– పలువురు వక్తలు
– జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-హిమాయత్ నగర్
గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, బీహార్ రాష్ట్రాల తరహాలో మూఢ విశ్వాసాల నిరోధక చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘మూఢ విశ్వాసాల నిరోధక చట్టం అమలు’కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు నందిని సిదారెడ్డి మాట్లాడుతూ.. త్యాగంతోనే దేశం, సమాజం ముందుకు పోతోందని, ప్రజల కోసం అనేక మంది విజ్ఞాన శాస్త్రాన్ని జనవిజ్ఞాన వేదిక ద్వారా ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. చీకట్లను ఛేదించి, వెలుగులోకి వెళ్లడానికి జన విజ్ఞాన వేదిక కృషి చేయాలని సూచించారు. నేటి కంప్యూటర్ యుగంలో కొత్త మూఢ నమ్మకాలు వచ్చాయని, జాతకాలు, గోత్రాలు, మంత్రాల నమ్మకాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దెయ్యాలు, భూతాలు ఉన్నట్టు సినిమాలు, హత్యలు, నేరాలు, మూఢ నమ్మకాలు ఉన్న సినిమాలే ఎక్కువ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నివారణకు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేయాలని కోరారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లోనూ మూఢ నమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని, రాజ్యమే మూఢత్వంలో పోతోందని విమర్శించారు. శాస్త్రీయ భావజాలాన్ని రాజ్యాంగబద్ద్ధంగా కొనసాగిం చాలన్నారు. జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు రాజా, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ప్రముఖ సినీ దర్శకులు ఉమామహేశ్వర్‌రావు, సాహితీవేత్త శాంతారావు తదితరులు మాట్లాడారు. ఆర్టికల్ 51ఏ (హెచ్)ను సమర్థించాలని, విద్య, పాలన నుంచి సైన్స్ కమ్యూనికేషన్, ప్రజా చేరువ వరకు అన్ని రంగాల్లోనూ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వాలు రాజ్యాంగ విధిని చురుకుగా నెరవేర్చుతాయన్నారు. విద్య, ఆరోగ్యం, శాస్త్రీయ పరిశోధన, మానవీయ శాస్త్రాలు, కళలలో ఎక్కువ ప్రజా పెట్టబడులు పెట్టాలని కోరారు. అంతకుముందు నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డేను పురస్కరించుకుని.. ప్రజల కోసం విజ్ఞాన శాస్త్రాన్ని అందించి ఆయా దాడుల్లో చనిపోయిన అమరులకు నివాళలర్పించారు.
మూఢ విశ్వాసాల నిరోధక చట్టాన్ని చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES