నవతెలంగాణ-హైదారాబాద్: పోలవరం ముంపు ప్రజల కోసం నిర్మించిన పునరావాస కాలనీలలో వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని, తక్షణమే చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోతే సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సిపిఎం ఆల్ ఇండియా సెక్రెటరీ ఎంఎ.బేబీ హెచ్చరించారు. శనివారం తాళ్లూరు, నాగులపల్లి పునరావాస కాలనీలో ఎంఎ.బేబీ పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ …. వేల కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు కారణంగా మునిగిపోతున్నాయన్నారు. నిర్వాసితుల్లో 85 శాతం మంది ఆదివాసీలు ఉన్నారని తెలిపారు. పోలవరం నిర్వాసితులందరికీ గౌరవప్రదమైన పునరావాసం కల్పించాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వంపై ఉందని, కానీ సుదీర్ఘకాలంగా పూర్తి నిర్లక్ష్యం జరిగినట్లు స్పష్టమవుతుందని అన్నారు.నిర్మాణాల్లో నాణ్యత లోపం కారణంగా వర్షాలకు స్లాబులు నుంచి నీళ్లు కారిపోతున్నాయని, మరుగుదొడ్లు కూడా సక్రమంగా నిర్మించలేదని, తాగునీటి సౌకర్యము పూర్తిస్థాయిలో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. ఉపాధి కోసం ప్రతిరోజు 30 నుంచి 40 కిలోమీటర్లు నడకన వెళ్లాల్సిన దుస్థితి ఇక్కడి ప్రజలకు నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించినప్పటికీ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు అని అన్నారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పునరావాస గృహాలకు అర్హులైనవారు సైతం దూరమయ్యారని వివరించారు. వీటన్నిటినీ సిపిఎం రాష్ట్ర కమిటీ ఇప్పటికే ఆందోళన రూపంలో ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిందని, ఇప్పటికైనా తక్షణమే బాధ్యతాయుతంగా ప్రభుత్వం స్పందించాలని బేబీ డిమాండ్ చేశారు.
అనంతరం సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం మాట్లాడుతూ …. పోలవరం నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టంను అమలు చేయడంలో రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి అని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.55 వేల కోట్లు కాగా, ప్రజల పునరావాసానికి రూ.33 వేల కోట్లు ఖర్చు చేయాల్సింది ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులతో కూడిన పునరావాసం కల్పించాల్సిన బాధ్యతను గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు .
తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పరిశీలిస్తామని ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. ప్రజల సమస్యలు విన్నవించుకునేందుకు నోడల్ అధికారి సైతం అందుబాటులో లేరని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్వాసితులు జీవచ్ఛవాల్లా బతుకుతున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు. పాలక ప్రభుత్వాలు తక్షణమే స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సురేంద్ర, అల్లూరి సీతారామరాజు జిల్లా సిపిఎం కార్యదర్శి బి.కిరణ్, తూర్పుగోదావరి జిల్లా సిపిఎం కార్యదర్శి టి.అరుణ్, సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు లోతా.రామారావు, తదితరులు పాల్గొన్నారు.