గవర్నర్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్ గరంగరం
చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య కొంతకాలంగా అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా అవి మరోసారి బహిర్గతమయ్యాయి. ప్రతిపక్షాల కంటే గవర్నర్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర సీఎం ఎం.కె స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం సాంఘిక సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ”ప్రతిపక్షాలు చేసే విమర్శలపై నాకు ఆందోళన లేదు. ఎందుకంటే రాజకీయాల్లో అవన్నీ సహజం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్ రవి.. వారి (ప్రతిపక్షాలు) కంటే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. రాజ్‌భవన్‌లో ఉండి అధికార డీఎంకేకు వ్యతిరేకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం ప్రతిపాదించిన బిల్లులను ఆయన ఆమోదించరు. తమిళ గీతాన్ని అగౌరవపరుస్తారు. కానీ, రాష్ట్రంలో విద్య, శాంతి భద్రతలు, మహిళ భద్రతపై నిరాధారమైన ఆరోపణలు చేసి భయాం దోళనలు సృష్టిస్తారు” అని స్టాలిన్ ఆరోపిం చారు. తమిళనాడు దేశంలోనే అగ్ర రాష్ట్రమని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని స్టాలిన్ వివరించారు. దీంతో ప్రజా వేదికలపై గవర్నర్ అసహనం వెళ్లగక్కుతున్నారని విమర్శిం చారు. కేంద్ర ప్రభుత్వం తమ గవర్నర్ ద్వారా తమిళనాడులో చౌకబారు రాజకీయాలు చేస్తోందన్నారు. ఇటీవల జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగించిన రవి.. రాష్ట్రంలో మహిళల భద్రత, యువత మాదకద్రవ్యాల వినియోగం సహా పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను డీఎంకే నేతలు ఆరోజే తిప్పికొట్టారు.
అసత్యాల ప్రచారానికి రాజ్‌భవన్ అడ్డా
- Advertisement -
- Advertisement -