దక్షిణాసియాలో చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం కల్లోలాలు, కుట్రలు ఎదుర్కొన్నప్పటికీ భారతదేశం స్థిరంగా నిలబడగలిగిందంటే ఇక్కడ బలీయమైన రాజ్యాంగ పునాదులు, ప్రజా చైతన్యం, లౌకిక సంస్కతే కారణం. కచ్చితంగా ఆ పునాదులకే ఇప్పుడు సవాలు ఎదురవు తున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలికిన పలుకులూ అదే తీవ్ర హెచ్చరికకు కారణమవుతున్నాయి. దేశంలో ప్రజాస్వామ్యం మొత్తం మీద పదిలంగా కొనసాగడానికి కీలకమైన ఒక కారణం సార్వజనిక లేదా సార్వత్రిక ఓటింగ్ హక్కు, కుల, మత జాతి, భాష, లింగ వివక్షలేని ఓటింగ్ హక్కు. పంజాబీ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ అనే రవీంద్రుడు రచించిన జాతీయ గీతాన్ని మనం పాడుకుంటున్నప్పుడు భారత భాగ్య విధాతను వీటన్నిటి ప్రతిరూపంగానే చూస్తాం తప్ప విభజనలు ఆలోచించం. ఈ నేపథ్యంలో ఎర్రకోట నుంచి చేసిన తాజా ప్రసంగంలో ప్రధాని మోడీ దేశ జనాభా పొందికను మార్చేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని చేసిన ఆరోపణల్లో అతిపెద్ద అదశ్య కుట్ర కనిపిస్తుంది. 140 కోట్ల జనాభా కలిగిన ఒక చారిత్రిక వైవిద్య భరిత దేశ జనాభా పొందిక ఎవరైనా ఎలా మార్చగలరనేది పెద్ద ప్రశ్న. అయితే అలా మారిపోతుందన్న భయాందోళనలు జనంలో సష్టించితే మిగిలిన పని దానికి అదే జరిగిపోతుం దన్నది మోడీ, ఆయనను నడిపించే ఆర్‌ఎస్‌ఎస్ సంఘ పరివార్ వ్యూహం. అందుకనే ఈ వ్యాఖ్యలతో పాటే ప్రధానమంత్రి వందేళ్ళ ఆర్‌ఎస్‌ఎస్ ఘనతను కూడా కీర్తించి తరించారు. దేశంలోనే అతిపెద్ద ఎన్జీవో (ప్రభుత్వేతర సంస్థ) గా ఆయనే అభివర్ణించిన ఆర్‌ఎస్‌ఎస్ దేశానికి మార్గదర్శి కావటం కన్నా అభ్యంతరకరమైన విషయం ఇంకొకటి ఉండదు.
మతాలు జాతుల ముచ్చటేంటి?
కానీ గతంలో వాజ్‌పేరు వంటి వారి హయాంలో రహస్య ఎజెండాగా ఉన్నది కాస్త ఇప్పుడు ఏకంగా ఎర్రకోటపై జాతీయ జెండాతో పాటు ఎగురవేయబడటమే దిగ్భ్రాంతి కరమైన విషయం. ఇరుగుపొరుగు దేశాల్లో నుంచి, ఇతర మతాల నుంచి ఈ ముప్పు పొంచి ఉందని మోడీ మాటల సారాంశం విడమర్చి చెప్పనక్కర్లేదు. కచ్చితంగా ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీని మించిన సనాతన సంఘీయుడు పవన్ కళ్యాణ్ కూడా దేశానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నదని ప్రతిపక్షాలపై నిందలు వేయడం యాదచ్ఛికం కాదు. ఇంచుమించు ఇదే రీతిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్రమంత్రి బండి సంజరు కూడా ”మార్వాడీలకు గుజరాతీలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు ముసుగులో కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నదని” అర్థరహితమైన అభండం వేశారు. రాజ్దీప్ సర్దేశారు లాంటి పాత్రికేయుడు దేశంలో ముస్లింలకే కాక క్రైస్తవులకు కూడా వేధింపులు పెరిగి పోతున్నాయని సూటిగానే వ్యాసం రాశారు. అక్రమ వలసలను అడ్డుకునే పేరిట బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు అనేకం గీత దాటి వ్యవహరిస్తున్నాయని ”హిందూ” స్వాతంత్య్ర దినోత్సవం రోజునే సంపాదకీయం రాసింది. అధికార పత్రాలు లేని బంగ్లాదేశీయులుగా ముద్రవేసి ఆ పేరుతో బెంగాలీల ఓటు హక్కు హరించే ఒక పెద్ద కార్యక్రమం సాగుతున్నదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శను పరోక్షంగా ‘హిందూ’ ప్రస్తావించింది. భారతదేశ విభజన సరిహద్దులు వలసవాద ప్రభుత్వం నిర్ణయించింది గనక సంయమనంతో వ్యవహరించాలని ఆ పత్రిక హెచ్చరిస్తే సరిగ్గా అదే అంశాన్ని వక్రీకరించి రాజకీయం నడిపిస్తున్నది బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌లే. దేశ విభజన ముప్పును మర్చిపోరాదని మోడీ చెప్పగా అమిత్ షా మరింత దూరం వెళ్లారు. ఆయన నియమించిన కేరళ గవర్నర్ ”విభజన దినమే జరిపారు. ఈ రకరకాల ఎత్తుగడల విడివిడి పరిణామాలను ఒక్క రేఖతో కలిసి చూడాలి. జాతీయత పౌరసత్వం మంత్ర జపంతో ప్రజలను మతప్రాతిపదికన విడగొట్టడం అసలు పథకం. పౌరసత్వం ఓటు హక్కు అన్న అంశాలను కలగాపులగం చేయడం రాజ్యాంగ విరుద్ధమని గతంలో చాలాసార్లు చెప్పుకున్నదే కానీ ఈ చర్చ తీసుకొచ్చిన బీజేపీ ఏకంగా కాంగ్రెస్ కీలక నేత సోనియాగాంధీకి అక్రమ ఓటు హక్కు కల్పించారని 45 ఏండ్ల కిందటి ముచ్చటలు తవ్వి తీసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. కేంద్రంలో పాలక కూటమికి పదేళ్లపాటు ఆధ్వర్యంవహించిన సోనియా గాంధీపైనే నేరుగా ఆరోపణలు చేస్తున్నవారు ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో మారుమూల పల్లెల్లో కొండ కోనల్లో అభాగ్య ఓటర్లను తప్పించడం ప్రబండాలు వేయటం పెద్ద సమస్య నా?
ఎందుకీ తెగింపు?
బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్ మత రాజకీయాలు తెలిసినవే గనుక ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది అనిపించవచ్చు. కానీ దేశ చరిత్రను జనాభాను మతాన్ని ప్రత్యక్షంగా కలిపి చూపించి చర్చకు పెట్టే ఈ ఎత్తుగడ నిస్సందేహంగా చాలా ప్రమాదకరమే. రాజకీయంగా తమ ప్రచారాలు, ఎత్తుగడలు ఇక పెద్దగా ఓట్లు తేవటం లేదని తెలిసిన తర్వాతనే ఎన్నికల వ్యవస్థను దాని మూల సూత్రాలతో పాటు పక్కదోవ పట్టించడం వారి అనివార్యమైన ఎత్తుగడగా పరిణమిస్తున్నది. గతంలో ప్రజాస్వామ్య చట్రం దెబ్బతిన్న దేశాల్లో కూడా ఇలాగే కుహనా విలువలు, కత్రిమ ప్రచారాలు, రాజ్యాంగానికి విచిత్ర భాష్యాలు చెప్పడం ద్వారానే ప్రజలను రెచ్చగొట్టారని మర్చిపోకూడదు. పైగా ఈ దాడి ఏ ఒక్క రంగానికో పరిమితంగా చేయకుండా అన్ని వైపులా విస్తరించటం ప్రత్యేకంగా గుర్తు చూడవలసి ఉంటుంది. ఎన్నికల సమయంలో, అది కూడా తాము గెలవలేని రాష్ట్రాల్లో ఆకస్మిక ఓట్ల ప్రక్షాళన పేరుతో నిర్మూలన చేయడం ఈ క్రమంలో అతిపెద్ద కుట్ర. స్వాతంత్రం వచ్చాక ఈ స్థాయిలో ఇంత పకడ్బందీగా ఇలాంటి కుట్ర చూసి ఉండమేమో. ఇలాంటి పరిస్థితుల్లో అత్యున్నత న్యాయస్థానం బీహార్ ఓట్ల తొలగింపు పై సంపూర్ణ వివరాలు సర్వజన సమక్షంలో ప్రకటించాలని స్పష్టంగా ఆదేశించటం ఒకింత ఉపశమనం. ఈ ఆదేశానికి పెద్ద విలువ లేనట్లుగా బడా మీడియాలో తగ్గించి చూపడం కూడా వ్యూహాత్మకమే. ఎన్నికల నిర్వహణ విషయంలో రాజ్యాంగమే కమిషన్‌కు పూర్తి అధికారం ఇచ్చిన మాట నిజమైనా దాని చర్యలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని పరిశీలించే అధికారం మాత్రం సుప్రీంకోర్టుకే ఉంటుంది. కనుక ‘సర’్ అనే ప్రక్రియ జరిపే అధికారం వారిదైతే అది రాజ్యాంగబద్ధమా కాదా చూసే హక్కు న్యాయస్థానందే. అన్ని వివరాలు లేకపోతే అలాంటి పరిశీలన సాధ్యం కాదు కనుక, సామాన్య ప్రజలకు ఓటర్లకు అసలే తెలియదు కనుక సంపూర్ణ వివరాలు ఒక్కచోట పెట్టాలని న్యాయమూర్తులు నిర్దేశించారు. తద్వారా ఈ ఓట్ల ప్రక్షాళనపై నిర్మూలన తతంగం రంగేమిటో తెలిసిపోతుంది. ఇంత పెద్ద ప్రక్రియలో 65 లక్షలు ఓట్లు తొలగించి ఒక ఓటు కూడా కొత్తగా చేర్చకపోవటం అంటే పూర్తిగా ఏకపక్ష వ్యవహారమని దానికి అదే చెప్పుకుంటున్నది. చచ్చిపోయిన వారు బతికి ఉండడం, బతికున్న వారు చచ్చిపోవటం, బతికున్న వారిని చంపడం జాబితాలో జరిగిందంటే వాటిని మామూలు తప్పిదాలను ఎలా చెప్తాం? ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని సమర్ధించుకోవడం ఎలా కుదురుతుంది? ఓటర్ల జాబితాలు పక్కాగా రూపొందించడమే లక్ష్యమైనప్పుడు ఉన్నతప్పులు తొలగించబడాలని తప్పుగా తొలగించటం కొత్త తప్పులు చేయడం కంటే ఘోరం ఏముంటుంది?
ప్రాంతీయ పార్టీల వింతవైఖరి
బాధాకరమైన విషయం ఏమంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బీజేపీ మత రాజకీయాలను ఏకపక్ష పొగడలను ప్రశ్నించకపోవడమే కాదు. టీడీపీ, జనసేనల వలె కేంద్రాన్ని పొగడ్డమే కాదు. పక్కదోవ పట్టించడం కూడా జరుగుతున్నది. ప్రజాస్వామ్యానికి మూల సూత్రం లాంటి సర్వజన ఓటు హక్కును రక్షించుకోవడం కోసం కేంద్రీకరించే బదులు రాష్ట్రాల్లో తమ ఆధిపత్యం ప్రత్యర్థులను ఎదుర్కోవటం మాత్రమే వారికి పరమార్థంగా మారింది. టీడీపీ కనీసం ఏపీలో ముందుగానే ఓట్ల పరిశీలన పూర్తి చేయాని కోరింది. కానీ వైసీపీ మాట్లాడటమే లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్ ప్రక్రియ అప్రజాస్వామికంగా సాగిస్తున్న తీరును వదిలిపెట్టి రాహుల్ గాంధీ ఏపీలో తమ ఓటమిపై ఎందుకు మాట్లాడరని ఆక్షేపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చివరి గంటలో దాదాపు 12 శాతం ఓట్లు అదనంగా పడ్డాయి అన్నది వైసీపీ ఆరోపణ. కానీ దానికి బాధ్యత ఎన్నికల సంఘం వహించాలి తప్ప కాంగ్రెస్ లేదా మరో ప్రతిపక్షం చేయగలిగిందేమిటి? నిబంధనలకు విరుద్ధంగా నెల రోజుల్లో ఉత్తుత్తి పరిశీలన జరిపి లక్షల ఓట్లు తొలగించడం వేరు, ఎన్నికల్లో ఈవీఎంలపై ఆరోపణలు, సందేహస్పద ఓటింగ్ వేరు. ఈ అన్ని విషయాలను కలిపి ఎన్నికల సంఘం తీరుపైన, కేంద్రం ఒత్తిడిపైన వామపక్షాలు, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు తమ తమ పద్ధతుల్లో అనేక విధాల పోరాడుతూనే ఉన్నాయి. వాటిలో వైఎస్‌ఆర్ పార్టీ ఏ రోజు గొంతు కలిపింది లేదు. 12శాతం అదనపు ఓటింగ్ అన్న విషయంపై రాహుల్ గాంధీ సరే జగన్మోహన్ రెడ్డి క్రమబద్ధతిలో కేంద్రం ఒత్తిడిని విమర్శిస్తూ ఏనాడైనా మాట్లాడారా? కొద్దిమంది వైసీపీ అభ్యర్థులు మినహాయిస్తే తమ నియోజకవర్గాల ఓటింగ్ సరళి నైనా సవాలు చేశారా? చేసిన వాళ్ళు నిలబడ్డారా? ఇవన్నీ కాదనలేని ప్రశ్నలు.
దేశంలో జనాభా పొందిక పేరుతో మత రాజకీయాలు చేయటం చొరబాటుదారుల పేరుతో అమాయకుల ఓట్లు అత్యధికంగా తొలగించటం కేంద్రం నిరంకుశత్వంగా వైయస్సార్ పార్టీ ఎప్పుడైనా విమర్శించిందా? ఇప్పటికైనా ఎన్నికల సంఘం పోకడలను ఏక మొత్తంగా ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉన్నారా? జగన్ మాటలపై కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారు అనేది ఒకటైతే ఈ సమయంలో ఓట్ల చర్చను ఏపీ ఏవీఎంల చర్చగా మార్చి వేయడం ఎవరికి ఉపయోగం? తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ కూడా ఈవీఎంలను మార్చివేసి బ్యాలెట్ పత్రాలకు తిరిగి వెళ్లాలని అంటున్నది. అదెలాగూ జరిగేది కాదని సుప్రీం కోర్టే వ్యాఖ్యానించింది. తప్పులను సవరించడానికి బదులు మొత్తానికి ఎసరు పెట్టడం ఆచరణ సాధ్యం అని తెలిసే మాట్లాడటమంటే ఇదే. పవన్ కళ్యాణ్ అయితే గెలిస్తే ఇవీఎంలు రైటు ఓడిపోతే తప్పు అంటున్నారని ఎన్నికల సంఘం భాషను మాట్లాడుతున్నారు. అదే నిజమైతే 2009లో బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వాటిపై పుస్తకం రాయడం దానికి చంద్రబాబు నాయుడు ముందుమాట రాయటం కూడా ఇదే నినాదంతో జరిగింది. ఈ ప్రాంతీయ పార్టీలు తెలుగు నాట విశాల జాతీయ ప్రయోజనాలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోణాన్ని పూర్తిగా విస్మరించి పరస్పర తగాదాలకు స్వల్పకాలిక అంశాలకు పరిమితం కావటం మరింత విచారం కలిగిస్తుంది. మన ఘన రాజ్యాంగ పునాదులనే ధ్వంసం చేసి, దేశ సామాజిక స్వరూపాన్ని తలకిందులు చేసే ఈ తీవ్ర పోకడలను విస్మరిస్తే వినాశనం తథ్యం.
తెలకపల్లి రవి
కేంద్రం కుత్సితాలు, కళ్లు తెరవని ప్రాంతీయులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES