Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిభారతపౌరులు, స్వాతంత్య్ర పరిరక్షణ

భారతపౌరులు, స్వాతంత్య్ర పరిరక్షణ

- Advertisement -

మన రాజ్యాంగ పరిషత్తు చర్చలను పునర్దర్శించడానికి స్వాతంత్య్ర దినోత్సవం నరైన సందర్భంగా ఉంటుంది. ఆ సభలో ప్రధానంగా భారత స్వాతంత్య్ర పోరాట యోధులు ఉండేవారు. వారంతా మన చరిత్ర లోతు పాతులు, సామాజిక వాస్తవాలు, సాంస్కృతిక సాంప్రదాయాలు బాగా ఎరిగినవారు. చరిత్రలో మానవ ప్రగతి, సమ కాలీన ప్రపంచ పరిస్థితులు బాగా తెలిసిన వారు కూడా.ఆ సమయంలో వారి ముందున్న చారిత్రక సవాలు రెండు ప్రధానమైన ప్రశ్నలుగా రూపుదాల్చింది: ఇంత అపారమైన వైవిధ్యంతో కూడిన మహా విస్తార జనాభాకు పురోగమన శీలమైన, అభ్యుదయకరమైన రాజ్యాన్ని నిర్మించడం ఎలా?

పీఠికలోనే సందేశం
దానిపై వారు ఒక విలక్షణమైన పరిష్కారం కనుగొన్నారు. ఈ మొత్తం కసరత్తుకు పౌరసత్వాన్ని గుండె కాయగా చేశారు. స్వతంత్ర భారతంలో ఒక ఉమ్మడి సమాన పౌరసత్వమే సర్వజనులకు ఉండాలని నిర్ణయించారు. దేశంలోని బహు ముఖీనతను పాటించాలని, విభిన్నతలతో నిండిన అనేక దొంతరలను పాటించరాదని తేల్చారు.
ఆ తర్వాత రాజ్యాంగం పీఠిక ఈ దృక్పథాన్ని మరింత పటిష్టం చేసేలా రూపొందింది:
”భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమిక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసుకోవాలని, తన పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, భావాలు, వ్యక్తీకరణలు నమ్మకాలు విశ్వాసాలు పూజారీతులకు సంబంధించిన స్వేచ్ఛ: ప్రతిపత్తిలోనూ అవకాశాల్లోనూ సమానత్వం: వారిలో సౌభ్రాతృత్వాన్ని: వ్యక్తి గౌరవం, జాతి సమైక్యత సమగ్రతలకు హామీ ఇచ్చే విధంగా పెంపొందించాలని మా రాజ్యాంగ పరిషత్తులో ఈ 1949 నవంబర్‌ 26వ రోజున దృఢంగా నిర్ణయించుకొని దీని ద్వారా ఆమోదించి, శాసనబద్ధం చేసి, మాకు మేము ఈ రాజ్యాంగాన్ని సమర్పించు కుంటున్నాము.”
పీఠికలో ఉన్న ఈ కథను వాస్తవంలోకి అనువదించాలంటే సహజంగానే ప్రాతినిధ్య ప్రభుత్వ స్థాపనలో ప్రతి పౌరుడికి తనదైన భాగం ఉందనే భావన కలిగేలా హామీ కల్పించబడాలి. వ్యక్తిగత ఓటింగ్‌ ద్వారా ప్రజలు ఆ ప్రభు త్వాన్ని ఎన్నుకోవాలి. ఆ ప్రభుత్వం అధ్యక్ష తరహాగా ఉండరాదని, మంత్రివర్గ వ్యవస్థతో పార్లమెంటరీ తరహా ప్రభు త్వంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్ధారించినట్టు ఆసభ చర్చలను పరిశీలించిన వారెవరికైనా స్పష్టమవుతుంది.
తదనుగుణంగానే రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం సమాఖ్య చట్రంతో, కొన్ని కేంద్ర పాలన లక్షణాలతో రూపొందించబడింది. కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి ఉంటారు. భారత రాజ్యాంగం 79వ అధికరణం ప్రకారం కేంద్ర పార్లమెంట్‌లో రాష్ట్రపతి, ఉభయ సభలు అంటే రాష్ట్రాల సభగా రాజ్య సభ, ప్రజల సభగా లోక్‌సభ ఉంటాయి.

ఎన్నికల ప్రక్రియ
ఈ పార్లమెంటరీ తరహాను ఆమోదించడం ద్వారా రాజ్యాంగం ఎన్నికల ప్రక్రియను నిర్ధారించటం మొదలు పెట్టింది. ఎవరినీ పక్కన పెట్టని సార్వత్రిక వయోజన ఓటింగ్‌ ఉండాలని నిర్ణయించింది. ఈ విషయంలో 326వ అధికరణంలో ఇలా జొప్పించబడింది: ”ప్రజల సభకు, రాష్ట్రాలలోని శాసనసభలకు వయోజన ఓటు హక్కు ప్రాతి పదికగా ఉంటుంది. అంటే దాని అర్థం భారత పౌరుడైన, ఆ రోజుకు 18 ఏళ్ల లోపు వయస్సు దాటిన ప్రతి వ్యక్తి (అక్కడ నివాసం లేకపోవడం, మతి స్థిమితం లేకపోవడం, నేరం లేదా అవినీతి, చట్టవిరుద్ధ పద్ధతుల వంటి వాటి ప్రాతిపదికన సంబంధిత చట్టసభ చేసే చట్టం ప్రకారం లేదా దాని తరఫున నిర్ణయించే అనర్హతలకు గురికాని ప్రతి వ్యక్తి) అలాంటి ఎన్నిక ఏదైనా ఓటరుగా నమోదు కావడానికి హక్కు కలిగి ఉంటారు”.
ఉత్తరోత్తరా సుప్రీంకోర్టు సార్వత్రికతను మరింత నొక్కిచెప్పింది. ఓటుచేసే హక్కు రాజ్యాంగ హక్కు అని నిర్దిష్టంగా వక్కాణించింది.
ఆ తర్వాత రాజ్యాంగం రాజకీయ పార్టీల ప్రభావం సోకకుండా రక్షణలతో సుదృఢóమైన, స్వతంత్రమైన ఎన్నికల సంఘం ఏర్పాటుకు చోటు కల్పించింది. అందరికీ సమాన అవకాశాలతో ఎన్నికలు న్యాయంగా స్వేచ్ఛగా జరగడానికి జరిగినట్టు కనిపించడానికి ఇది అత్యవసరమైనది. 324 అధికరణం ఇలా పేర్కొంటున్నది. ”పార్లమెం టుకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి స్థానాలకు జరిగే అన్ని ఎన్నికల ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించి పర్యవేక్షణ, నిర్దేశం, నియంత్రణకు ఎన్నికల కమిషన్‌కు అధికారంగా ఉండాలని ఈ రాజ్యాంగం నిర్దేశించింది. ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సి.ఇ.సి), అలాగే ఎప్పటికప్పుడు రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఎలక్షన్‌ కమిషనర్లు ఉంటారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఇతర ఎన్నికల కమిషనర్ల నియా మకాలు, నియామకం పార్లమెంట్‌ చేసే చట్టానికి, రాష్ట్రపతి నిర్ణయాలకు లోబడి చేసే చట్టాలలోని నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషనర్ల, ప్రాంతీయ కమిషనర్ల సర్వీసు నిబంధనలు పదవీ కాలం నిర్ణయం అవుతాయి. సుప్రీం కోర్టు న్యాయమూర్తి తరహాలో అలాంటి కారణాలతో తప్ప ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను అధికారం నుంచి తప్పించ డానికి వీలుండకూడదు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నియామకం తర్వాత సర్వీస్‌ పరిస్థితులను ఆయనకు అను కూలంగా ఉండేట్టు మార్చకూడదు. తక్కిన ఎన్నికల కమిషనర్లు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సిఫార్సు మేరకు తప్ప పదవి నుంచి తప్పించడం జరగరాదు”.
కనుక రాజ్యాంగ సూత్రాల చట్టం సార్వజనీనతను నొక్కి చెబుతున్న విషయం స్పష్టం. పౌరసత్వం లేక పోవడం అన్నది కేవలం మినహాయింపు మాత్రమే. అర్హతను నిర్ధారించే బాధ్యత ఎన్నికల సంఘానికి అప్పగిం చలేదు. మొదటి నుంచి కూడా తొలి ఎన్నికల సంఘం రూపొందించిన రెండు ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి కమిషన్‌ పని చేస్తూ వచ్చింది 1.ఎన్నికలు సార్వత్రికతకు హామీనివ్వాలి. 2.ఓటర్ల జాబితాలో చేర్చడం అన్నది కేవలం వ్యక్తి గతంగా పౌరుడి బాధ్యతగా ఉండకూడదు.

ఏమైనా ఇప్పుడు పెద్ద వివాదం వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం (సి.ఏ.ఏ) తో మొదలుపెట్టి జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ (ఎన్‌.ఆర్‌.సి) తో కొనసాగిన ప్రభుత్వ చర్యలలోనే దీనికి మూలాలు ఉన్నాయి. సిఐఏ విభ జనాత్మకమైన వివక్షా పూరితమైందిగా విస్తృతంగా నిరూపితమైంది. దాన్ని అధికారికంగా అమలు ప్రకటించటం జరగకపోగా ఎన్‌.ఆర్‌.సి ప్రక్రియ నిలిచేపోయింది. ఇవి రెండూ రాజ్యాంగం రూపొందిం చిన ఉమ్మడి సమాన పౌరసత్వ భావనకు విరుద్ధమైన వన్న ఆందోళనే వీటికి వ్యతిరేకత రావడానికి మూలం.

ఆరెస్సెస్‌ భావజాలమే అది
ఆరెస్సెస్‌ పాత్రను చారిత్రిక సందర్భంతో చూడటం అవసరం. పుట్టినప్పటి నుంచి ఆరెస్సెస్‌ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య లౌకిక గణతంత్రాన్ని ఆమోదించడానికి నిరాకరించింది. హిందూ రాష్ట్ర అనే హిందూ జాతీయవాదంపై ఆధారపడిన ఈ భావజాలం ఇస్లామిక్‌ జాతీయవాదానికి ప్రతిరూపం వంటిదే. ఇస్లామిక్‌ రాజ్యాంగ పాకిస్తాన్‌ ఏర్పడ డానికి దారితీసింది అదే. జాతీయవాదం, రాజ్యం గురించిన ఈ రెండు భావనలు ”విభజించి పాలించు” అన్న బ్రిటిష్‌ వలసవాద విధానం నుంచి ప్రత్యక్షంగా పుట్టినవే. బ్రిటిష్‌ వలసవాద చరిత్రకారులు భారతదేశ గతం హిందూ ముస్లింల మధ్య మాత్రమే సాగిన ఘర్షణగా ఒక కథనాన్ని సృష్టించారు. ఇది చరిత్రను వక్రీకరించింది. మత ప్రాతి పదికన జాతీయవాదం. మరింత బలపడటానికి, అంతిమంగా పాకిస్తాన్‌ ఏర్పడడానికి కారణమైంది. భారత స్వాత ంత్య్రం ప్రాధాన్యతను తగ్గించి వేసిన ఈ ఫలితం మానని గాయంగా మిగల్చబడింది.
రాజ్యాంగ నిర్మాతలు ఈ విభజన ఎజెండాను వెనక్కి కొట్టడం విద్యుక్తధర్మంగా భావించారు. అయినా 78 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత ఆరెస్సెస్‌ ఇదే సంకుచితమైన ఒంటెద్దు ఫాసిస్టు తరహా హిందూ రాష్ట్ర దృక్పథాన్ని పట్టు కొని వేలాడుతున్నది. ప్రజాస్వామ్య లౌకిక గణతంత్రానికి దాన్ని పోటీగా చూపిస్తున్నది. ఇది ఎంత విషపూరిత మైందంటే ఆరెస్సెస్‌ భావజాలంతో ముడిపడిన ఒక గవర్నర్‌ కేరళలో ఆగస్టు 14న ”దేశ విభజన దినం”గా అధికారి కంగా పాటించేంత వరకూ వెళ్లారు.

నేటి కర్తవ్యం
ఈరోజున ఆరెస్సెస్‌ ప్రస్తుత ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కార్పొరేట్‌ మతతత్వ దుష్ట కూటమికి అగ్రభాగాన నిలిచి ఉంది. స్వతంత్ర రాజ్యాంగ అధికార వ్యవస్థలను ప్రత్యక్షంగా పరోక్షంగా దెబ్బతీయ చూస్తున్న నయా ఫాసిస్టు ధోరణులకు ఇదే మూల వనరుగా ఉంది. బీహార్‌లో ప్రత్యేక సమగ్ర పరిశీలన (ఎస్‌.ఐ.ఆర్‌) పేరిట ఓటు హక్కును పౌరసత్వంతో ముడి పెట్టేందుకు ఎన్నికల సంఘం చేస్తున్న మోసంలోనూ ఇదే కీలకం. తర్వాత ఇదే ప్రక్రియ దేశ మంతా అమలు చేయాలనేది కూడా కమిషన్‌ పథకంగా ఉంది.అందుకే స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడంతో పాటు పౌరసత్వ పరిరక్షణ, ఉమ్మడి సమాన పౌరసత్వం పరిరక్షణ కూడా తప్పక జరుపుకోవాలి. ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, సమాఖ్యవాదం, మన భిన్నత్వంలో ఏకత్వం కాపాడుకోవాలి.ఈ స్వాతంత్య్ర దినోత్సవ సమర శంఖారావం ఇదే.
(ఆగస్టు13 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad