Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకర్నూలులో పెను విషాదం

కర్నూలులో పెను విషాదం

- Advertisement -

– నీటి కుంటలో దిగి ఆరుగురు విద్యార్థులు మృతి
– కన్నీటి సంద్రమైన చిగిలి గ్రామం
– ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌ విచారం
ఆస్పరి (కర్నూలు జిల్లా) :
కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో విషాదం చోటు చేసుకుంది. స్కూలు ముగిసిన తర్వాత సరదాగా ఈతకు దిగిన ఆరుగురు విద్యార్థులను నీటి కుంట కబలించింది. ఈ హృదయ విదారకమైన సంఘటన చిగిలి గ్రామంలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు, మరో ఇద్దరు రెండు కుటుంబాలల్లో ఏకైక కుమారులు కలరు. విద్యార్థులందరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆరు గురు చిన్నారులు మృతిచెందడం పట్ల సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారుల మృతి తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చిం దన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నీటిలో మునిగి మరణించడం తీవ్రంగా కలిచివేసిం దని జగన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుం బాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గ్రామస్తుల సమాచారం మేరకు.. చిగిలి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చదువు తున్న ఐదవ తరగతి విద్యార్థులు శశి కుమార్‌ (10), కిన్నెర సాయి (10), సాయికిరణ్‌ (10), భీమేష్‌ (10), వినరు (10), మహబూబ్‌ బాషా (10), దుర్గప్రసాద్‌లు కలిసి స్కూలు ముగిసిన తర్వాత పాఠశాలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి కుంటలో ఈతకొట్టేందుకు వెళ్లారు. శశి కుమార్‌, కిన్నెరసాయి, సాయికిరణ్‌, భీమేష్‌, వినరు, మహబూబ్‌బాషా నీటికుంటలోకి దిగారు. దుర్గప్రసాద్‌ ఒడ్డున ఉండిపోయారు. ఇటీవల కురిసిన వర్షాలకు కుంటలోకి భారీగా వరద నీరు చేరింది. కుంటలో ఈతకు దిగిన ఆరుగురు విద్యార్థులు బురదలో చిక్కుకుపోయారు. ఒడ్డుకు రాలేక ఊపిరాడక ఐదుగురు కుంటలోనే మరణించారు. స్నేహితులు ఒడ్డుకు చేరుకోకపోవడాన్ని దుర్గ ప్రసాద్‌ గమనించి గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పారు. గ్రామస్తులు కుంట వద్దకు చేరుకుని ఆరుగురిని ఒడ్డుకు చేర్చారు. కిన్నెరసాయి కొన ఊపిరితో ఉండడంతో ఆదోనికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. మృతి చెందిన విద్యార్థుల్లో భీమేష్‌, సాయికిరణ్‌ వారి తల్లిదండ్రులకు ఏకైక కుమారులు. ఉన్న ఒక్క కుమారుడిని ఉన్నతంగా చదివించాలని ఎంతో ఆశపడ్డామని, ఇలా విగతజీవులుగా మారతారని ఊహించలేదని తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురుని కంటితడి పెట్టించింది.
మృత్యువులో కూడా వీడని స్నేహం
శశి కుమార్‌, కిన్నెర సాయి అన్నదమ్ముల కుమారులు. ప్రతిరోజు ఇంటి నుంచి కలిసి పాఠశాలకు వెళ్లే అన్నదమ్ములు మృత్యువులో కూడా కలిసిపోయారని మృతుల తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి : ఎమ్మెల్యే విరుపాక్షి
మృతుల కుటుంబీకులను ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పాఠశాల సమీపంలోనే గుంత తవ్వి వదిలివేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. మృతుల కుటుంబీకులకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad