Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రజల మీద పన్నుల భారం

ప్రజల మీద పన్నుల భారం

- Advertisement -

– పంచుడు బంద్‌ చేసి.. పెంచుడు షురూ చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-సిద్దిపేట

ప్రజలపై పన్నుల భారం ఉండదని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం.. పంచుడు బంద్‌ చేసి.. పెంచుడు షురూ చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేటలోని తన క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ పన్నులు తగ్గిస్తే, రేవంత్‌రెడ్డి పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ పాలనలో ప్రజలపై అప్పుల, పన్నుల భారం తప్పా అభివృద్ధి లేదన్నారు. ప్రజలపై పన్నులు వేయడం లేదని శాసనసభలో చెబుతున్నా.. దొడ్డి దారిన పన్నులు మోపుతున్నారని విమర్శించారు. పాలనలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైందని, రోజుకో పన్ను వేస్తూ ప్రజలకు షాక్‌ ఇస్తోందని అన్నారు. గత నెల, ఈ నెలలో ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో రెండు వేల కోట్ల భారం వేశారన్నారు. గతంలో రూ.100 ఉన్న సర్వీస్‌ ట్యాక్స్‌ను రూ.200కు పెంచారని, వెహికిల్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ రూ.400 నుంచి ఒక పర్సంటేజ్‌ పెంచారని, రోడ్‌ ట్యాక్స్‌నూ పెంచారని, త్వరలోనే భూ రిజిస్ట్రేషన్ల ధరలు పెంచనున్నారని తెలిపారు. ఫెనాల్టీల పేరిట గత నెల రూ. వెయ్యి కోట్లు, ఈ నెల రూ.వెయ్యి కోట్లు మొత్తం రూ.రెండు వేల కోట్ల భారం వేశారన్నారు. గతంలో రూ.7100 కోట్ల ట్యాక్స్‌ వసూలు అయితే.. గతేడాది రూ.6900 కోట్లు మాత్రమే వచ్చిందని, ప్రభుత్వ నిర్వాకం మూలంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ట్రాన్స్‌పోర్ట్‌లో ట్యాక్స్‌లు రద్దు చేసి పేదలకు సాయం చేశామన్నారు. రేవంత్‌రెడ్డి తుగ్లక్‌ చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆర్‌అండ్‌బీ, పీఆర్‌లో అన్యూటి మోడల్‌లో రోడ్లు వేయాలని కుట్ర చేస్తున్నారని, దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.
పండుగకు ముందు వారం, తరువాత వారం ఆర్టీసీ చార్జీలు డబుల్‌ చేస్తున్నారని, సామాన్యులు ప్రయాణం చేయాలంటే భయపడుతున్నారని అన్నారు. మద్యం ధరలు రెండు సార్లు పెంచారని, ప్రతి గ్రామానికీ మద్యం షాపులు తెరిచి మహిళల తాళ్లు తెంపుతారా అని ప్రశ్నించారు. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వల్ల రాష్ట్రంలో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ తగ్గిందన్నారు. వెంటనే ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, కనకరాజు, సాయిరాం, అరవింద్‌రెడ్డి, మహేష్‌, మోహన్‌లాల్‌ ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad