రాజ్యాన్ని స్థాపించాడు. తెలంగాణాలో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ విజయ దుర్గాలు, కోటలు 21 నిర్మించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. సామాన్య వ్యక్తి శత్రుదుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం. పాపన్న ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొఘలుల తొత్తులైన నిజాములు, కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపర్చారు. అయినప్పటికీ 1700- 1705 మధ్యకాలంలో ఖిలాషాపురంలో మరొక దుర్గం నిర్మించాడు. ఒక్కో మెట్టుఎక్కుతూ చివరకు గోల్కొండ కోటను స్వాధీనపర్చుకొని ఏడు నెలలపాటు అధికారం చెలాయించాడు. మొఘల్‌ రాజు బహుదార్‌షా పాపన్న పరాక్రమాన్ని గుర్తించి గోల్కొండ ప్రభువుగా ప్రకటించాడు.
– పాకాల శంకర్‌ గౌడ్‌, 9848377734

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad