నవతెలంగాణ హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిటాస్ సహా విపక్ష పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్, డీఎంకే తిరుచ్చి శివ, టీఎంసీ నేత శతాబ్ది రాయ్, శివసేన (యూబీటీ) సంజయ్ రౌత్‌లు ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 160 మంది ఎంపీలు ఆయనకు మద్దతుగా సంతకాలు చేసినట్లు సమాచారం. నామినేషన్ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి రశీదును అందజేశారు.
ఈసందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలపై నిబద్ధత, వినయభావంతో నామినేషన్ దాఖలు చేస్తున్నానని అన్నారు. తన జీవితం ప్రజాస్వామ్య సంప్రదాయాలతో ముడిపడి ఉందన్న ఆయన.. ప్రతి వ్యక్తి గౌరవం పైనే భారత్ వాస్తవశక్తి ఆధారపడి ఉందన్నారు. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
కాగా, తెలంగాణకు చెందిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి.. నాలుగున్నరేళ్ల పాటు 2007 నుంచి 2011 వరకూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అంతకుముందు 2005 నుంచి 2007 వరకు గువహటి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.