మోడీ పాలనలో సంపన్నుల సంపద పైపైకి..
పేదల పరిస్థితి మరింత దయనీయం : సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి
నవతెలంగాణ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కలిగి దేశానికి స్వాత్రంత్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ఆ ఫలాలు ప్రజలకు నేటికీ అందడం లేదని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ ఎంహెచ్ భవన్ నవతెలంగాణ తెలుగు దినపత్రిక కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎడిటర్ రాంపల్లి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడారు. మోడీ ప్రభుత్వ పదేండ్ల పాలనలో అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల సంపన్నులు అత్యంత సంపన్నులు అవుతున్నారని, పేదలు అక్కడే ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ సూచికలతో పోలిస్తే.. భారతదేశ సూచికలు వందకుపైనే ఉండగా.. బంగ్లాదేశ్‌తో పోలిస్తే.. అనేక విషయాల్లో వెనకబడి ఉన్నామని తెలిపారు. యూఎన్‌వో నివేదిక పరిశీలనలో భారతదేశంలో మోడీ పాలనలో సంపన్నులు, పేద ప్రజల మధ్య చాలా వ్యత్యాసం పెరిగినట్టు తేలిందన్నారు. దేశంలో కార్పొరేట్ల ప్రయోజనాలు తప్ప ప్రజల బాధలు పాలకులకు పట్టడం లేదన్నారు. దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలకు పన్ను కట్టకుండా ఏదీ వచ్చే పరిస్థితి లేదన్నారు. మతదురభిమానం పెరిగిపోతోందన్నారు. ప్రజలు తమ ఆస్తులను అమ్ముకునే పరిస్థితి లేకుండా హక్కులు కాలరాయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఒక చైతన్యవంతమైన వ్యవస్థను మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అందులో నవతెలంగాణ దినపత్రిక ముఖ్య భూమిక పోషిస్తోందని అన్నారు.
సీజీఎం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశంలో స్వాతంత్య్రం, లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సార్వభౌమాధికారానికి ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు నవతెలంగాణ తన శక్తి మేరకు శాయశక్తులా కృషి చేస్తోందని చెప్పారు. నవతెలంగాణ పదో వార్షికోత్సవాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు. సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని ఉత్తేజం నింపారని తెలిపారు. వార్షికోత్సవ సభ జయపద్రానికి కృషిచేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎడిటర్ రాంపల్లి రమేష్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతున్న నేటి పరిస్థితుల్లో పత్రిక సిబ్బందిగా.. దాని రక్షణకు నిలబడాల్సిన అవసరముందని తెలిపారు. ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందని, దీనిపై పార్లమెంట్ నుంచి ప్రజల వరకు చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో బుకహేౌస్ ఎడిటర్ ఆనందచారి, హెచ్‌ఆర్ జనరల్ మేనేజర్ నరేందర్‌రెడ్డి, జనరల్ మేనేజర్లు వెంకటేష్, భరత్, శశి, మేనేజర్లు పవన్, మహేందర్, వీరయ్య, బోర్డు సభ్యులు హరి, సలీమా, మోహనకృష్ణ, అజరు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలకు అందని స్వాతంత్య్ర ఫలాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES