– టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్
– బీఆర్‌ఎస్, సీపీఐ(ఎం), సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ), సీపీఐఎంఎల్ (మాస్‌లైన్), వీసీకే పార్టీల మద్దతు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మూఢ నమ్మకాల నిర్మూలనా చట్టాన్ని తీసుకొస్తామని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హేతువాది నరేంద్ర దబోల్కర్ వర్ధంతి, జాతీయ సైంటిఫిక్ టెంపర్ డే పునస్కరించుకొని. తెలంగాణ మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి కన్వీనర్ విజ్ఞానదర్శిని రమేశ్ అధ్యక్షతన చర్చా వేదిక నిర్వహించారు. ఈ చర్చను మహేశ్‌కుమార్ గౌడ్ ప్రారంభించారు. ముసాయిదా చట్టాన్ని విడుదల చేశారు. ఈ చట్టం తేవాల్సిన అవసరముందనీ, ఈ మేరకు తాను ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తానని తెలిపారు. వారం రోజుల్లో చట్ట సాధన నాయకులు, ఉద్యమకారులతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసేలా సహకరిస్తానని మాటిచ్చారు. నిరక్ష్యరాస్యులు, గ్రామీణులే కాకుండా పట్టణాలకు చెందిన విద్యావంతులు కూడా మూఢ నమ్మకాల భ్రమలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో కేంద్ర స్థాయిలో చట్టాన్ని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ఆయన మాటలే తమకు ఆదేశమనీ, రాష్ట్రస్థాయిలో చట్టం చేస్తామని తెలిపారు. తమ స్వగ్రామంలో తన చిన్నప్పుడు బొజ్జయ్య అనే వ్యక్తిని మంత్రగాడంటూ ఊరంతా కలిసి సామూహికంగా హత్య చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూఢ నమ్మకాలు పోవాలంటే మరింత చదువు అవసరమని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి సైన్సును నమ్ముతుందనీ, ప్రోత్సహించిందని గుర్తు చేశారు. పండిత జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు ప్రధానమంత్రి హౌదాలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. బీజేపీ నాడు సైన్సు సంస్థల ఏర్పాటును వ్యతిరేకించిందని తెలిపారు. అదే పార్టీ ఆపరేషన్ కగార్‌ను ఆపాలని తాను కోరితే దేశద్రోహిగా ముద్ర వేసిందని చెప్పారు. దేశంలో మతవాద పార్టీలను ఓడించేందుకు కమ్యూనిస్టులతో సహా, లౌకికవాద పార్టీలన్ని మరింత బలోపేతం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టం తీసుకువస్తే మద్దతిస్తామని బీఆర్‌ఎస్, సీపీఐ(ఎం), సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ), సీపీఐ ఎంఎల్ (మాస్‌లైన్), వీసీకే పార్టీల నాయకులు ప్రకటించారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మహ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ నరేందర్ దబోల్కర్ లాంటి వారెందరి త్యాగాల ఫలితంగా సమాజం ముందుకెళ్తున్నదని తెలిపారు. అయితే ప్రస్తుతం సమాజంలో మూఢ నమ్మకాలను వ్యాప్తి చేసేవారు దాని కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయ, హేతువాద పోరాటం చేయకుంటే సమా జంలో మూఢ నమ్మకాలు పోయే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గొప్ప శాస్త్ర వేత్తలు కూడా మూఢ నమ్మకాలను అనుసరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకకాలంలో ఒక వ్యక్తి ఆలోచనల్లో శాస్త్రం, మూఢ నమ్మకాలుండే విచిత్ర పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాలని సూచించారు. కేంద్రంలోనూ ఇలాంటి చట్టంకోసం పోరాడుదామని పిలుపునిచ్చారు.
బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ సమాజంలో బలహీనతలను, రుగ్మతలను ఆసరగా మూఢ నమ్మకాలవైపు తిప్పుతున్నారని తెలిపారు. తమ స్వగ్రామం సంస్థాన్ నారాయణపురం చైతన్యవంతమైన పోరాటాలు చేసిన ఊరనీ, అయినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో మూఢ నమ్మకాలు పోలేదన్నారు. సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) రాష్ట్ర నాయకులు సదానందం మాట్లాడుతూ మూఢ నమ్మకాలకు, రాజకీయాలకు సంబంధం ఉందని తెలిపారు. ముందు వరసలో నిలిచి పోరాటం చేయాలన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకులు ఝాన్సీ మాట్లాడుతూ మూఢ నమ్మకాలకు మహిళలు, పిల్లలు, దళితులు ఎక్కువగా బాధితులుగా మారుతున్నారని చెప్పారు. విడుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితులు, శాస్త్రీయ ఆవిష్కరణలు వచ్చిన భావజాలరంగంలో మూఢ నమ్మకాలు పోవని స్పష్టం చేశారు. ఇందు కోసం ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు.
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ తొమ్మిది రాష్ట్రాలలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టాలు చేసినందున తెలంగాణలో కూడ చట్టం చేయాలని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలకు నివేదిక సమర్పిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర గ్రంధాలయ సంస్ధ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ ముసాయిదా చట్టాన్ని అన్ని గ్రంథాలయాల్లో అందుబాటులోకి తీసుకువస్తానని తెలిపారు. ఈ చర్చావేదికలో మానవ వికాస వేదిక కేంద్ర నాయకులు సాంబశివరావు, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, కులనిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వహిద్, జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షురాలు స్వరాజ్య లక్ష్మీ, విజ్ఞానదర్శిని రాష్ట్ర అధ్యక్షులు అదామ్ రాజ్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, వివిధ సంఘాల నాయకులు గుత్తా జొస్నా, అనసూయ, స్వరూప, అనురాధ, జ్యోతి, కృష్ణచంద్, రవితేజ, జాన్ తదితరులు పాల్గొన్నారు.